దిశ, వెబ్ డెస్క్: తెలుగు దేశం పార్టీ హవా కొనసాగుతున్న రోజుల్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ఆర్ పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తెచ్చారు. 2004, 2009లో వరుసగా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. తిరుగులేని నేతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది ప్రజల గుండెల్లో ఇప్పటికి చెరగని ముద్ర వేసుకున్నారు. రెండు పర్యాయాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పీసీసీ అధ్యక్షుడిగా ఉండటం ప్రజా సమస్యలపై పోరాటం, రాజకీయాలపై పూర్తి పట్టు ఉండటంతో టీడీపీ ప్రభుత్వ విధానాలను పాదయాత్ర ద్వారా ఎండగట్టడంలో వైఎస్ఆర్ సఫలమయ్యారు. 2004 మేలో జరిగిన 12వ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించి మెజార్టీ సీట్లను గెలుచుకుంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చి ఆ మేరకు సీఎం అయ్యాక అదే ఫైల్ పై తొలి సంతకం చేశారు. దీంతో రైతాంగానికి వైఎస్ఆర్ ఆపద్భాందవుడు అయ్యారు.
వైఎస్ బాటలో రేవంత్
ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి జనవరి 26 నుంచి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 వరకు యాత్ర చేపట్టనున్నట్లు నిన్న మీడియాతో తెలిపారు. 99 నియోజకవర్గాల్లో మార్పు కోసం యాత్ర పేరుతో యాత్ర చేపట్టనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తేవడం, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటి అధికారంలోకి రావడమే లక్ష్యంగా యాత్రకు ప్లాన్ చేశారు. ఇప్పటికే యాత్రపై రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తోంది. కాగా ఆనాడు వైఎస్ఆర్ కూడా పాదయాత్ర చేపట్టి కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి తీసుకువచ్చారు. 2003లో అనాటి ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ఆర్ 1,467 కిలోమీటర్లు పర్యటించారు. వైఎస్‌కు పాదయాత్ర మంచి పేరు తేవడంతో పాటు 2004 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
ముఖ్యమంత్రి పీఠాన్ని వైఎస్ఆర్ అధిష్టించారు. వైఎస్ఆర్ పాదయాత్ర స్ఫూర్తితో రేవంత్ రెడ్డి మార్పుకోసం యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లనున్నారు. ప్రజల జీవితాలు, పరిపాలనలో మార్పుకోసం యాత్ర ఫర్ ఛేంజ్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టేందుకు రేవంత్ రెడ్డి సమాయత్తమయ్యారు. ప్రజల కష్టాలు తీర్చడానికి కాంగ్రెస్‌ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తమకు గతంలో కలిసి వచ్చిన యాత్ర ఫార్ములానే ఈ సారి ఎంచుకోవడం విశేషం.
ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని స్థాపించి అతి తక్కువ కాలంలో అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించారు. కాంగ్రెస్ పార్టీలో 1978 కాలంలో అధికారంలోకి వచ్చినా అంతర్గత కుమ్ములాటాల కారణంగా ఐదు సంవత్సరాల కాలంలో నలుగురు ముఖ్యమంత్రులు మారారు. అప్పటికే రాష్ట్ర రాజకీయాలను నిశితంగా పరిశీలించిన ఎన్టీఆర్ 1982 మార్చి 29 సాయంత్రం పార్టీ స్థాపించబోతున్నట్లు ప్రకటించి సంచలనం రేపారు. పార్టీ ప్రచారం కోసం తన పాత చెవ్రోలెట్ వ్యానును బాగు చేయించి దానిని కదిలే వేదికగా తయారు చేసుకున్నారు. దానిపై నుంచే ప్రసంగాలు చేసేవారు. దానికి చైతన్య రథం అని పేరు పెట్టి తెలుగు దేశం పిలుస్తోంది. రా! కదిలారా! అనే నినాదాన్ని రాయించి తెలుగు ప్రజలకు చేరువయ్యారు. 97 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని 9 నెలల తెలుగు దేశం పార్టీ ఓడించి ప్రభంజనం సృష్టించింది. 1983 జనవరి 7 న ఫలితాలు విడుదల కాగా 199 సీట్లను టీడీపీ గెలుచుకుని ఎన్టీఆర్ సీఎం పీఠం దక్కించుకున్నారు.
అదే బాటలో పవన్..
ఎన్టీఆర్ చైతన్య రథం స్ఫూర్తితో అనేక రాజకీయ పార్టీలు బస్సు యాత్రలు చేపట్టాయి. తాజాగా 2024 ఎన్నికలే లక్ష్యంగా ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ వారాహి అనే వాహనాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. కాగా ఈ వారాహి వాహనం ఇటీవల వార్తల్లో నిలిచింది. ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం చేసిన ఈ వాహనం యుద్ధ ట్యాంకర్‌ని పోలినట్లు ఉంది. ప్రజల్లోకి వెళ్లి అధికార వైసీపీని నిలదీసి జనసేన పార్టీని అధికారంలోకి తేవడంపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెంచారు. ప్రత్యేకంగా తయారు చేసిన ఈ వాహనం రంగుపై చర్చ సాగింది.
అన్ని నియోజకవర్గాల్లో పవన్ పర్యటనలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ దఫా ఏపీలో అధికారంలోకి వచ్చేందకు అటు బీజేపీ ఇటు టీడీపీ తలుపులను పవన్ తెరిచి ఉంచారు. ఏ అవకాశం వచ్చినా చేజార్చుకోవద్దని ధృడ నిశ్చయంతో ఉన్నారు. నాడు ఎన్టీఆర్ ప్రచార రథంలా ఓ ప్రత్యేక వాహనాన్ని రూపొందించి ప్రజల్లోకి వెళ్లి తన అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. మరి ఏపీలో పవన్ కళ్యాణ్, తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆనాడు ఎన్టీఆర్, వైఎస్‌ఆర్ చూపిన ప్రభావాన్ని రానున్న ఎన్నికల్లో ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలంగాణలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చూపుతారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
అసెంబ్లీ వేదికగా కేసీఆర్ భారీ స్కెచ్.. చరిత్రలో ఇదే మొదటిసారి కానుందా..?