ఒకే వేదిక‌పై చంద్ర‌బాబు, రేవంత్‌ రెడ్డి.. హైదరాబాద్ లో ఆ సభకు ముఖ్య అతిథులుగా..

ఒకే వేదిక‌పై చంద్ర‌బాబు, రేవంత్‌ రెడ్డి ప్రత్యక్షం కాబోతున్నారు.

Update: 2024-06-28 09:45 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగు రాజకీయాల్లో త్వరలో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకే వేదికను పంచుకోబోతున్నారు. హైదరాబాద్ వేదికగా జులై 21-21 తేదీలలో జరగబోయే తొలి ప్రపంచ కమ్మ మహాసభకు ఈ ఇరువురు ముఖ్య అతిథులుగా హాజరుకాబోతున్నట్లు కమ్మ మహాసభ వ్యవస్థాపకుడు జెట్టి కుసుమకుమార్ వెల్లడించారు. హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ లో నిర్వహిస్తున్న ఈ వేడుకలకు రేవంత్ రెడ్డి, చంద్రబాబుతో పాటు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. భారత దేశ జనాభాలో 1.5 శాతం, ప్రపంచవ్యాప్తంగా 2.1 కోట్ల మంది కమ్మ సామాజిక వర్గీయులు ఉన్నారని వీరిని ఒకే వేదికపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో పని చేస్తున్నట్లు కుసుమ కుమార్ చెప్పారు.

ఇప్పటి వరకు ఎదురు పడని రేవంత్, చంద్రబాబు:

గతంలో చంద్రబాబుకు సహచరుడిగా పని చేసిన రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించి తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సందర్భంలో ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డికి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఆ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు నాయుడు సీఎం కాగా రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అభినందనలు తెలియజేశారు. అయితే ఇప్పటి వరకు ఈ ఇరువురు పరస్పరం ఎదురుపడలేదు. జూన్ 12న ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి రేవంత్ రెడ్డి హాజరవుతారని అంతా భావించినా ఆయన వెళ్లలేదు. ఈ నేపథ్యంలో కమ్మ మహాసభలకు హాజరైతే ఈ ఇరువురు ఒకేసారి ఒకే వేదికను పంచుకునే అవకాశాలు ఉంటాయనే టాక్ వినిపిస్తోంది.

సానుకూల వాతావరణం:

రాష్ట్ర విభజన అనంతరం 2014లో తొలుత రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత వాతావరణం ఉన్నా కొద్ది రోజులకే నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో వీరిద్దరి మధ్య వ్యవహారం అంతా ఉప్పు నిప్పులా మారింది. ఈ క్రమంలో 2019లో తెలంగాణలో మరోసారి కేసీఆరే అధికారంలోకి రాగా ఏపీలో జగన్ సీఎం అయ్యారు. దాంతో ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం కొనసాగింది. ముఖ్యమంత్రి హోదాలో ఇరువురు పరస్పరం భేటీ అయ్యారు. అయితే ఇటీవల ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ ఇద్దరూ అధికారానికి దూరం అయ్యారు. దీంతో తెలంగాణలో రేవంత్ రెడ్డి, ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఈ నేఫ్యథ్యంలో విభజన చట్టంలోని అపరిష్కృత సమస్యల పరిష్కారానికి ఈ ఇరువురు సానుకూల వాతావరణంలో పరిష్కరించుకుంటారనే చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News