ప్రయాణికులకు పార్కింగ్ కష్టాలు..
ప్రధాన వాణిజ్య కూడలిగా కొనసాగుతున్నా ఆమనగల్లు పట్టణ వాసులకు ట్రాఫిక్ ఇక్కట్లు తప్పడం లేదు. ఆమనగల్లు ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులకు వాహన పార్కింగ్ కష్టాలు వెంటాడుతున్నాయి.
దిశ, ఆమనగల్లు : ప్రధాన వాణిజ్య కూడలిగా కొనసాగుతున్నా ఆమనగల్లు పట్టణ వాసులకు ట్రాఫిక్ ఇక్కట్లు తప్పడం లేదు. ఆమనగల్లు ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులకు వాహన పార్కింగ్ కష్టాలు వెంటాడుతున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు అతి చేరువలో గల ఆమనగల్లు మీదుగా ప్రతి నిత్యం వేల సంఖ్యలో వాహనాలు ద్విచక్ర వాహన దారులు రాకపోకలు సాగిస్తుంటారు. ఏదైనా పని పై ఊర్లకు వచ్చి వెళ్లేవారు, హైదరాబాదులో డ్యూటీలకు బస్సుల్లో వెళ్లేవారు ప్రతినిత్యం దాదాపు వేల మంది ప్రయాణికులు తమ ద్విచక్ర వాహనాలను బస్టాండ్ ఆవరణలో పార్కింగ్ లో ఉంచి వెళ్తుంటారు. ఇందుకోసం గతంలో బస్టాండ్ ఆవరణలో పార్కింగ్ ఉండేది. పార్కింగ్ టెండర్ యజమానికి గిట్టుబాటు కాక నష్టాలు భరించలేక పార్కింగ్ ను ముసివేశారు. అనంతరం పార్కింగ్ ను ఎవరికీ టెండర్ వేయకపోవడం, వృధాగా పార్కింగ్ స్థలం ఉంది. బస్టాండ్ ఆవరణలో సరైన పార్కింగ్ స్థలం లేక ద్విచక్ర వాహనాదారులు ఎక్కడ పడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేస్తూ ఉండడం, రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనాలు సైతం దొంగతనాలకు గురవుతున్నాయి.
బస్టాండ్ విస్తరణ జరగాల్సిందేనా ?
ఆమనగల్లు పట్టణంలో 2003 సంవత్సరంలో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఆర్టీసీ బస్టాండ్ ను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ బస్టాండ్ ఏర్పడి 20 సంవత్సరాలు గడుస్తున్నా బస్టాండ్ విస్తరణ విషయంలో ప్రజాప్రతినిధులు అధికారులు ఎవరు చొరవ చూపడం లేదని ప్రయాణికులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్ విస్తరణ జరిగితే ప్రయాణికులకు సరైన సదుపాయాలు సమకూర్చడంతో పాటు, వాహనాల పార్కింగ్ కు అనుగుణమైన స్థలంతో పాటు వ్యాపార సముదాయంగా ఏర్పడి, చిరు వ్యాపారాలకు అండగా నిలుస్తుందని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.
వారంలో సమస్య పరిష్కరిస్తాము.. సుహాసిని, కల్వకుర్తి డిపో మేనేజర్..
ఆమనగల్లు ఆర్టీసీ బస్టాండులోని పార్కింగ్ సమస్యను వారం రోజుల్లో పరిష్కరిస్తాం. టెండర్ ప్రక్రియ ప్రారంభించాము. సంక్రాంతి సెలవులు నేపథ్యంలో జాప్యం జరిగింది.
బస్టాండ్ ను విస్తరించాలి.. వాటర్ బాబా, కాంగ్రెస్ నాయకులు..
ఆమనగల్లు ఆర్టీసీ బస్టాండ్ ను విస్తరించి ప్రయాణికులకు సరైన వసతులను కల్పించాలి. సౌకర్యాలు కల్పనల్లో ప్రజాప్రతినిధులు ఆర్టీసీ అధికారులు చొరవ తీసుకోవాలి. బస్టాండ్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేసి వాహన దారుల ఇబ్బందులను తొలగించాలి.