పడకేసిన ప్రత్యేక పాలన.. నిధుల కొరతతో పంచాయతీల విలవిల

ప్రత్యేక అధికారుల పాలనలో సమస్యలు పేరుకుపోతున్నాయి.

Update: 2024-08-25 12:39 GMT

దిశ, యాచారం : ప్రత్యేక అధికారుల పాలనలో సమస్యలు పేరుకుపోతున్నాయి ఒక్కో అధికారికి మూడు పంచాయతీల బాధ్యతలను అప్పగించడం వారు చుట్టపు చూపుగా గ్రామాలకు రావడంతో పంచాయతీల పాలన అస్తవ్యస్తంగా మారిపోయింది.. వర్షాలకు ధ్వంసమైన రోడ్లు, మంచినీటి పైపులైన్లు, వీధిలైట్ల మరమ్మత్తులు నూతన అభివృద్ధి పనులను చేపట్టకపోవడంతో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. సర్పంచుల పదవీకాలం 9 నెలల క్రితం ముగియడంతో పంచాయతీల పాలనావ్యవహారాలను చూసేందుకు ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది.

ఒక్కో అధికారికి మూడు గ్రామాలు అప్పగించింది ప్రత్యేక అధికారులు తమ బాధ్యతలకు తోడు పంచాయతీల అదనపు బాధ్యతలతో గ్రామాలకు రావడం లేదు. దీంతో పంచాయతీల్లో పర్యవేక్షణ కొరవడింది ఫలితంగా స్థానికంగా పంచాయతీ సెక్రటరీలపైనే మొత్తం భారం పడుతున్నది. అభివృద్ధి పనులు పడకేశాయి మరమ్మతులు అటకెక్కాయి..యాచారం, నంది వనపర్తి, మొండి గౌరెల్లి, చింతపట్ల, మొగుళ్ళ వంపు, సింగారం, గ్రామాలలో అండర్ డ్రైనేజీ నిర్మాణం మంచినీటి పైపులైన్లు రోడ్లు వీధిలైట్ల మరమ్మత్తులను చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులను పడుతున్నారు. ప్రభుత్వం నుంచి కొన్ని నెలలుగా నిధులు జమకావడం లేదు. దీంతో పంచాయతీల పాలన మొక్కుబడిగా సాగుతోంది.

నిధుల కటకట..

గ్రామ పంచాయతీలు నిధుల కటకటను తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. పైపులైన్ల లీకేజీల మరమ్మతు, బోర్ల మరమ్మతు పనులు, గ్రామాల్లో విద్యుత్‌ దీపాలు, ఏర్పాటు పనులకు నిధులు లేకపోవడంతో పంచాయతీ సెక్రటరీలు బరువు బాధ్యతను మోస్తూ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

అప్పుల పాలవుతున్న పంచాయతీ సెక్రటరీలు

9 నెలలుగా పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉండగా ప్రభుత్వం నుండి నిధులు రాకపోవడంతో పల్లెలలో సమస్యలు పేరుకు పోతుడడంతో చేసేదేమీ లేక అప్పులు చేసి పైపులైన్ల లీకేజీలు బోర్ల మరమ్మతు చేయిస్తున్నారు.

పల్లెల్లో పేరుకుపోతున్న సమస్యలు..

అభివృద్ధి పనులను చేపట్టకపోవడంతో గ్రామాల్లో సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి గ్రామపంచాయతీలకు నిధులను కేటాయించి అభివృద్ధి పనులను చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.


Similar News