RDC: రుణం ఇస్తాం సరే.. తిరిగి ఎలా చెల్లిస్తారు? ఆర్డీసీకి బ్యాంకర్ల ప్రశ్నలు

ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ పేరుతో అప్పు తీసుకోవడానికి రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

Update: 2024-08-09 02:37 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ పేరుతో అప్పు తీసుకోవడానికి రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. పలు బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే రుణం ఇవ్వడానికి బ్యాంకులు సంసిద్ధంగానే ఉన్నా.. అసలు, వడ్డీ ఎలా చెల్లిస్తారంటూ కార్పొరేషన్ ను ప్రశ్నిస్తున్నాయి. తీసుకునే రుణాలతో అభివృద్ధి పనులు చేపట్టినా.. ఏ విధంగా ఆదాయాన్ని సమకూర్చుకుంటారు? బ్యాంకుల అప్పుల్ని ఎలా తీరుస్తారు? ఇలాంటి ప్రశ్నలకు కార్పొరేషన్లు సరైన సమాధానాలు ఇవ్వలేకపోతున్నాయి. ఈ కారణంతో బ్యాంకుల నుంచి ఆర్డీసీకి అప్పులు పుట్టడం గగనంగా మారిందనే చర్చ జరుగుతున్నది. లోన్లు తిరిగి చెల్లించేందుకు ఆదాయ వనరుల గురించి బ్యాంకులకు వివరాలు అందించేందుకు టీఎస్ఆర్డీసీ తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం.

ప్రభుత్వం గ్యారంటీగా ఉంటున్నా..

రాష్ట్రంలోని రోడ్ల అభివృద్ధి, నిర్మాణానికి రుణం తీసుకోవడానికి ఆర్డీసీకి రిజర్వ్‌ బ్యాంకు (ఆర్బీఐ) అనుమతి ఇచ్చిందని ఆ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఆర్డీసీ గతంలో తీసుకున్న రుణంతో రాష్ట్రంలోని పలు రోడ్లను అభివృద్థి చేసిందని, వడ్డీతో సహా అప్పుల్ని క్రమం తప్పకుండా చెల్లించిందని గుర్తు చేస్తున్నారు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్నాన.. రుణ సేకరణ విషయంలో ఆర్బీఐ పర్మిషన్‌ ఇచ్చినందున డాక్యుమెంటేషన్‌ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవన్నది ఆర్డీసీ అధికారుల వాదన. గతంలో ఆర్డీసీ తీసుకున్న లోన్లకు ప్రభుత్వమే రీ-పేమెంట్ చేసిందని, అప్పట్లో బ్యాంకర్లు పెద్దగా అభ్యంతరం చెప్పకపోయినా.. ఇప్పుడు మాత్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నదని ఆర్డీసీ అధికారులు వివరించారు. ప్రభుత్వం గ్యారంటీ ఉంటున్నా కార్పొరేషనే నేరుగా తగిన ఆదాయ వనరులను చూపించి వాటి ద్వారానే రుణాలను తీర్చాలంటూ పట్టుబడుతున్నారని పేర్కొంటున్నారు.

సొంత ఆదాయ వనరులు చూపించాలని..

