బాలాపూర్​ మండల పరిధిలో కుంటలకు కుంటలే మాయం

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బాలాపూర్​ మండల రెవెన్యూ పరిధిలోని బడంగ్ పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​, మీర్​ పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​, జల్​ పల్లి మున్సిపాలిటీలలోని చెరువులు, కుంటలను స్థానిక నేతల అండదండలతో భూ కబ్జాదారులు గద్దలాతన్నుకు పోయారు.

Update: 2024-08-21 16:06 GMT

దిశ, బడంగ్ పేట్​ : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బాలాపూర్​ మండల రెవెన్యూ పరిధిలోని బడంగ్ పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​, మీర్​ పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​, జల్​ పల్లి మున్సిపాలిటీలలోని చెరువులు, కుంటలను స్థానిక నేతల అండదండలతో భూ కబ్జాదారులు గద్దలాతన్నుకు పోయారు. చివరికి బఫర్​జోన్​లు, తూమ్​లను సైతం వదలలేదు. చెరువులను, కుంటలను రక్షించాల్సిన సంబంధిత అధికారులు మిన్నకుండిపోయారు. ఇదేంటని ?ప్రశ్నించాల్సిన స్థానిక కార్పొరేటర్లు, మేయర్​, స్థానిక ఎమ్మెల్యే సైతం బాధ్యతగా వ్యవహరించకపోవడంతో భూ కబ్జాదారులు ఒక్కసారిగా పంజా విసిరారు. దీంతో వందల ఎకరాల చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు కబ్జావశమయ్యాయి.

    ప్రభుత్వ స్థలాల్లో వెంచర్​లుగా చేసి ఇష్టం వచ్చిన ధరకు విక్రయించి కోట్ల రూపాయలు గడించారు. గత్యంతరం లేక కాయాకష్టం చేసిన డబ్బులతో తక్కువ ధరకు కొనుగోలు చేసిన కొందరు పేదోళ్లు సొంత గూళ్లను నిర్మించుకున్నారు. బాలాపూర్​ మండల రెవెన్యూ పరిధిలోని 43 చెరువులు, కుంటల్లో మూడు దాదాపు 16 ఎకరాల విస్తీర్ణం గల మూడు కుంటలకు కుంటలే కబ్జాదారులు మాయం చేశారంటే ఏ రేంజ్​లో కబ్జాలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కనీసం మాయమైన కుంటలను అధికారులు గుర్తు పట్టనంతగా కాలనీలుగా తయారయ్యాయి. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల చుట్టూర కంచెలు వేయకపోవడమే ఇంత పెద్ద ఎత్తున కబ్జాలు జరగడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. అసలు ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురౌతున్న మొదట్లోనే అడ్డుకుంటే బాలాపూర్​ మండల రెవెన్యూ పరిధిలో వందల ఎకరాలు సురక్షితంగా ఉంటుండేవనే అభిప్రాయాలువ్యక్తమవుతున్నాయి.

    బాలాపూర్​ మండల రెవెన్యూ పరిధిలలోని 43 చెరువులలో 6వేల కు పైగా అక్రమకట్టడాలు వెలిశాయంటే ఎన్ని శాఖల అధికారులు చేతులు కలిపారో ఇట్టే అర్థం అవుతుంది. రిజిస్ట్రార్​ కార్యాలయంలో కింది స్థాయి సిబ్బంది సైతం భూ కబ్జాదారులతో చేతులు కలపడంతో అక్రమంగా రిజిస్ట్రేషన్​లు కూడా జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఇలా ఉండగా వెంకటా పూర్​ గ్రామ రెవెన్యూ పరిధిలోని 80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఒక్క బురాన్​ఖాన్​ చెరువు ఎఫ్టీఎల్​ లోనే 465 కట్టడాలు 2019 నుంచి ఇంకా ఇప్పటివరకు కూడా వరద ముంపులోనే ఉన్నాయి. కోర్టు ఎఫ్​టీఎల్​ పరిధిలోని నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశాలివ్వడంతో తమకు ప్రత్యామ్నాయం చూపే వరకు తొలగించకూడదనే స్థానికులు భీష్మించుకు కూర్చున్నారు. బురాన్​ ఖాన్​ చెరువులో అసలు వెంచర్​ చేస్తున్నప్పడే అధికారులు పట్టించుకున్నట్లయితే ఇంత పెద్ద సమస్య ఉత్పన్నమయ్యేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే యుద్దప్రాతిపదికన హైడ్రా అధికారులు కొరఢా ఝులిపించాలని స్థానికులు కోరుతున్నారు.

