నరేంద్ర మోడీ రాజీనామా చేసి.. మళ్లీ ప్రధానమంత్రి పదవి చేపట్టకూడదు: రేవంత్ రెడ్డి ఫైర్

నరేంద్ర మోడీ రాజీనామా చేసి.. మళ్లీ ప్రధానమంత్రి పదవి చేపట్ట కూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-06-05 09:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: నరేంద్ర మోడీ రాజీనామా చేసి.. మళ్లీ ప్రధానమంత్రి పదవి చేపట్టకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే మోడీని చూపించే బీజేపీ వాళ్లు ఓట్లు అడిగారని అన్నారు. జనం మోడీని తిరస్కరించారు కాబట్టి ఆయన ప్రధానమంత్రి పదవిని చేపట్టకూడదని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సంతోషకరమైన ఫలితాలు వచ్చాయని, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులను ఏకం చేశారని పేర్కొన్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లో 39.5 శాతం ఓట్లతో ప్రజా పాలనకు ప్రజలు ఆమోదం తెలిపారని, వందరోజుల్లో 5 గ్యారంటీలను అమలు చేసి పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగామని వెల్లడించారు. ఈ ఎన్నికలు మా వంద రోజుల ప్రజా పాలనకు రెఫరెండం అని ముందే స్పష్టంగా చెప్పామన్నారు. ౧౭ పార్లమెంట్ స్థానాల్లో 8 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుందని, ఈ ఎన్నికల్లో 41శాతం ఓట్లు కాంగ్రెస్‌కు వచ్చాయని, అసెంబ్లీ ఎన్నికల్లో మాకు 39.5శాతం ఓట్లు వచ్చాయని అన్నారు.

మా ఓట్ల శాతం పెరిగిందని, మా పరిపాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఈ ఫలితాలతో అర్ధమవుతోంది.. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిపించి ప్రజలు మాకు మరో సీటు అదనంగా ఇచ్చారని తెలిపారు. 2019లో బీజేపీ 4 గెలిస్తే.. ఈ ఎన్నికల్లో 8 స్థానాలు అసెంబ్లీ ఎన్నికల్లో 20శాతం ఉన్న ఓట్ల శాతం ఈ ఎన్నికల్లో 35శాతానికి పెరిగాయని వెల్లడించారు. బీజేపీని గెలిపించేందుకు బీఆర్‌ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకుని అవయవదానం చేశారని, బీజేపీ గెలిచిన స్థానాల్లో బీఆర్ఎస్ 7 సీట్లలో డిపాజిట్లు కోల్పోయిందని, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సిద్దిపేటలో హరీష్ తమ ఓట్లను పూర్తిగా బీజేపీకి బదిలీ చేశారన్నారు. రఘునందన్ రావుకు ఓట్లను బదిలీ చేసి మెదక్ పార్లమెంట్ స్థానంలో బలహీన వర్గాల బిడ్డను ఓడించారని పేర్కొన్నారు. వెంకట్ రామ్ రెడ్డిని నమ్మించి మోసం చేసి మరీ కేసీఆర్ బీజేపీని గెలిపించారు.. అసెంబ్లీ ఎన్నికల్లో 37.5 శాతం ఓట్లు పొందిన బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో 16.5 శాతానికి పడిపోయింది. 2023లో 13శాతం ఓట్లున్న బీజేపీకి.. ఈ ఎన్నికల్లో 35.5 శాతంకు ఓట్లు పెరిగాయి అన్నారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆత్మ గౌరవాన్ని కేసీఆర్, కేటీఆర్, హరీష్ బీజేపీకి తాకట్టు పెట్టారన్నారు. పూర్తిగా ఓట్లను బదలాయించి కేసీఆర్ రాజకీయ ఆరాచకానికి పాల్పడ్డారని, రాష్ట్రంలో తనంతట తానే అంతర్ధానం అయ్యి బీజేపీకి కేసీఆర్ మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. బూడిదైన బీఆర్ఎస్ మళ్లీ పుట్టేది లేదని ధీమా వ్యక్తం చేశారు. వందరోజుల్లోనే మాపై ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. కుట్రపూరితంగా వ్యవహరించిన బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించారని, ఇప్పటికైనా వ్యవహార శైలి మార్చుకోవాలని బీఆరెస్ కు సూచన చేస్తున్నానని వెల్లడించారు. హరీష్.. ఆత్మాహుతి దళాలుగా మారి కాంగ్రెస్ ను దెబ్బతీయాలనుకుంటే చివరికి కనుమరుగై కాలగర్భంలో కలిసిపోతారని తెలిపారు. మోడీ గ్యారెంటీ పేరుతో బీజేపీ నేతలు ఈ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లారు. బీజేపీ 303 సీట్ల నుంచి 243కి పడిపోయిందని అన్నారు. మోదీ గ్యారెంటీకి వారంటీ చెల్లిపోయిందని ప్రజలు తీర్పు ఇచ్చారని తెలిపారు.

దేశ ప్రజలు మోడీని తిరస్కరించారని, తక్షణమే మోడీ ప్రధాని పదవికి రాజీనామా చేయాలని, ప్రజల తిరస్కరణకు గురైన మోదీ మళ్లీ ప్రధాని పదవి చేపట్టకూడదని అన్నారు. విలువలు కలిగిన నాయకుడిగా హుందాగా తప్పుకుంటే మోడీకి గౌరవం ఉంటుందన్నారు. ఇప్పటికైనా బీజేపీ అప్రజాస్వామిక తీరును మార్చుకోవాలన్నారు. ఇప్పటివరకు 18 గంటలే పనిచేసాం. ఇకనుంచి మరో రెండు గంటలు ఎక్కువ పనిచేస్తామని తెలిపారు. రాష్ట్రంలో గెలుపు, ఓటములకు పూర్తి బాధ్యత నాదే.. వచ్చిన ఫలితాలు ఉగాది పచ్చడిలాంటివి.. కేసీఆర్ బీజేపీ తో బేరసారాలు చేస్తున్నాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ ఆత్మ ప్రభోదానుసారం వ్యవహరించాలి. కేసీఆర్ ఒక రాజకీయ జూదగాడు... ఆయన ఉన్నంత కాలం కుట్రలు కుతంత్రాలు కొనసాగుతూనే ఉంటాయి. కేసీఆర్ అత్యంత అవినీతి పరుడు అన్న బీజేపీ... బీఆర్ఎస్ ఎలా జతకడుతుందో చూడాలి. ఏపీలో ఏ ప్రభుత్వం ఏర్పడినా రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకుంటాం. ఏపీకి ప్రత్యేక హోదా హామీపై కాంగ్రెస్ కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి వెల్లడించారు.


Similar News