కాంగ్రెస్‌తోనే సుభిక్ష పాలన : ఎంపీ రంజిత్ రెడ్డి
కాంగ్రెస్ పాలనలోనే రాష్ట్రం, దేశంలోని ప్రజలు సుభిక్షంగా ఉంటారని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు.
దిశ, తాండూరు : కాంగ్రెస్ పాలనలోనే రాష్ట్రం, దేశంలోని ప్రజలు సుభిక్షంగా ఉంటారని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం బషీరాబాద్ మండలం ఏంకాబరి ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి రంజిత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల శంఖరామం ప్రారంభించారు. మండలం మైల్వార్, దామర్ చెడ్, బషీరాబాద్, నవాల్గ, గొట్టిగ కుర్థు, ఇతర గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి రంజిత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ..
రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి అండగా ఉండేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. స్థానిక సంస్థల ఏర్పాటుతో ప్రజలను పాలనలో భాగస్యాములను చేసిన కాంగ్రెస్ పార్టీ, ప్రణాళికా బద్ధంగా అభివృద్ధికి బాటలు వేసిందన్నారు. బీజేపీ గుడి, మతం పేరుతో రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. దేశ భవిష్యత్తుకు వచ్చే లోక్‌సభ ఎన్నికలు కీలకం కానున్నాయని.. బీజేపీని ఓడిస్తే ప్రజాస్వామ్యానికి మనుగడ ఉంటుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 14 ఎంపీ స్థానాల్లో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాను ఎంపీగా పని చేసి సమయంలో చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేశానని పేర్కొన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు తన గెలుపుకోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2లక్షల రుణ మాఫీ, రాష్ట్రానికి పదేళ్ల గ్యారెంటీతో ప్రత్యేక హోదా, పేద కుటుంబంలోని మహిళకు సంవత్సరానికి రూ.లక్ష ఆర్థిక సాయం, వృద్ధులు, వితంతువులకు రూ.4 వేల పెన్షన్ అంది స్తామన్నారు. రెండు లక్షల ప్రభుత్వోద్యోగాల భర్తీ, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా నాయకులంతా విజయం కోసం ఐక్యతా నినాదాలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏవిధంగా పని చేసి అధికారంలో తీసుకొచ్చారో అదే స్ఫూర్తితో ఎంపీ ఎన్నికల్లో పనిచేసి చేవెళ్ల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.