ప్రధాని ప్రైవేట్ పర్యటనకు వచ్చాడు: TRS

Update: 2022-02-05 17:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో జగద్గురు రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. ఈ మేరకు ఆయన శనివారం తెలంగాణలో పర్యటించారు. అయితే, ప్రొటోకాల్ ప్రకారం.. ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలకాలి. కానీ, అనారోగ్యం కారణంగా ముఖ్యమంత్రి ప్రధానిని రిసీవ్ చేసుకోలేకపోయారు. దీంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ప్రధాని రాకతో కేసీఆర్‌కు జ్వరం పట్టుకున్నదని బీజేపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారు. తాజాగా.. దీనిపై టీఆర్ఎస్ అధిష్టానం స్పందించింది. ప్రధాని ప్రైవేట్ పర్యటనకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

అంతేగాక, టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు సోషల్ మీడియా వేదికగా కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించారు. అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణకు ఎందుకు సాయం చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్రానికి ఎన్నో లేఖలు ఇచ్చామని, ఒక్క దానికి కూడా సమాధానం ఇవ్వలేదని ఎంపీ రంజిత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తెలంగాణ ప్రగతి అంతా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిందే అని అన్నారు. అంతేగాక, సమతామూర్తి శిలాఫలకంపై కేసీఆర్ పేరు లేకపోవడంపై మండిపడ్డారు. శిలా ఫలకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు పెట్టకపోవడం అవమానించినట్లు కాదా? అని ప్రశ్నించారు. ఈ మేరకు బీజేపీ కామెంట్లకు టీఆర్ఎస్ రివర్స్ అటాక్ చేస్తూ.. శిలా ఫలకం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

Tags:    

Similar News