బ్యాంకులు ఇచ్చే లోన్ల ద్వారా ఆర్డీసీ రాష్ట్రంలో రోడ్లు నిర్మించినా.. ఈ పనులతో ఆదాయం సమకూరుతుందా అని బ్యాంకులతో పాటు ఆర్బీఐ అధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీ సరిపోదని, కార్పొరేషన్ కు సొంత ఆదాయం తప్పనిసరిగా ఉండాలని, దాన్ని చూపించాలని చెబుతున్నారు. దీంతో ఆర్డీసీ అధికారులు సొంత ఆదాయం వచ్చే విధానాలపై ఆలోచనలో పడ్డారు. బ్యాంకులు సంతృప్తి చెందేలా రోడ్ మ్యాప్‌ను తయారు చేయడంపై ఫోకస్ పెట్టారు. గతంలో ఆర్డీసీ బోర్డు సమావేశంలోనూ ఈ విషయం చర్చకు వచ్చింది. ఆదాయ మార్గాల అన్వేషణకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి కావడంతో సమాలోచనలు కూడా జరిగాయి. రాష్ట్ర బడ్జెట్‌ నిధులపై కాకుండా సొంత నిధులతో చెల్లింపులు చేసే విధంగా ప్రణాళికలు వేయడంపై తర్జన భర్జన మొదలైంది. కార్పొరేషన్ సొంతగా ఆదాయాన్ని ఆర్జించాలంటే దానికి రాష్ట్ర ప్రభుత్వ పర్మిషన్ తప్పనిసరి. అప్పు ఇవ్వడానికి బ్యాంకులు సూచించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి తెలియజేయాలని ఆఫీసర్లు భావిస్తున్నారు. త్వరలో దీనిపై స్పష్టత రానున్నది.

ఆర్డీసీ తీసుకున్న లోన్‌ ఎంత?

గతంలోనే ఈ సంస్థ రోడ్ల అభివృద్థికి రెండు విడతలుగా రూ.2,600 కోట్ల రుణాన్ని తీసుకున్నది. వీటికి సంబంధించిన అసలు, వడ్డీ క్రమంగా చెలించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. చెల్లింపుల్లో ఆర్డీసీ ట్రాక్‌ రికార్డు బాగున్నదని గుర్తుచేశారు. ఆర్బీఐ నుంచి అనుమతి వచ్చినందున జాతీయ బ్యాంకుల నుంచి రూ. 800 కోట్లు రుణం తీసుకోవాలని ఆర్డీసీ గతంలో జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయించింది. బ్యాంకుల నుంచి రుణం ఇస్తే, ఏ రోడ్లు అభివృద్ధి చేయాలో, వాటితో రూరల్‌ రోడ్లు, రాష్ట్ర రహదారులు ఎన్ని నిర్మించాలి? తదితర అంశాలపై అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్‌)ను కూడా అధికారులు సిద్ధం చేసినట్టు తెలిసింది.

ఆదాయ మార్గాలేంటి?

రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఆర్డీసీ) సొంతంగా ఆదాయ మార్గాలు సృష్టించుకోవాలని, అందుకు కొన్ని విధానాలు మార్చుకోవాల్సి ఉంటుందని ఆ శాఖ ఉన్నతాధికారులు వ్యాఖ్యానించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెట్రోలు, డీజీల్ విక్రయాలపై ప్రతి లీటర్‌కు ఒక రూపాయి చొప్పున ‘సెస్’ పేరుతో వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు.. ఈ మొత్తం ఆర్డీసీ ఖాతాలో జమ అవుతున్నది. దీంతో ఆ రాష్ట్రాల ఆర్డీసీలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నాయి. రహదారుల నిర్మాణం, మెయింటెనెన్స్ సులభం అవుతుందుని తెలంగాణ ఆర్డీసీ అధికారులు వివరించారు. ఇక్కడ కూడా ఆ తరహాలోనే చేస్తే ఇబ్బందులుండవని, కానీ రాష్ట్ర ప్రభుత్వం విధానపర నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. లోన్ రావాలన్నా, ఆర్డీసీ ఆర్థికంగా పరిపుష్టి సాధించాలన్న ఇదే ఉత్తమమైన మార్గమన్నారు. అయితే లీగల్‌గా ఆర్డీసీ చట్టానికి సవరణ చేయాల్సి ఉంటుందా? లేక ఎగ్జిక్యూషన్ ఆర్డర్‌‌తో సరిపెట్టుకోవచ్చా? అనే విషయంలో అధికారులు న్యాయశాఖ అభిప్రాయం కోరనున్నారు.

Tags:    

Similar News