వాటిని ప్రోత్సహించిన అధికారులపై నిఘా

పదేండ్లు ఇరిగేషన్​అధికారులు ఆడిందే ఆట, పాడిందే పాటగా కొనసాగినట్లు ప్రచారం ఉంది. చెరువులు, కుంటలు, నాలాలు కనిపిస్తే కబ్జా చేయాల్సిందే.

Update: 2024-09-05 04:02 GMT
వాటిని ప్రోత్సహించిన అధికారులపై నిఘా
  • whatsapp icon

దిశ, రంగారెడ్డి బ్యూరో: పదేండ్లు ఇరిగేషన్​ అధికారులు ఆడిందే ఆట, పాడిందే పాటగా కొనసాగినట్లు ప్రచారం ఉంది. చెరువులు, కుంటలు, నాలాలు కనిపిస్తే కబ్జా చేయాల్సిందే. అందుకు సంబంధించిన ఎన్వోసీ లు తీసుకోవాల్సిందే. దీంతో యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టి వరద ప్రవాహాలను అడ్డుకున్న వైనం నేడు పట్టణాల్లో కనిపిస్తున్నది. చెరువులు, కుంటల్లో కి వెళ్లాల్సిన నీటి ప్రవాహాన్ని పూర్తిగా మూసివేయడం, పూడ్చివేయడం తో పరిసర ప్రాంతాలన్నీ జలమయంగా మారిపోయయాయి. దీనంతటికీ కారణం రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదాలేనని స్పష్టమవుతున్నది. అధికారులు చేతివాటానికి అలవాటు పడి ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు.. నో అబ్జెక్షన్​ సర్టిఫికెట్లు జారీ చేశారు. దీంతో మున్సిపాలిటీ అధికారులు ఎన్వోసీ ఆసరా చేసుకుని నిర్మాణాలకు అనుమతినిస్తున్నారు. మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు చెరువులు, కుంటల్లో ఉండాల్సిన నీళ్లు ఇండ్లల్లోకి.. నాలాలు, కాల్వల గుండా ప్రవహించాల్సిన నీళ్లు రోడ్లపై పొంగిపొర్లుతున్నాయి. ఇలాంటి దుస్థితికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

అర్బన్​ ప్రాంతాలపై ప్రధాన దృష్టి..

రంగారెడ్డి జిల్లాలోని అర్బన్​ ప్రాంతాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. చెరువులు, కుంటలు, నాలాలను కబ్జా చేయడంతో విపత్తు సంభవిస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. అందులో భాగంగానే హైడ్రా సంస్థను నెలకొల్పి కబ్జాలకు పాల్పడిన వాటిని కూల్చివేతకు సిద్ధమవుతున్నది. రంగారెడ్డి జిల్లాలోని గండిపేట్, శంషాబాద్, రాజేంద్రనగర్, బాలాపూర్, హయత్​నగర్, సరూర్​నగర్, మహేశ్వరం, అబ్దుల్లాపూర్​మెట్ మండలాల పరిధిలోని చెరువులను పరిరక్షించేందుకు హైడ్రా పర్యవేక్షిస్తున్నది. ఇప్పటికే ఈ ప్రాంతాల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా పర్యవేక్షించి చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. బఫర్, ఎఫ్టీఎల్‌లను సైతం లెక్కచేయకుండా రియల్​ వ్యాపారులు లేఅవుట్లు, వెంచర్లు వేశారు. ఈ లేవుట్లు, వెంచర్లు నీటిలో తేలియాడుతున్నాయి. వీటికి ఎన్వోసీలు జారీ చేసిన అధికారుల వివరాలు సేకరించే పనిలో జిల్లా అధికారులు నిమగ్నమయ్యారు.

పెద్దల కోసం చెరువులు మాయం..

జిల్లాలోని ఇరిగేషన్​ అధికారులు పెద్దల ఆశీస్సుల కోసం చెరువులను మాయం చేశారు. వర్షాలు లేనప్పుడు, ఎండాకాలంలో నిలిచే నీళ్లు లేకపోవడంతో ఎఫ్టీఎల్, బఫర్​ జోన్లు అనే తేడా లేకుండా లే అవుట్లు చేయడం, అందుకు అవసరమైన ఎన్వోసీలు తీసుకోవడం పరిపాటిగా మారిపోయింది. అందులో భాగంగానే సామాన్యులకు, కులవృత్తులకు ఉపయోగపడే చెరువులు, కుంటలు, నాలాలను పూర్తిగా రియల్​ వ్యాపారులు మింగేశారు. రంగారెడ్డి జిల్లాలోని బాలాపూర్​ మండలంలోని పెద్ద చెరువు, మంత్రాల చెరువు, చందన చెరువు, ఇబ్రహీంపట్నం లోని పెద్ద చెరువు, మహేశ్వరం మండలంలోని రావిర్యాల చెరువు, అబ్ధుల్లాపూర్‌మెట్ మండలంలోని మాసాబ్​చెరువు, గండిపేట్​ మండలంలోని ఉస్మాన్​సాగర్​చెరువులన్నీ పూర్తిగా కబ్జాలకు గురైనట్లు హైడ్రా అధికారులు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్మాణాలను ప్రోత్సహించిన అధికారులు, ఎన్‌వోసీలు జారీ చేసిన ఇరిగేషన్ ​అధికారుల వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం.

ఎఫ్‌టీఎల్‌ గాయబ్..

గతంలో పనిచేసిన అధికారుల తప్పిదాలతోనే నేడు రంగారెడ్డి జిల్లా అర్బన్​ ప్రాంతం లోతట్టు ప్రాంతంగా మారిపోయింది. గండిపేట్, బాలాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో నీట మునిగిన ఇండ్లను సోమవారం కలెక్టర్ స్వయంగా వెళ్లి పరిశీలించారు. భారీ వర్షాలకు నీట మునిగి పోవటానికి కారణాలు ఏంటి? అనే అంశాలను పరిశీలించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా చెరువుల ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్​లెవల్)​హద్దు గాయబ్​అయినట్లు స్పష్టమవుతుంది. ఎఫ్టీఎల్ ఫిక్స్​చేసిన తర్వాత బఫర్​జోన్​ఎంత వరకు ఉండాలి? అనేది నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ఎఫ్టీఎల్​ హద్దుల విషయంలో అధికారులు తలోమాట చెప్పడంపై అనుమానాలకు తావిస్తోంది.


Similar News