అసంపూర్తిగా పాత కుంట పార్కు పనులు.. స్థానికుల డిమాండ్ ఇదే..!
తాండూరు పట్టణంలో చేపట్టిన పార్కు పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి....

దిశ, రంగారెడ్డి బ్యూరో: తాండూరు పట్టణంలో చేపట్టిన పార్కు పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. పనుల పూర్తి విషయంలో ఎవరూ చొరవ చూపడం లేదని ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాండూరు మున్సిపల్ పరిధిలోని పాత కుంట కాలనీలో అసంపూర్తిగా ఉన్న పార్కును తనిఖీల పేరుతో అధికారులు కాలయాపన చేస్తున్నారు. పార్కు నిర్మాణ పనులను రెండు సంవత్సరాలుగా ముందుకు సాగనివ్వడం లేదంటూ స్థానికులు, మాజీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. తాండూరు మున్సిపల్ పరిధిలో సర్వే నంబర్ 139 ,140లో మూడు ఎకరాల మురుకు కుంట భూమిని పార్కుకు కేటాయించారు.2023లో బీఅర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి భూగర్భ శాఖ మహేందర్ రెడ్డి, అప్పటి తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కలిసి రూ.6 కోట్ల నిధులతో పార్కు శంకుస్థాపన చేశారు. రెండు సంవత్సరాల నుంచి అధికారులు అసంపూర్తిగా ఉన్న పార్కును సందర్శిస్తూ, క్వాలిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడుతున్నారు.
పనులు తక్కువ.. తనిఖీలు ఎక్కువ..!
రాష్ట్ర క్వాలిటీ కంట్రోల్ అధికారి సుదర్శన్ రెడ్డితో పాటు, జిల్లా ఆర్ అండ్ బీ, ఇరిగేషన్ అధికారులు సందర్శించి పరిశీలిస్తున్నారు. ఈ మేరకు పాత కుంట మూడు ఎకరాల స్థలంలో మట్టిని పోసి నింపిన తీరును ఎన్ని క్యూబిక్ మీటర్లలో అనేదానిని స్థానిక ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ తనిఖీల్లో జేసీబీలతో పార్కులో గోతులు తీసి మట్టి క్యూబిక్ మీటర్లను అధికారులు లెక్కగట్టారు. ఉన్నతాధికారులు రావడంతో స్థానిక మాజీ కౌన్సిలర్లు పూజ రజిని, నీరజ, భద్రేశ్వర దేవాలయ చైర్మన్ కిరణ్ పటేల్, స్థానికులు అక్కడికి చేరుకొని పరిశీలన చేసి అధికారులతో మాట్లాడారు. త్వరగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది ఏర్పడుతుందని, వెంటనే పార్కు నిర్మాణం పూర్తి చేయాలని అధికారులతో వారు పేర్కొన్నారు.
రెండేళ్లుగా ఎదురుచూపులు..!
జిల్లాలో ఎక్కడా లేని విధంగా మున్సిపల్ పరిధిలో సర్వే నంబర్ 139 , 140లో మూడు ఎకరాల మురుకు కుంట భూమిని పార్కు కేటాయించారు. రూ.6 కోట్లతో పార్కు అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించడం, శంకుస్థాపన కూడా చేశారు. పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ పాతకుంటను మట్టితో మొత్తం పూర్తి చేసి ఒక రూపాన్ని తీసుకొచ్చారు. గతంలో ఇక్కడ పాములు, తేలు దోమలతో బెడద, ఇండ్లలోకి నిరు చేరడం, ఇల ఇబ్బందికరంగా ఉండేది. మట్టి పోసి పార్కుకు సుందరీకరణ చేయడం ద్వారా ఇప్పుడు అలాంటి బాధ లేదు. కానీ ఇప్పటికీ పనులు పూర్తి కాకపోవడం శోషనీయం. రెండు సంవత్సరాల నుంచి అధికారులు అసంపూర్తిగా ఉన్న పార్కును సందర్శిస్తూ, క్వాలిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారని ప్రజలు మండిపడ్డారు. రెండు సంవత్సరాల నుంచి పార్కు కోసం పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్నారు.
ఎమ్మెల్యే దృష్టి సారిస్తేనే..
ఉదయం, రాత్రి వేళలో వాకింగ్ చేయడానికి ప్రజలు ఎక్కువగా వస్తారు. ప్రభుత్వం కేటాయించిన విధంగా అన్ని పూర్తి అవుతే ప్రజలకు మరింత సౌకర్యం అవుతుంది. వెంటనే అధికారులు కాలయాపన చేయకుండా పార్కు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా అసంపూర్తి నిర్మాణ పనులతో నిలిచిపోయిన పాత కుంట పార్కు అందుబాటులోకి తీసుకొచ్చేలా తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.