మోకిలలో అస్తవ్యస్తంగా పారిశుద్ధ్య నివారణ

మోకిల గ్రామంలో పారిశుద్ధ్య నివారణ అస్తవ్యస్తంగా తయారైంది.

Update: 2024-08-26 13:00 GMT

దిశ, శంకర్పల్లి : మోకిల గ్రామంలో పారిశుద్ధ్య నివారణ అస్తవ్యస్తంగా తయారైంది. పారిశుద్ధ్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి చెత్త సేకరించాల్సి ఉండగా సక్రమంగా రావడం లేదని పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెత్త సేకరణకు వచ్చే సిబ్బంది ప్రతిరోజు సక్రమంగా రావడం లేదని ఆదివారం అయితే అసలే రారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బంది సక్రమంగా రాకపోవడం తో ఇంట్లో పేరుకుపోయిన చెత్తను ఎక్కడ వేయాలో తెలియక రోడ్లపై పార వేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. రోజురోజుకు మోకిలా గ్రామపంచాయతీ విస్తరించడంతో పెద్ద పెద్ద భవనాలు నిర్మించడం తో జనాభా రెట్టింపు అయింది. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ అద్దె ఇళ్లలో నివసిస్తూ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మోకిలా గ్రామపంచాయతీ, ఓ స్వచ్ఛంద సహకారంతో రూర్బన్ నిధులు వెచ్చించి ఇళ్ల నుంచి సేకరించిన చెత్త తో వర్మీ కంపోస్టు తయారీ యూనిట్ ను కూడా కొనసాగిస్తున్నారు.

అయినప్పటికీ మోకిలా నుంచి శంకర్పల్లి వెళ్లే రహదారిలో అక్కడక్కడ చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. చెత్త సేకరించే సిబ్బంది సక్రమంగా రావడం లేదని దీంతో చేసేదేమీ లేక రోడ్ల వెంబడి పారబోస్తున్నట్లు గ్రామ ప్రజలే చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పారిశుద్ధ్య నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం స్వచ్చదనం- పచ్చదనం అనే కార్యక్రమాన్ని వారం రోజుల పాటు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించిన విషయం తెలిసిందే.

చెత్త సేకరణ సక్రమంగా చేయడం లేదు:  మాణిక్య ప్రభు, మోకిలా

మోకిల గ్రామంలో చెత్త సేకరణ సక్రమంగా కొనసాగడం లేదు. పారిశుద్ధ్య సిబ్బంది వేళా పాళా లేకుండా ఇష్టానుసారంగా వస్తున్నారు. మా ఇళ్ల ముంగిట తడి చెత్త పొడి చెత్త వేరు వేరుగా బకెట్లలో పెడుతున్నాం. ఉదయం పూట వచ్చి తీసుకెళ్తే బాగుండేది. వేళ్ళ పాలా లేకుండా రావడంతో కుక్కలు వాటిని పడేసి పారబోస్తున్నాయి. దీంతో చేసేదేమీ లేక కవర్లలో తీసుకెళ్లి పారబోస్తున్నారు. అధికారులు పారిశుద్ధ్య నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి. గ్రామంలో వీధి లైట్లు కూడా సక్రమంగా వెలగడం లేదు.


Similar News