దిశ, రంగారెడ్డి ప్రతినిధి/అబ్దుల్లాపూర్‌మెట్: దేశంలో వామపక్షాల ఐక్యతను బలోపేతం చేసుకుంటూనే, కమ్యూనిస్టుల పునరేకీకరణ వైపు అడుగులు పడాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సూచించారు. సీపీఎం రాష్ట్ర మహాసభల్లో చాడ వెంకటరెడ్డి సౌహార్థ సందేశం ఇస్తూ... దేశంలో రాజ్యాంగ, ప్రజాస్వామ్య, లౌకిక విలువలకు విరుద్ధంగా మోదీ పాలన సాగుతోందని విమర్శించారు. ప్రజల కోసం కాకుండా కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలే లక్ష్యంగా పాలన సాగుతోందని, ప్రజా సేవకులు కనుమరుగై, ప్రజాభక్షకులు ఊరేగుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడమే ధ్యేయంగా మోదీ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. సాగు చట్టాలను తీసుకొచ్చి రైతాంగాన్ని దెబ్బతీయాలని చూశారన్నారు.
దేశంలో మతోన్మాద చర్యలు పెరిగిపోయాయని, దళితులు, మైనార్టీలపై దాడులు జరగడం హేయమన్నారు. ప్రజాగొంతుకలను నొక్కేస్తూ, రాజద్రోహం కేసులు పెడుతున్నారన్నారు. రాజులు, రాజ్యాలు పోయినా... ఇంకా రాజద్రోహం కేసులు ఏంటని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించినా.. బీజేపీ సర్కార్‌కు సిగ్గురావడం లేదన్నారు. బీజేపీ ఉంటే దేశంలో ప్రజాస్వామ్యం ఉండబోదని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా భావసారూప్య పార్టీలతో కలిసి వామపక్షాలు ముందుకు సాగాలని సూచించారు. కమ్యూనిస్టుల ఐక్యతతో పాటు, సీపీఎం, సీపీఐ పునరేకీకరణ వైపు అడుగులు పడాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వ పునాదుల మీద వామపక్ష శక్తులు రాష్ట్రంలో బలోపేతం కావాలన్నారు.