ఐక్యత V/S టీఆర్ఎస్

కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండలం చౌదర్పల్లి గ్రామానికి చెందిన సుంకిని రాఘవేందర్ రెడ్డి అనే ఎన్ఆర్ఐ ఐక్యత ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు.

Update: 2022-11-18 11:10 GMT

దిశ, తలకొండపల్లి : కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ మండలం చౌదర్పల్లి గ్రామానికి చెందిన సుంకిని రాఘవేందర్ రెడ్డి అనే ఎన్ఆర్ఐ ఐక్యత ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. ఇటీవల అమెరికా నుండి ఇండియాకు చేరుకొని వెల్దండ మండలంలోని సొంత గ్రామం చౌదర్పల్లితో పాటు, నియోజకవర్గంలోని పలు గిరిజన తండాలు, గ్రామాలలో నెలకొన్న మౌలిక సమస్యలు పరిష్కరిస్తూ బుల్లెట్ వేగంతో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇప్పటికే ఆయా గ్రామాలలో కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి సొంతంగా సీసీ రోడ్లు, దేవాలయాల నిర్మాణాలు, పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెడుతూ, విద్య వైద్యం ఉపాధి లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తూ ప్రత్యేక చొరవ చూపుతున్నాడు.

2005 లో యూఎస్ఏ లోని టెక్సాస్ రాష్ట్రంలోని యూస్టన్ నగరంలో స్థిరపడ్డాడు. 18 సంవత్సరాల పాటు అక్కడే ఉండి ఇటీవల సొంత ప్రాంతానికి ఏదైనా ఒకటి చేయాలి అనే దృఢ సంకల్పంతో ఐక్యత ఫౌండేషన్ను స్థాపించాడు. యూఎస్ఏ లోని తన పౌరహత్వాన్ని సైతం రద్దు చేసుకొని ఇండియాకు వచ్చినట్టు రాఘవేందర్ రెడ్డి పేర్కొన్నాడు. వరుసకు పెదనాన్న కొడుకు అయినా వరప్రసాద్ రెడ్డి అండతో సుంకిని రాఘవేందర్ రెడ్డి గ్రామాలలో కార్యక్రమాలను చురుకుగా ముందుకు తీసుకెళుతున్నారు.

అధికార పార్టీకి మింగుడు పడడం లేదు

ఇటీవల ఐక్యత ఫౌండేషన్ కల్వకుర్తి నియోజకవర్గం లోని కల్వకుర్తి, ఆమనగల్ రెండు మున్సిపార్టీలతో పాటు ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్, మాడుగుల, వెల్దండ, చారగొండ మండలంలోని ఐదు గ్రామపంచాయతీలను కలుపుకొని అన్ని గ్రామాలలో సైతం అధికార, ప్రతిపక్ష పార్టీలు అనే తేడా లేకుండా సర్పంచులు ఎంపీటీసీలను తన వైపు తిప్పుకొని అధికార పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. కేవలం ఒక్క తలకొండపల్లి మండలంలోని గత నెల రోజుల వ్యవధిలో ఐక్యత ఫౌండేషన్ కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుకు రావడంతో మండలంలోని 32 గ్రామ పంచాయతీలకు గాను, సుమారు టీఆర్ఎస్ మద్దతుదారులుగా 19 మంది సర్పంచులుగా ఉన్నారు.

ఒక్కరు బీజేపీ వైపు ఉండగా, తలకొండపల్లి నుండి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుపై ఇండిపెండెంట్ జెడ్పీటీసీ అభ్యర్థిగా ఘనవిజయం సాధించిన ఉప్పల వెంకటేష్ వైపు 12 మంది సర్పంచులు ఉన్నారు. ఇందులో ఇప్పటికే నలుగురు టీఆర్ఎస్ సర్పంచులు బహిరంగంగానే అధికార పార్టీని కాదని కేవలం ఇండిపెండెంట్గా ఐక్యత ఫౌండేషన్ సంస్థ వైపు వెళ్లిపోయి ఎమ్మెల్యేను ప్రత్యక్షంగా విమర్శిస్తూ చురుకుగా ప్రచారం సైతం నిర్వహిస్తున్నారు. కొన్ని కొన్ని గ్రామాలలో సుంకిని రాక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ పూల వర్షం సైతు కురిపిస్తూ, గ్రామంలోని ప్రధాన వీధుల వెంబడి కలియ తిరుగుతూ సమస్యలను చూయిస్తూ వెంటనే పరిష్కారం వైపు అడుగులు వేస్తూ, వెనువెంటనే సమావేశాలు ఏర్పాటు చేసుకొని బహిరంగంగానే గ్రామాలలో సర్పంచులు తమ అనుచరుగన్నంతో పార్టీ మారుతున్నారు.

