పరిస్థితిని పునరుద్ధరించండి.. కేఆర్‌ఎంబీకి తెలంగాణ లేఖ
ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య జల వివాదాల కారణంగా రెండు రాష్ట్రాల పోలీసులే కాదు.
దిశ, నాగార్జునసాగర్ : ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య జల వివాదాల కారణంగా రెండు రాష్ట్రాల పోలీసులే కాదు.. చివరకు సీఆర్పీఎఫ్ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద నవంబర్ 28వ తేదీకి ముందున్న పరిస్థితిని పునరుద్ధరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కృష్ణాబోర్డుకు తెలంగాణ లేఖ రాసింది. ఇటీవల జరిగిన కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సాగర్‌ను తెలంగాణనే నియంత్రించేలా అనుమతించాలని నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖలో పేర్కొన్నారు.
అందుకు అనుగుణంగా నవంబర్ 28వ తేదీకి ముందున్న పరిస్థితిని పునరుద్ధరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కృష్ణాబోర్డుకు విజ్ఞప్తి చేశారు. డ్యాం వద్ద సీఆర్పీఎఫ్ బలగాల మోహరింపునకు తెలంగాణ ప్రభుత్వం సహకరించినట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునేలా తక్షణమే స్పందించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు మురళీధర్ విజ్ఞప్తి చేశారు.
రేపు ఇరు రాష్ర్టాలతో కేంద్రజల్‌శక్తిశాఖ భేటీ సాగర్ డ్యామ్ ఆక్రమణ నేపథ్యంలో వివాదం పరిష్కారానికి కేంద్ర జల్‌శక్తి శాఖ రేపు (బుధవారం) మరోసారి ఇరు రాష్ర్టాలతో భేటీ కానున్నది. ఇప్పటికే ఒక దఫా సమావేశాన్ని నిర్వహించగా, ఎన్నికల నేపథ్యంలో 5వ తేదీ తరువాత సమావేశం నిర్వహించాలని కేంద్ర జల్‌శక్తిశాఖకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి విజ్ఞప్తి చేశారు. దీంతో 6వ తేదీన మరోసారి సమావేశం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ సమావేశంలో కృష్ణా జలాల పంపిణీ వివాద పరిషారం, నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ అంశాలపై కూలంకషంగా చర్చిస్తామని వెల్లడించింది.
కొలిక్కిరాని ఆపరేషన్ ప్రొటోకాల్ గెజిట్ అమలులో భాగంగా కేంద్ర జలసంఘం నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి విద్యుత్తు ఉత్పత్తికి ప్రొటోకాల్, ఉమ్మడి ప్రాజెక్టుల రూల్ కర్వ్, డ్యామ్ సేఫ్టీ తదితర అంశాలకు సంబంధించిన డ్రాఫ్ట్‌ను రూపొందించింది. దానిపై అధ్యయనం చేసి సిఫారసులు చేయాలని కేఆర్‌ఎంబీకి సూచించింది. అందులో భాగంగా కేఆర్‌ఎంబీ గతంలో రిజర్వాయర్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఆర్‌ఎంసీ)ని ఏర్పాటు చేసింది.
కమిటీలో కేఆర్‌ఎంబీ మెంబర్ (పవర్), ఇరు రాష్ర్టాల ఈఎన్సీలు, టీఎస్‌జెన్‌కో హైడల్ పవర్, ఏపీ జెన్‌కో హైడల్ పవర్ చీఫ్ ఇంజినీర్లు మొత్తం 6 మంది సభ్యులున్నారు. సీడబ్ల్యూసీ రూపొందించిన రూల్‌కర్వ్, ఆపరేషన్ ప్రొటోకాల్ అంశాలపై ఈ కమిటీ చర్చించింది. అయితే డ్రాఫ్ట్‌లోని అనేక అంశాలపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. శ్రీశైలం ముమ్మాటికీ జలవిద్యుత్తు ప్రాజెక్టేనని వాదించింది.
విద్యుత్తు ఉత్పత్తి, క్యారీ ఓవర్, వరదజలాల మళ్లింపు తదితర అంశాలపై సీడబ్ల్యూసీ ప్రతిపాదనలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని తెలంగాణ తేల్చిచెప్పింది. ఆర్‌ఎంసీ ప్రతిపాదనలను తప్పుబట్టింది. కానీ, ఆర్‌ఎంసీ రూపొందించిన ఆ రిపోర్టుపై ఏపీ ప్రభుత్వం మాత్రం సంతకం చేసింది. తెలంగాణ సంతకం చేయకపోవడంతో పెండింగ్‌లోనే ఉండిపోయింది. కాగా, సాగర్ వివాదం నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ కార్యాలయంలో కీలక సమావేశం జరుగుతున్నది.
రెండు రాష్ట్రాల అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సమావేశమయ్యారు. కేంద్ర జలసంఘం, కేఆర్‌ఎంబీ అధికారులు నేరుగా హాజరుకాగా, ఇరు రాష్ట్రాల కార్యదర్శులు, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‌ఎఫ్ డీజీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. సాగర్, శ్రీశైలం డ్యాం, రిజర్వాయర్ల నిర్వహణ బాధ్యలు, వాటి పరిధిలో ఉన్న అనుబంధ ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు బదిలీచేసే అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం.