Gaddam Prasad Kumar: గురుకుల విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తాం: శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్

గురుకులల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కామన్ డైట్ ప్లాన్ ను ప్రారంభించిందని తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.

Update: 2024-12-14 16:10 GMT

దిశ ప్రతినిధి వికారాబాద్ : గురుకులల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కామన్ డైట్ ప్లాన్ ను ప్రారంభించిందని తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎన్నేపల్లి మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాలలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టల్ లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒకే విధమైన డైట్ ప్లాన్ ను ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తో కలిసి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినిలు శాసన సభాపతికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కళాశాలలో కామన్ డైట్ ప్లాన్ ను రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 40 శాతం డైట్ చార్జీలు పెంచడం, 200 కాస్మోటిక్ ఛార్జీలు పెంచిన డైట్ మెనూను ప్రారంభించడం సంతోషంగా ఉంది అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం అందించే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతుంది అన్నారు. కాబట్టి విద్యార్థులు చక్కగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఉద్బోధించారు. అన్ని సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు వీలుగా ప్రభుత్వం కామన్ డైట్ ప్లాన్ ను ప్రారంభించిందని తెలిపారు. తద్వారా పిల్లలకు పోషకాలతో కూడిన బలవర్ధక ఆహారం అందాలని, వారు మరింత మెరుగైన విద్యను అభ్యసించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని అన్నారు. విద్యార్థులు మంచిగా చదువుకొని జిల్లాకు మంచి పేరు తేవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ లో మాట్లాడటం ఎవరికి సాధ్యం కాదని మైనార్టీ గురుకుల పాఠశాల బాలికలకే సాధ్యమని విద్యార్థులను అభినందించారు. జిల్లాలో 7 మైనార్టీ గురుకుల కాలేజీలు ఉన్నాయని, వసతి గృహాలు, పాఠశాలల విద్యార్థుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం 40 శాతం డైట్ చార్జీలను, 200 శాతం కాస్మొటిక్ చార్జీలను పెంచడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన కార్యక్రమాలు అలరింపజేశాయి. అనంతరం స్పీకర్ ప్రసాద్ కుమార్ హాస్టల్ లోని స్టోర్ రూమ్ ను సందర్శించి, సన్న బియ్యం, పప్పు దినుసులు, కూరగాయల నాణ్యతను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, ఆర్డిఓ వాసు చంద్ర, కళాశాల ప్రిన్సిపాల్ మహబూబ్ పాతిమా, వైస్ చైర్ పర్సన్ శంషాద్ బేగం, కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిదులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


Similar News