బాలాపూర్​ మండల్​ పరిధిలో 43 చెరువులు, కుంటల వివరాలు ....

రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్​ మండల రెవెన్యూ పరిధిలోని బడంగ్​ పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​, మీర్​ పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​, జల్​పల్లి మున్సిపాలిటీ పరిధిలలో 43 చెరువులు, కుంటలు ఉన్నాయి. ఆయా ప్రాంతాలలో చెరువుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. జిల్లెల్​గూడలో ... చందన చెరువు , మీర్​పేట్​లో .... పెద్ద చెరువు, మంత్రాల చెరువు, లెనిన్​ నగర్​ కాలనీలో... తాళ్లకుంట, అల్మాస్​ గూడలో ... కోమటికుంట చెరువు, ఎర్రకుంట చెరువు, పోచమ్మ కుంట చెరువు, బాలాపూర్​లో ... పెద్ద చెరువు,

    కొంత మోని కుంట, ఎర్ర కుంట, సుల్తాన్​ పూర్​లో .... అల్లకోని చెరువు, వెంకటాపూర్​లో ... బురాన్​​ ఖాన్​ చెరువు, మల్లాపూర్​లో ...సుద్దవాణి కుంట, కుర్మల్​ గూడ, తాళ్ల కుంట, దేవులమ్మ చెరువు, అంతాయి చెరువు, నాదర్​గూల్​లో ... సున్నం చెరువు, రెడ్డి చెరువు, నాన్​ చెరువు, మర్రివాణి కుంట, మర్రి చెరువు, కాండ్లకుంట, కొత్త వాణి కుంట, బర్రె ఎంకల కుంట, ఈడాగోన్​ కుంట, బీర చెరువు, ఎక్కువ కుంట , ఉప్పర్​ వాణి కుంట, జల్​పల్లిలో ... తాళ్లకుంట, జల్​పల్లి పెద్ద చెరువు, మామిడిపల్లిలో...వంగరోని కుంట, సాయికుంట, ఎర్రకుంట, దావూద్​ఖాన్​ గూడలో ...తుర్కవాణి కుంట లు ఉన్నాయి. ఇందులో కొన్ని చెరువులలో ఎకరాలకు ఎకరాలు రాబందులు కబ్జాలకు పాల్పడ్డాయి.

బాలాపూర్​ మండలంలో మాయమైన మూడు కుంటలు?

బాలాపూర్​ మండల రెవెన్యూ పరిధిలోని సుల్తాన్​పూర్​లో నాలుగున్నర ఎకరాల కుంట, బడంగ్ పేట్​లో ఐదు ఎకరాల కుంట, మామిడిపల్లిలో ఆరున్నర ఎకరాల కుంట పూర్తిగా కబ్జాకు గురయ్యాయి. అసలు ఇప్పుడు ఆ కుంటలు ఎక్కడ ఉన్నాయో ? ఎవరు గుర్తు పట్టని విధంగా తయారయ్యాయి. పెద్ద పెద్ద కాలనీలే ఏర్పడ్డాయి. కాగా శేరిలింగం పల్లి, గండి పేట్​ ప్రాంతాలలో వెలిసిన అక్రమకట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా అధికారులంటే ప్రస్తుతం బాలాపూర్​ మండల పరిధిలోనూ హడల్​గానే మారింది. మరికొందరు మాత్రం డోంట్​

     కేర్​ అన్న చందంగా ఉన్నట్లు సమాచారం. భవిష్యత్తులో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురికాకుండా యుద్ద ప్రాతిపదికన ఇప్పటి కయినా కంచె వేసి, వాటి చుట్టూర సీసీ మెరాలను ఏర్పాటు చేస్తే కబ్జాలను అరికట్టవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దాదాపు 43 చెరువులలో నిర్మించిన 6వేల పైగా వెలిసిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు తొలగిస్తారా? లేదా? కనుమరుగైన మూడు కుంటలను కాపాడుతారా? అన్నది వేచి చూడాల్సిందే. 

Tags:    

Similar News