తెలంగాణ జాతిపిత కేసీఆర్ : మహమ్మద్ అలీ
తెలంగాణ గాంధీ, జాతిపిత కేసీఆర్ అని మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ అన్నారు.
దిశ, శంషాబాద్ : తెలంగాణ గాంధీ, జాతిపిత కేసీఆర్ అని మాజీ హోంమంత్రి మహమ్మద్ అలీ అన్నారు. రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన దీక్షా దివాస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రులు మహమ్మద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, యువనాయకులు కార్తీక్ రెడ్డి హాజరై బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీమాంధ్ర పాలకుల పరిపాలనలో తెలంగాణ ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డారని, తెలంగాణ ప్రజలకు రావలసిన నీళ్లు, నిధులు, నియామకాల్లో తీవ్ర అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి విద్యాశాఖ మంత్రిగా ఉండి పార్టీకి పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమానికి నాందిపోశారన్నారు.
అప్పటి నుండి 14 సంవత్సరాల పాటు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పై నిరంతరంగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించేలా చేసిన ఘనత కేవలం కేసీఆర్ కే దక్కిందన్నారు. ఉద్యమ సమయంలో సీమాంధ్ర నాయకులు తెలంగాణ నాయకులను ఎంతో అవమానించారని, మీకు పాలన చేతకాదు, మీకు పాలించడానికి రాదు అనే రీతిలో ఇష్టం ఉన్నట్లు మాట్లాడిన ఆ అవమానాలను భరించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిందన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో 10 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని దేశంలోనే అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన ఘనత కేవలం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు. ఈ దీక్ష దివాస్ కార్యక్రమాన్ని పండగల నిర్వహించడం జరుగుతుందన్నారు.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక మన్నారు. కేసీఆర్ లేనిదే తెలంగాణ రాష్ట్రం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారని అన్నారు. తన ప్రాణ త్యాగంతోనైనా తెలంగాణ రాష్ట్రం వస్తుందంటే తన ప్రాణాన్ని తీసుకునేందుకు కూడా సిద్ధమయ్యారన్నారు. దీంతో దీక్ష దివాస్ పేరుతో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 2014 నుండి 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధిలో ముందు వరుసలో నిలబెట్టారన్నారు. దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూసేలా అభివృద్ధి చేశారన్నారు. కేసీఆర్ ఉద్యమ సమయంలో చేసిన త్యాగాలను రాష్ట్రం ఏర్పడ్డాక అభివృద్ధి చేసిన పథకాలను అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకెళ్లామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి అవినాష్ రెడ్డి,మాజీ ఎంపిపి జయమ్మ శ్రీనివాస్, నాయకులు అనంతరెడ్డి, కొనముల భారతమ్మ, నర్సింగ్ రావు, మోహన్ రావు, బుచ్చిరెడ్డి, హనుమంతు, రాజేందర్, శంకర్ రెడ్డి, చక్రధర్ రెడ్డి, దీప మల్లేష్, మనోహర్ గౌడ్, ముఖిత్, నాగరాజు, ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దీక్ష దివస్ కార్యక్రమంలోని ఫ్లెక్సీలో కనిపించని ఎమ్మెల్సీ కవిత ఫొటో
బిఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దీక్ష దివాస్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన దీక్ష దివాస్ కార్యక్రమానికి ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్సీ కవిత ఫోటో కనిపించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కవిత ఫోటోలు లేకపోవడం ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత ఫోటో పార్టీ కార్యక్రమంలో కావాలని వేయలేదా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పార్టీ నాయకులు కార్యకర్తలలో చర్చకు తెరలేపింది. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ జాగృతి పేరుతో ఎన్నో ఉద్యమ కార్యక్రమాలు చేసి ఎంతో గుర్తింపు తెచ్చుకొని ఉద్యమ సమయంలో కీలకంగా మారిన కవిత ఫోటో ఇప్పుడు పార్టీ కార్యక్రమంలోని ఫ్లెక్సీలో లేకపోవడం దేనికి సంకేతం అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.