దిశ ప్రతినిధి వికారాబాద్ : సర్పంచ్ ఎన్నికల వేళ జిల్లాలో పోటీ చేయాలనుకున్న సర్పంచ్ అభ్యర్థులలో సందిగ్ధం మొదలైంది. ప్రధానంగా ఈమధ్యే ప్రభుత్వం బీసీ గణన పూర్తి చేసి, రిజర్వేషన్ మార్పు కోసం అన్ని చర్యలు తీసుకుంది. కానీ ఇంకా రిజర్వేషన్ లు అనౌన్స్ చేయలేదు. దాంతో గ్రామంలో రిజర్వేషన్ ఏది వస్తుందో క్లారిటీ లేక చాలామంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. రిజర్వేషన్ అనౌన్సమెంట్ ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో అధికార పార్టీకి చెందిన చాలామంది సర్పంచ్ అభ్యర్థులు మరింత సందిగ్ధం, భయంలో ఉన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం 6 గ్యారెంటీలలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు, 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా, రూ.500 కె గ్యాస్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లాంటివి ప్రభుత్వం అమలు చేస్తుంది.
కానీ చేయూతతో భాగంగా నెలవారి పింఛను రూ.4000 కు పెంచడం, రైతు భరోసా కింద ఎకరాకు ఏడాదికి రూ.15000 ఇస్తామని చెప్పి, ఇప్పుడు రూ.12000 ఇస్తాం అని ప్రకటించినప్పటికీ ఇంకా ఇవ్వకపోవడం, రూ.2 లక్షలు ఉన్నవారికి ఇంకా పూర్తిగా రుణమాఫీ చేయకపోవడం, మహాలక్ష్మి కింద ప్రతి మహిళలకు రూ.2500 ఆర్థిక సహాయం తో పాటు యువ వికాసం, విద్యా భరోసా కార్డులు ఇవ్వలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే హామీలు ఇంకా నెరవేరాల్సి ఉంది. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పరిస్థితి చూస్తుంటే ఈ పథకాలు ఇప్పట్లో అమలు అయ్యేలా కనిపించడం లేదనే చర్చ నడుస్తోంది. పైగా గ్రామాలు కూడా అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడి పోతున్నాయి. గ్రామాల్లో కనీసం శానిటేషన్ పనులు చేయించాలి అన్న నిధులు లేని దీన స్థితిలో గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దీంతో ప్రజల దగ్గరకు వెళ్ళాలి అంటేనే మొహం చూపించలేని పరిస్థితి ఉందని అధికార పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ప్రభుత్వం దగ్గర నిధుల కొరత కారణంగానే ఈ సమస్య వచ్చింది.
ఈ సమస్యకు ప్రధాన కారణం గత బిఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన కారణం అని అధికార పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నా, గ్రామాల్లో ఓటు వేసే ప్రజలకు అవ్వన్నీ అవసరం లేదు. అధికార పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వ్యతిరేకత ప్రజల్లో చాలానే ఉందని చెప్పక తప్పదు. నిజానికి సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ కంటే వ్యక్తిని చూసి ఓటు వేస్తారు. గుర్తులు కూడా పార్టీ గుర్తులు కాకుండా ఇండిపెండెంట్ గుర్తులను కేటాయిస్తారు. అయినప్పటికీ గెలుపు ఓటమిలో పార్టీ అనేది కూడా కీలకంగా పనిచేస్తుంది. అందుకే సర్పంచ్ ఎన్నికల వరకు పార్టీ పేరు చెప్పుకొని ఎన్నికల్లోకి వెళ్లాలా..? లేక సొంతంగా ఎన్నికల బరిలో దిగాలా అనే సందిగ్ధం నెలకొంది.
రిజర్వేషన్ కన్ఫ్యూజన్ కు తెరపడేది ఎప్పుడు..?
బీసీ గణన పూర్తి అయ్యాకే సర్పంచ్ తో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం ఎన్నికలను ఏడాది పోస్టుపోన్ చేసింది. ఈ నెల చివరినాటికి ఎన్నికల ప్రకటన రావడం, ఫిబ్రవరి 3వ వారంలోపే ఎన్నికలు పూర్తి చేస్తారని తెలుస్తుంది. సమయం దగ్గర పెడుతున్నా రిజర్వేషన్లు ఇంకా ప్రకటించలేదు. దాంతో రాష్ట్రం మొత్తం నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసిన ఎన్నికల వేడి కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో సంక్రాంతి పండుగ రావడం, హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాలు, దేశాల్లో నివసిస్తున్న ప్రజలు సైతం పల్లె బాట పట్టారు. దీంతో ఏ నలుగురు కలిసిన రిజర్వేషన్ ఏమి వస్తుందా..? అనే చర్చ నడుస్తోంది.
కుల గణన ప్రకారం మా గ్రామంలో మా కులానికే రిజర్వేషన్ వస్తుందని ఆశావాహులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. రిజర్వేషన్ పట్ల ఎంత నమ్మకంగా ఉన్నప్పటికీ కన్ఫ్యూజన్ మాత్రం అలాగే ఉంది. ఇది క్లియర్ అయ్యేకే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జోష్ వచ్చేలా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే సాధారణంగా సర్పంచ్ ఎన్నికలు పూర్తి అయ్యాకే, స్థానిక సంస్థలైన జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు ఉంటాయి. కానీ ఈసారి మాత్రం సర్పంచ్ ఎన్నికలకంటే ముందే జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు ఉంటాయన్న ప్రచారం కూడా గ్రామాలలో జోరుగా సాగుతుంది. ఈ ప్రశ్నలకు తెరపడాలి అంటే ఎన్నికల ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.
సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటుతాం : ధారూర్ మండల బిఆర్ఎస్ సీనియర్ నేత వేణుగోపాల్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అమలుకాని అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో గెలిచింది. అసలు నిజం ప్రజలకు ఏడాది కాంగ్రెస్ పాలనలోనే అర్ధం అయ్యింది.10 ఏళ్ల మా బిఆర్ఎస్ పాలనలో లేని వ్యతిరేఖత ఏడాది కాంగ్రెస్ పాలనలో వచ్చింది. సర్పంచ్ ఎన్నికలతో పాటు జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అబద్ధపు హామీలు ఇవ్వడమే కాక గత ఎంపీ ఎన్నికల్లో దేవుళ్లపై ఒట్టు వేసి ప్రజలను మోసం చేశారు. ఇవన్నీ మా పార్టీకి కలిసి వచ్చే అంశాలు. ప్రజలు మా పార్టీ వైపే ఉన్నారు కాబట్టి సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటుతాం.