జిల్లాలో జోరుగా కల్తీ కల్లు దందా..అస్వస్థతకు గురవుతున్న జనం

గత వారం రోజులుగా వికారాబాద్ జిల్లా కేంద్రానికి అత్యంత సమీపాన

Update: 2024-08-26 13:07 GMT

దిశ ప్రతినిధి, వికారాబాద్ : గత వారం రోజులుగా వికారాబాద్ జిల్లా కేంద్రానికి అత్యంత సమీపాన ఉన్న వికారాబాద్ మండలం, పీరంపల్లి గ్రామ ప్రజలు కల్తీకల్లు బారినపడి ఆసుపత్రి పాలవుతున్నారు. సర్కారు ఆసుపత్రులలో మెరుగైన వైద్యం దొరకక, ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స చేయించుకునే స్తోమత లేక బాధితులు అనేక ఇబ్బందులు పడుతున్న వారి బాధలు పట్టించుకునే వారు కరువయ్యారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. పీరంపల్లి గ్రామంలో ఇప్పటికే 50 మందికి పైకా బాధితులు వాంతులు, మోషన్స్ తో అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలు అవ్వగా ఒకరు మృతి చెందాడు.

మరో నలుగురు కిడ్నీ సమస్యతో బాధపడుతుండగా, ప్రశాంత్ అనే యువకుడికి కిడ్నీలు ఫేలవడంతో డయాలసిస్ అందిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం కల్తీ కల్లు అని గ్రామస్థులు చెబుతుంటే, ఎక్సైజ్ అధికారులు మాత్రం ఇవి కల్తీకల్లు లక్షణాలు కావని, త్రాగునీరు కల్తీ అయ్యి ఉండవచ్చని జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ విజయ భాస్కర్ గౌడ్ ఊహాజనితంగా జోస్యం చెబుతున్నారు. ఒకపక్క ఆర్.డబ్ల్యూ.ఎస్ అధికారులు వాటర్ టెస్ట్ చేసి త్రాగునీటిలో ఎలాంటి కలుషితం జరగలేదని జిల్లా కలెక్టర్ కు రిపోర్ట్ ఇచ్చినా కూడా, చనిపోయిన వ్యక్తి పోస్టుమార్టం రాకుండానే, కనీసం ల్యాబ్ కు పంపిన కల్లు శాంపిల్స్ రాకుండానే ఎక్సైజ్ సూపర్డెంట్ విజయ భాస్కర్ గౌడ్ మీడియా ముందు ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయడం ఏంటని గ్రామస్థులు మండిపడుతున్నారు.

పీరంపల్లి వ్యవహారంను లైట్ తీసుకుంటున్న అధికారులు..?

జిల్లాలో అనుమతి లేని కల్లు దుకాణాలు ఎక్కువ మొత్తంలో నడుస్తున్నా, మమ్ముళ్లకు అలవాటు పడ్డ ఆబ్కారీ అధికారులు ఘాడ నిద్రలో ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో అధికారికంగా కేవలం 341 కల్లు దుకాణాలకు మాత్రమే అనుమతులు ఉంటే, అంతకు మించి అనుమతులు లేని కల్లు దుకాణాలు నడుస్తున్నాయి. జిల్లాలో మొత్తం 565 గ్రామ పంచాయతీలు, నాలుగు పట్టణాలు ఉండగా, ప్రతి గ్రామంలో ఒకటి లేదా రెండు కల్లు దుకాణాలు ఉండగా, పట్టణాల్లో అయితే దాదాపు 5 నుండి 10 కల్లు దుకాణాలు నడుస్తున్నాయి. ఇందులో సగానికి పైగా అనుమతులు లేని దుకాణాలు ఉన్నాయని తెలిసిన ఎక్సైజ్ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. ఇలాంటి అనుమతి లేని కల్లు దుకాణమే పీరంపల్లి గ్రామంలో గత 8 ఏళ్ల కంటే ముందు నుండే నడుస్తుంది.

ఈ దుకాణానికి వచ్చే కల్లు డిపో నుంచి కాకుండా వికారాబాద్ పట్టణంలో ఒక వ్యక్తి అక్రమంగా తయారుచేసి ఇక్కడికి పంపుతాడని తెలుస్తుంది. వీరి దగ్గర స్థానిక ఎక్సైజ్ అధికారులు ప్రతి నెలా మామూళ్లు తీసుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి. దీని కారణంగానే బాద్యులను శిక్ష నుండి తప్పించేలా, తాము శిక్ష నుండి తప్పించుకునేలా ఎక్సైజ్ అధికారులు తమకు ఇష్టం వచ్చినట్లుగా ఇది కల్తీకల్లు కాదని నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి జిల్లాలో కల్తీకల్లును నియత్రించేలా చర్యలు తీసుకోవాలని కల్తీకల్లు బాధితులు, వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.


Similar News