Sanitation : పంచాయతీల కష్టాలు ఇంకా ఎన్నాళ్లు..గ్రామాల్లో ఎక్కడి మురుగు అక్కడే

జిల్లాలోని గ్రామ పంచాయితీలలో శానిటేషన్ కష్టాలు

Update: 2024-07-24 09:10 GMT

దిశప్రతినిధి ,వికారాబాద్ : జిల్లాలోని గ్రామ పంచాయితీలలో శానిటేషన్ కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గ్రామా పంచాయితీల అకౌంట్లలో కనీస నిధులు లేక శానిటేషన్ తో పాటు అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. పెద్ద గ్రామ పంచాయితీలలో ఎక్కువ మొత్తంలో టాక్స్ డబ్బులు వస్తుండడంతో కొంత వరకు శానిటేషన్ పనులు చేయిస్తుంటే, చిన్న గ్రామ పంచాయితీలలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. టాక్స్ లు రాక, వచ్చినా టాక్స్ డబ్బులు దేనికి సరిపోక గ్రామాల్లో పనిచేస్తున్న సెక్రెటరీలు తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మా కష్టాలను గుర్తించి వెంటనే గ్రామ పంచాయితీల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు.

నిధులు లేక పారిశుద్ధ్య పనులలో ఇబ్బందులు..

గత ఫిబ్రవరి నెల నుంచి సర్పంచ్ పదవి కాలం అయిపోవడం, 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. గత కెసిఆర్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు సైతం 9 నుంచి 10 నెలల డబ్బులు పెండింగ్ లో ఉండటం కారణంగా నేడు గ్రామ పంచాయితీల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గ్రామ పంచాయతీలకు కనీస నిధులు లేక గ్రామాల్లో చివరికి పారిశుద్ధ్య పనులు చేయించడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. నిధుల కొరతతో సరైన రోడ్లు, మొరీలు లేక గ్రామాల్లో ఎక్కడి మురుగు అక్కడే ఉండటంతో వర్షాకాలం కారణంగా సీజనల్ వ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చెత్త ట్రాక్టర్ లో డీజిల్ పోయాలన్న, ఏదైనా రిపేర్ వచ్చిన కార్యదర్శుల జేబులోనుండి పెట్టాల్సి వస్తుంది. కొన్ని గ్రామ పంచాయితీల కరెంటు బిల్లులు దాదాపు రూ.40,000 నుంచి రూ.1 లక్ష అంతకంటే ఎక్కువే పెండింగ్ లో ఉన్నాయి అంటే పంచాయితీల పరిస్థితి ఎలా ఉందో అర్ధం అవుతుంది. చివరికి పల్లె ప్రకృతి వనం లో మొక్కలకు నీళ్లు పోయాలన్నా జీపీలలో నిధులు లేవు. చెత్త డంపింగ్ యార్డుల నిర్వహణ లేదు. మొన్నటి వరకు పారిశుద్ధ్య కార్మికులకు కూడా జీతాలు లేక పనులకు కొన్ని రోజులు దూరంగా ఉండగా, ఈమధ్యే 3 నెల జీతాలు వేయడంతో కొంత ఉపశమనం అయ్యింది. అలాగే పంచాయతీలకు వచ్చే నిధులను కూడా వేస్తే బాగుంటుందని కార్యదర్శులు కోరుతున్నారు.

సీజనల్ వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు..

గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడం, గ్రామాల్లో పారిశుద్ధ్యం సరిగ్గా లేక సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. గ్రామాలలో సరైన రోడ్లు, సైడ్ డ్రైన్ లు లేక రోడ్డుమీదనే మురుగునీరు పారడం, ఉన్న మోరీలు క్లీన్ చేయలేకపోవడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. గత కెసిఆర్ ప్రభుత్వం ప్రారంభంలో అభివృద్ధి, పారిశుద్ధ్యం విషయంలో గ్రామాలు పోటీపడి ముందుకు వెళ్లాయి. ప్రతి గ్రామ పంచాయతీకి సొంతంగా ఒక ట్రాక్టర్, మంచి నీటి ట్యాంకర్, పల్లె ప్రకృతి వనం, చెత్త డంపింగ్ యార్డ్, శ్మశానవాటిక తో పాటు పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేసి గ్రామంలో ఎక్కడ కూడా చెత్త అనేది లేకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచారు. గ్రామాల అభివృద్ధి కోసం పంచాయితీ అకౌంట్ లోనే డైరెక్ట్ గా డబ్బులు వేసి గ్రామాల అభివృద్ధిలో దూకుడు పెంచారు.

ప్రారంభంలో బాగానే ఉన్న మెల్లిమెల్లిగా రాష్ట్ర ప్రభుత్వం నుండి జీపీ లకు వచ్చే నిధులను ఆపుతూ, కేవలం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను మాత్రమే జీపీలలో వేస్తూ వచ్చారు. దీంతో గత 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుండి గ్రామ పంచాయితీల అభివృద్ధికి వచ్చే నిధులు ఆగిపోవడంతో, గ్రామాల అభివృద్ధి కుంటుపడుతూ వస్తుంది. కొత్త ప్రభుత్వం వచ్చాక నిధుల కొరత మరింత పెరగడం, కేంద్రం నుండి వచ్చే నిధులు కూడా ఆగిపోవడంతో పంచాయితీల అభివృద్ధి అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం, ప్రభుత్వం స్పందించి వెంటనే సర్పంచ్ ల ఎన్నికలు నిర్వహించాలని, గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి సమస్యలను పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శులు, జిల్లా ప్రజలు కోరుతున్నారు.

త్వరలోనే పంచాయితీలకు నిధులు రానున్నాయి : డీపీఓ జయసుధ

నిధుల కొరతతో గ్రామ పంచాయితీల అభివృద్ధి, శానిటేషన్ ఇబ్బందులు వస్తున్న విషయం మంత్రి దనసరి అనసూయ (సీతక్క) దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించి నిధులు విడుదల చేసి పంచాయితీలను అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అలాగే ఈ సమస్యలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ దృష్టికి కూడా తీసుకెళ్లామని జిల్లా పంచాయతీ రాజ్ శాఖ అధికారి జయసుధ వెల్లడించారు.

Tags:    

Similar News