రాష్ట్రంలోని ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కల్వకుర్తి రాజకీయం ఇప్పటి నుండే హీటెక్కిస్తోంది. మరో 8 మంది వరకు టీఆర్ఎస్ మద్దతు దారులైన సర్పంచులు ఐక్యత ఫౌండేషన్ సభ్యులైన సుంకిని బ్రదర్స్ తో పలుమార్లు చర్చలు జరిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి కొంతమంది నేతలు నేరుగా కలవకుండా కేవలం ఫోన్ టచ్ లో ఉన్నారని, రానున్న నెల రోజుల్లో మరో 8 నుండి 10 మంది సర్పంచులు ఐక్యత వైపు వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. వెల్దండ మండలంలోని సుమారు 10 గ్రామాల సర్పంచ్లు కూడా సుంకిని రాఘవేందర్ రెడ్డితో కలిసి గ్రామాల అభివృద్ధికి నిధులు తీసుకున్నట్లు తెలిపారు.

స్థానిక టీఆర్ఎస్ పై హై కమాండ్ సీరియస్ గా ఉంది నియోజకవర్గంలోని అధికార పార్టీ చెందిన చాలామంది సర్పంచులు ఒక్కొక్కరుగా చేయి జారిపోతున్న ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాత్రం ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని కింది స్థాయి క్యాడర్ నేతలు ఆవేదనకు గురవుతూ, మనోవేదనను వ్యక్తపరుస్తున్నారు. ఎమ్మెల్యే ఇప్పటికైనా మేల్కొని చేయి జారిపోతున్న సర్పంచ్ ను చక్కబెట్టకపోతే వచ్చే ఎన్నికల్లో పరాభవం తప్పదని, తాలూకాలోని పదవిలో ఉన్న ఎంపీపీ, జెడ్పీటీసీ, సింగిల్ విండో, మార్కెట్ స్థాయి క్యాడర్ నేతలు పెదవి విరుస్తున్నారు.

ఇంటలిజెన్స్ అధికారులతో పాటు, ఎప్పటికప్పుడు పార్టీ అధినేత స్థానిక మంత్రులచే పూర్తి సమాచారాన్ని తెప్పించుకుని పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత రెండు రోజుల క్రితం ప్రగతిభవన్లో పార్టీ అధినేత సిట్టింగ్లకే మరోసారి అవకాశం కల్పిస్తామని స్పష్టం చేయడంతో, పార్టీ టికెట్టు మళ్లీ నాకే వస్తుందని ఎమ్మెల్యే యాదవ్ మరింత ధీమాతో ఉన్నట్లు అతని సన్నిహితులే పేర్కొంటున్నారు.

అధికార పార్టీ చేయని పనులు ఐక్యత చేస్తుంది

నియోజకవర్గంలోని కేవలం నాలుగు నెలల క్రితం పురుడు పోసుకొని పుట్టుకొచ్చిన ఐక్యత ఫౌండేషన్ అనే స్వచ్చంద సంస్థ గ్రామాలలో సీసీ రోడ్లు, దేవాలయ నిర్మాణాలు, పలు మౌలిక సమస్యలకు పెద్దపిట్ట వేస్తూ చిన్న గ్రామానికి 5 నుండి 10 లక్షల రూపాయలు, పెద్ద గ్రామపంచాయతీలు అయితే 10 నుండి 20 లక్షల రూపాయలు సైతం ప్రకటిస్తూ, ఇప్పటికే నాలుగు నెలల వ్యవధిలోనే సుమారు మూడు కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. ఎన్నికలకు సమయం మరో సంవత్సరం టైం ఉండడంతో ఐక్యత ఫౌండేషన్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం పై ప్రత్యేక దృష్టి పెడుతూ, అధికార పార్టీపై గుర్రుగా ఉన్న అందరి నేతలను తమ వైపు తిప్పుకుంటూ బలం పెంచుకుంటుంది. ఇప్పటికైనా అధికార పార్టీ నిద్ర మత్తును వీడకపోతే వచ్చే 2024 ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించక తప్పదు.


Similar News