మియాపూర్ భూముల వ్యవహారంలో పలువురికి నోటీసులు

మియాపూర్ లోని వందలాది ఎకరాల స్థలాలు, వేల కోట్ల రూపాయల వ్యవహారం.

Update: 2024-08-12 04:28 GMT

దిశ, శేరిలింగంపల్లి : మియాపూర్ లోని వందలాది ఎకరాల స్థలాలు, వేల కోట్ల రూపాయల వ్యవహారం. కింది స్థాయి కోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు ఎన్నో కేసులు.. దీనికి తోడు ఈ మధ్య కాలంలో ఆ భూముల్లో గుడిసెలు వేసుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన జనాలు నానా బీభత్సం సృష్టించడంతో ఈ భూముల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. తాజాగా అక్కడ చిన్న చిన్న డబ్బాలు పెట్టుకుని ఏళ్ల తరబడి జీవిస్తున్న వారిపై ఇప్పుడు హెచ్ ఎండీఏ అధికారులు తమ ప్రతాపం చూపెడుతున్నారు. ఇన్నాళ్లు మొద్దు నిద్ర నటించిన అధికారులు ఇప్పుడు తెగ హడావిడి చేస్తూ సామాన్య జనాలను ఇబ్బందులు పెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అధికారుల అత్యుత్సాహం..

మియాపూర్ భూముల చుట్టూ చాలా కాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. కానీ వాటిని పట్టించుకునే వారే లేరు. ఓవైపు కబ్జాలు, నిర్మాణాలు మరోవైపు కోర్టు కేసులతో మియాపూర్ భూముల వ్యవహారం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. తాజాగా ఈ భూముల్లో హెచ్ ఎండీఏ అధికారులు మరోసారి నానా హంగామా సృష్టిస్తున్నారు. సుప్రీం కోర్టులో ఉన్న ఈ వివాదాస్పద భూములను కాపాడేందుకు అంటూ హెచ్‌ఎండీఏ అధికారులు వాటి చుట్టూ కంచె వేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు కబ్జాలకు గురైన ఈ భూములకు ఇన్నాళ్లకు హద్దులు నిర్ణయించారు. అయితే అధికారులు ఆ చుట్టుపక్కల ఉన్న స్థల యజమానులకు నోటీసులు ఇవ్వకుండా కేవలం మా పరిధిలో ఉన్న భూములను ఆక్రమించుకుని ఉంటున్నారంటూ కొంత మందికి నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులను సైతం అప్పటికప్పుడు తయారు చేసి ఇచ్చారని పలువురు ఆరోపిస్తున్నారు. అదీగాక వాళ్లకు ఇష్టం వచ్చిన రీతిగా సర్వే చేసి హద్దులు డిసైడ్ చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఎందుకు ఈ హడావుడి..

గతంలో ఎన్నడూ లేని విధంగా 4 నెలలుగా మియాపూర్ భూములపై హెచ్ ఎండీఏ అధికారులు ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ భూములను ఆక్రమించుకునేందుకు కొందరు ప్రయత్నించడం, ఆ వెంటనే హెచ్ ఎండీఏ అధికారులు రంగంలోకి దిగి వాటి చుట్టూ ఫెన్సింగ్ వేయడం అంతా హడావుడిగా సాగిపోతుంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో హెచ్ ఎండీఏ అధికారులు వేగంగా స్పందించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మియాపూర్ భూములపై త్వరలోనే కోర్టు తీర్పు రానుందని, ఇందులో భాగంగానే అధికారులు వీటిని రక్షిస్తున్నట్లు కవరింగ్ ఇస్తున్నారని సమాచారం. అదీగాక ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే వీటిని ఎలాగోలా దక్కించుకునేందుకు అధికార పార్టీ నాయకులు పావులు కదిపే అవకాశం ఉన్నట్లు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇన్నాళ్లు కాపాడిన భూములను తెగనమ్మేందుకు సిద్ధపడుతారని వారు ఇప్పటి నుండే ఆరోపిస్తున్నారు.

పేదలకు నోటీసులు

మియాపూర్ సర్వే నెంబర్ 100, 101లో ఏళ్ల క్రితం కొందరు పేదలు డబ్బాలు వేసుకుని, చిన్నా చితక దుకాణాలు పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ భూముల చుట్టూ కంచె వేస్తున్నామని, డబ్బాలను వెంటనే ఖాళీ చేయాలని చెబుతూ హెచ్ ఎండీఏ అధికారులు పేదలకు నోటీసులు జారీ చేశారు. దీంతో ఇన్నాళ్లుగా తమకు లభిస్తున్న ఉపాధి పోతుందని, నోటికాడి బుక్క లాగేసుకునేందుకు అధికారులు తమపై ప్రతాపం చూపుతున్నారని నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం హెచ్ ఎండీఏ డిప్యూటీ ఈవో సంధ్యారాణి ఇతర అధికారులతో కలిసి మియాపూర్ భూములను పరిశీలించారు. వెంటనే ఖాళీ చేయాలంటూ అక్కడి పేదలకు సూచించారు. తమను అక్కడి నుంచి ఖాళీ చేయిస్తే చావే శరణ్యమని ఏళ్ల తరబడి ఉంటున్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గోడు మన్నించాలని, మాకు ఉన్న ఉపాధిని లాక్కోవాలని వేడుకుంటున్నారు. వారికి ప్రజా సంఘాలు, ఆయా పార్టీలు సంఘీభావం తెలుపుతున్నాయి.

Tags:    

Similar News