అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల.. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా
అసంపూర్తిగా ఉన్న ఆమనగల్లు ప్రభుత్వం జూనియర్ కళాశాల
దిశ,ఆమనగల్లు: అసంపూర్తిగా ఉన్న ఆమనగల్లు ప్రభుత్వం జూనియర్ కళాశాల నూతన భవనం మందుబాబులకు అడ్డాగా మారింది. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన తరగతి గదులు మందు బాబులకు అడ్డాగా మారింది.అసంపూర్తిగా ఉన్న జూనియర్ కళాశాల భవన నిర్మాణం గేట్ 24 గంటలు తెరిచి ఉండడంతో మందుబాబులు పగలు రాత్రి తేడా లేకుండా అడ్డాగా మార్చుకున్నారు. భవన నిర్మాణానికి దశాబ్దాలుగా గ్రహణం వీడకపోవడంతో మందుబాబులు ప్రతినిత్యం మద్యం సేవించి ఖాళీ సీసాలు, వాటర్ బాటిల్, తినుబండారాల వ్యర్థాలు, కండోమ్ ప్యాకెట్లు అసంపూర్తిగా ఉన్న భవనంలో విచ్చలవిడిగా దర్శనమిస్తున్నాయి.2001లో మంజూరైన ప్రభుత్వ జూనియర్ కళాశాల,నేటికీ భవన నిర్మాణం పూర్తి కాకపోవడంతో, విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
2006లో కళాశాల భవన నిర్మాణానికి 50 లక్షలు మంజూరు కాగా, అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే స్థలం విషయంలో నిర్మాణ పనులు ఆగిపోయాయి. అనంతరం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ చొరవతో 2022 లో రూ 2కోట్ల తో నిర్మాణ పనులు చేపట్టారు.మరల స్థలం వివాదం తలెత్తడంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి.ఇదే అదనుగా భావించిన మందుబాబులు అడ్డాగా చేసుకొని అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసు శాఖ స్పందించి అసంపూర్తిగా ఉన్న జూనియర్ కళాశాల భవన ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో మద్యం సేవించకుండా సాంఘిక కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.