Revanth Reddy: 'ఫామ్ హౌస్ లో పన్నోడిలా కాదు'.. కేసీఆర్ పై రేవంత్ ఫైర్

వరదలపై హరీశ్ రావు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

Update: 2024-09-03 07:46 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : 75 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఉపద్రవం సంభవించిందని, ఆపదలో ఉన్న ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. తాను ఫామ్‌హౌస్‌లో పడుకున్నోడిలా కాదని, చెప్పింది చేస్తానని, చేసేదే చెప్తానని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు ఖమ్మం వెళ్లిన సీఎం ఇవాళ ఉదయం అక్కడే మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ప్రభుత్వ ముందుచూపు వల్లే ప్రాణనష్టం తగ్గిందన్నారు. రూ.5438 కోట్ల నష్టం జరిగిందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారని, పూర్తిస్థాయి నివేదిక వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కుటుంబాన్ని, రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు.

హరీశ్.. ఆక్రమణలపై స్పందించు..

80 వేల పుస్తకాలు చదివానని చెప్పిన వ్యక్తి ఫామ్‌హౌస్‌లో పడుకుంటే, అమెరికా పోయి కూర్చున్నాయన ఏదేదో మాట్లాడుతున్నాడని కేసీఆర్, కేటీఆర్‌ను ఉద్దేశించి సీఎం ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఇంత విపత్తు జరిగితే ప్రతిపక్షంలో ఉన్నోళ్లు నోరు మెదపలేకపోతున్నారని, కష్టాల్లో ఉన్న ప్రజలవైపు కన్నెత్తి చూడటం లేదని ధ్వజమెత్తారు. వరదలపై హరీశ్‌రావు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆక్రమణల వల్లే ఖమ్మంలో వరదల ప్రభావం పెరిగిందని, బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ ఆక్రమణలపై హరీశ్ స్పందించాలన్నారు. ఆక్రమించిన స్థలంలో పువ్వాడ ఆస్పత్రి కట్టారని, వాటిని తొలగించాలని పువ్వాడకు హరీశ్ చెప్పాలని సీఎం సూచించారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా గుర్తించి తాము ఆక్రమణలు తొలగిస్తామన్నారు.

హైడ్రా ఆగదు.. హైదరాబాద్‌ను మార్చి చూపిస్తా..

వరద సాయం కోసం కేంద్రానికి లేఖ రాశామని, జాతీయ విపత్తుగా పరిగణించి రూ. 2 వేల కోట్ల తక్షణ సాయం కోరితే కేంద్రం నుంచి ఇప్పటివరకు స్పందన రాలేదని రేవంత్ తెలిపారు. ప్రధాని మోడీ సానుకూలంగా స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రధానిని వెళ్లి కలుస్తానని తెలిపారు. తక్షణసాయంగా బాధితుల ఇంటికి బియ్యం ఇతర నిత్యావసరాలతోపాటు రూ.10 వేల నగదు అందజేస్తున్నామన్నారు. శానిటేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క కుటుంబం తిరిగి కోలుకునే వరకు ప్రభుత్వం అండగా నిలబడుతుందన్నారు. పక్క రాష్ట్రంతో పోల్చి చూస్తే మనం చాలా మెరుగ్గా పనిచేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. హైదరాబాదులో వ్యవస్థలను చక్కదిద్దేందుకు ప్రణాళికబద్ధమైన కృషి జరుగుతుందన్న సీఎం.. హైడ్రా ఆగదని ముందుకెళుతుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ పట్టణాన్ని తప్పనిసరిగా మార్చి చూపిస్తామన్నారు.

అశ్విని కుటుంబ సభ్యులకు పరామర్శ..

ఇటీవల వరదల్లో చిక్కుకుని మృతి చెందిన యువ వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్ కుటుంబ సభ్యులను సీఎం రేవంత్ కారేపల్లిలో పరామర్శించారు. అండగా ఉంటామని, ఆమె సోదరుడికి ఉద్యోగం కల్పించేందుకు కృషి చేస్తాని సీఎం హామీ ఇచ్చారు. అనంతరం ఖమ్మం జిల్లా నుంచి బయలుదేరిన సీఎం మహబూబాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. అక్కడ వరద ప్రభావిత ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.


Similar News