వికారాబాద్ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా
వికారాబాద్ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.
దిశ, మోమిన్ పేట్ : వికారాబాద్ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శుక్రవారం మోమిన్ పేట్ మండల ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో లబ్ధిదారులకు రూ.500లకే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్ నియోజకవర్గంలోని నందివాగు, సర్పంపల్లి, కొంశెట్టిపల్లి ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆయా ప్రాజెక్టులలో బోట్లు ఏర్పాటు చేసి దానికి తగిన సదుపాయాన్ని కల్పిస్తానని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానని పేర్కొన్నారు.
అనంతగిరి కొండలను కూడా అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. పంచాయతీ, ఆర్అండ్బీ రోడ్లకు 600 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు చేపడతామని చెప్పారు. మోమిన్ పేట్ మండలంలో 4100 మంది సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కు అర్హత పొందారని వివరించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల లబ్ధిదారులకు వచ్చే నెల నుంచి లక్ష16 వేలు, తులం బంగారం ఇస్తామని అన్నారు. అధిక వర్షాలతో వంట నష్టం జరిగిన రైతులకు ఎకరాకు పదివేలు ఇస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విజయలక్ష్మి, ఎమ్మార్వో మనోహర్ చక్రవర్తి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు శంకర్, నరోత్తంరెడ్డి, మానయ్య, సిరాజుద్దీన్, ఎంపీఓ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.