Parigi: బోటింగ్ సాధ్యమేనా..? ప్లాట్లు తిరిగి చెరువుగా మారేనా?
పరిగి కొత్తచెరువులో బోటింగ్ ఏర్పాటు చేసి, సుందరీకరణగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే టీ రామ్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చర్చించారు.
దిశ, పరిగి : పరిగి కొత్తచెరువులో బోటింగ్ ఏర్పాటు చేసి, సుందరీకరణగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే టీ రామ్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చర్చించారు. ఈ విషయం మున్సిపల్‌లో ఇంతకంటే ఎక్కువగా రెట్టింపు చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే టీ రామ్మోహన్ రెడ్డి కల నెరవేరేనా..? చెరువును ప్లాట్లుగా మార్చి విక్రయించగా అందులో నిర్మాణాలు చేపట్టిన వారి పరిస్థితి ఏంటి అంటూ చర్చించుకుంటున్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి హైడ్రా రిలేటెడ్ చర్చ అంటూ ప్రారంభించి పరిగిలో కొత్తచెరువును కొందరు బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారంటూ చర్చించారు. అంతేకాకుండా ఈ విషయమై అప్పటి ఇరిగేషన్ అధికారులు, ఇరిగేషన్ మినిస్టర్ హరీశ్ రావుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం కొత్త చెరువును పునర్నిర్మించి, అందులో బోటింగ్ ఏర్పాటు చేస్తానని చెరువును సుందరంగా మార్చుతానని ఎమ్మెల్యే అసెంబ్లీలో ఆంగ్లంలో మాట్లాడడంతో అందరూ అవాక్కయ్యారు. అదేంటి కొత్త చెరువులో మనం ప్లాట్లు కొన్నాం, మనం ఇల్లు కట్టుకున్నాం, మనం మరో ఇనిస్ట్యూట్ ఏర్పాటు చేశాం అంటూ కొందరు మన పరిస్థితి ఏంటంటూ వాపోయారు. ఇదంతా అసెంబ్లీలో ఉత్తి చేర్చేనా.. లేదా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గతంలో కొత్తచెరువు మినీ ట్యాంక్ బండ్ మంజూరు చేయిస్తే నెరవేరని అప్పటికలను ఇప్పుడు నెరవేరుస్తారా? అంటూ అనుకుంటున్నారు.
33.18 ఎకరాలకు మిగిలింది 3 ఎకరాలే..
పరిగి కొత్తచెరువుపై కొంతకాలంగా కథనాలు వస్తున్న అధికారుల్లో మాత్రం చలనం కలగడం లేదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. పరిగి కొత్తచెరువుకు సంబంధించి 254 సర్వే నంబర్లో 13.27 ఎకరాలు, 256 సర్వే నంబర్లో 2.12 ఎకరాలు, 257 సర్వే నెంబర్లలో 17.19 ఎకరాలు మొత్తం కలిపి 33.18 ఎకరాలు.ఈ భూమిలో కొన్నేళ్ల క్రితం కొత్తచెరువును నిర్మించారని పూర్వీకులు చెబుతున్నారు. కాగా ఈ చెరువుకు గండి కొట్టించి రియల్టర్లు ప్లాట్లు చేసి విక్రయించి, రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖలో రికార్డులు మాయం చేశారు. ప్రస్తుతం కొత్తచెరువుకు సంబంధించి వరుస కథనాలు రావడంతో ఇరిగేషన్ అధికారులు కొత్తచెరువు చెరువు కాదని ప్రస్తుతమా రికార్డులో కొత్త కుంటగా ఉందని అది కూడా కేవలం 3 మాత్రమే ఉందని మ్యాపులతో పోషీట్లు చూయిస్తున్నారు. మూడు ఎకరాల్లో బోటింగ్ సాధ్యమేనా... లేదా బుల్డోజర్ వచ్చేనా అసెంబ్లీలో ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి కొత్త చెరువులో ఓటింగ్ చేస్తామని చెప్పడంతో అందరూ ఆలోచనలో పడ్డారు. కేవలం మూడు ఎకరాలే ఉన్న కొత్త చెరువులో బోటింగ్ ఎలా సాధ్యం అనుకుంటున్నారు. లేదా కొత్తచెరువులో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో చేపట్టిన నిర్మాణాన్నింటినీ హైడ్రా పేరుతో బుల్డోజర్ సాయంతో కూల్చివేసి బోటింగ్ చేస్తారా అంటూ అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కొత్తచెరువు పై చర్చించిన చర్చ పరిగి నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరికొందరు ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడిన స్పీచ్ ను వాట్సాప్ గ్రూపులో షేర్ చేస్తూ కొత్త చెరువులో చేపలు వదిలి, ఓటింగ్ చేసే వరకు ఎమ్మెల్యే వినేటట్లు లేడని కామెంట్లు స్టేటస్ లు పెట్టుకున్నారు.