బఫర్‌జోన్‌లో ఉన్న అక్రమ నిర్మాణాల సంగతేంటి...?
హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలు
దిశ ప్రతినిధి, వికారాబాద్ : హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలు చేపడితే చాలు హైడ్రా గంటల వ్యవధిలో నిర్మాణాలను కూల్చి నేలమట్టం చేస్తుంది. దీంతో బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన చాలామంది వ్యాపారులు, రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గత శనివారం టాలీవుడ్ ప్రముఖ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెక్షన్ ను హైడ్రా నేలమట్టం చేసింది. అప్పటినుంచి హైడ్రా పబ్లిసిటీ మరింత పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఎవరి నోట విన్న హైడ్రా మాటే వినిపిస్తుంది. ఇలాంటి తరుణంలో హైదరాబాద్ పరిధిలోనే కాక రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలు, పట్టణాలు, గ్రామాల పరిధిలో ఉన్న చెరువులను కబ్జా చేసి కొందరు అక్రమ వెంచర్లను, ఫామ్ హౌస్ లో నిర్మాణాలు చేపట్టి అక్రమ ఆదాయాలకు శ్రీకారం చుట్టారు.
అలాంటివారికి అసలు అనుమాతులు ఎవరు ఇచ్చారు..? గతంలో ఇచ్చిన అనుమతులన్ని నిబంధనల ప్రకారమే ఉన్నాయా..? అనే విషయాన్ని నిగ్గు తేల్చాల్సిన బాధ్యత సంబంధిత శాఖ అధికారులతో పాటు జిల్లా ఉన్నత యంత్రంగానికి ఉన్నదని సర్వత్ర ప్రజల్లో వ్యక్తం అవుతుంది. వికారాబాద్ పట్టణానికి ఎన్నో ఏళ్లు తాగునీరు అందించిన శివసాగర్ చెరువు బఫర్ జోన్ ఏరియాలో అనేక నిర్మాణాలు వెలిశాయి. ప్రభుత్వ నిబంధన ప్రకారం ఇలాంటి ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వొచ్చా..? ఒకవేళ చట్ట విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలను హైడ్రా స్థాయిలో కూల్చివేసి చెరువులను కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
బఫర్ జోన్ లో లేఔట్లకు అనుమతులు ఎలా ఇచ్చారు...?
వికారాబాద్ పట్టణంలోని శివసాగర్ చుట్టూ కొందరు వ్యాపారులు ఏకంగా లే అవుట్లు చేసి ప్లాట్లు అమ్ముతున్నారు. ఈ వెంచర్లలో నిర్మాణాలు చేపడితే అట్టి నిర్మాణాల నుంచి వచ్చే డ్రైనేజీ వాటర్ శివ రెడ్డి పేట చెరువులో కలిసే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఈ వెంచర్లకు డిటిసిపి అనుమతులు ఎలా వచ్చాయి అనే ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఇవే కాక కొందరు ఏకంగా చెరువులోనే నిర్మాణాలు చేపట్టి వ్యాపారాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇలా రోజురోజుకు కబ్జాకు గురవుతున్న శివారెడ్డి పెట్ లాంటి చెరువులను కాపాడడంలో భాగంగా ప్రభుత్వం హైడ్రా లాంటి ప్రత్యేక బృందాన్ని జిల్లాల పరిధిలో కూడా ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికైనా కళ్ళు తెరిచి అటు ప్రజా ప్రతినిధులు గాని ఇటు జిల్లా ఉన్నత యంత్రాంగం గాని చొరవ తీసుకొని అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వెంచర్లను తొలగిస్తే బాగుంటుందని పట్టణ ప్రజలు కోరుతున్నారు. జిల్లా కలెక్టర్ ఈ విషయంలో పూర్తిస్థాయిలో విచారణ చేసినట్లయితే శివ సాగర్ చెరువు చుట్టూ ఉన్న అక్రమ లేఅవుట్లు, నిర్మాణాల బాగోతం బట్టబయలు అయ్యే అవకాశం ఉంటుంది. గతంలో ఈ అనుమతులు ఇచ్చిన సంబంధిత అధికారుల పైన కూడా చర్యలు తీసుకుంటే రాబోవు రోజుల్లో ఏ అధికారి కూడా అక్రమ లేఔట్లకు, నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడానికి జంకే అవకాశం ఉంటుందని ప్రజలు పేర్కొంటున్నారు.