మూతపడిన అంగన్వాడి కేంద్రం.. ఇబ్బందుల్లో చిన్నారులు

అంగన్వాడీ కేంద్రం మూతపడి నెల రోజులు గడుస్తుండడంతో

Update: 2024-08-06 08:50 GMT
మూతపడిన అంగన్వాడి కేంద్రం.. ఇబ్బందుల్లో చిన్నారులు
  • whatsapp icon

దిశ,శంకర్పల్లి : అంగన్వాడీ కేంద్రం మూతపడి నెల రోజులు గడుస్తుండడంతో చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శంకర్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామంతపూర్ గ్రామంలో నెల రోజులుగా అంగన్వాడి కేంద్రం మూతపడటంతో చిన్నారులకు కేంద్ర ప్రభుత్వం ద్వారా సరఫరా ఏ పౌష్టికాహారం అందకపోగా ఇంటి వద్దనే ఆటలాడుకుంటున్నారు. ఇక్కడ పనిచేసే టీచర్ గత నెలలో పదవీ విరమణ చేయడంతో నెల రోజులుగా గదికి తాళం వేసి ఉంది. కనీసం పక్క గ్రామం నుండి మరో కేంద్రం టీచర్ కు కూడా ఇన్చార్జి ఇవ్వకపోగా ఆయాకు కూడా ఇన్చార్జి ఇవ్వకపోవడంతో కేంద్రానికి వచ్చే చిన్నారులు ఇంటి వద్దనే ఆడుకుంటున్నారు. చేవెళ్ల స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శంకర్పల్లి మండల పరిధిలోని రామంతపూర్ అంగన్వాడి కేంద్రం లో సుమారు 20 మంది వరకు చిన్నారులు కేంద్రానికి వస్తుంటారు. కేంద్రం ద్వారా చిన్నారులతో పాటు మహిళలకు కూడా ప్రభుత్వం ద్వారా సరఫరా అయ్యే పౌష్టికాహారం కోడిగుడ్లను పంపిణీ చేయాల్సి ఉంది. నెల రోజులుగా ఈ కోడిగుడ్లు ఈ పౌష్టికాహారం పంపిణీ చేయక పోవడం పట్ల తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయమై మున్సిపల్ కౌన్సిలర్ రామంతపూర్ చాకలి అశోక్ ను సంప్రదించగా ఇక్కడ పని చేసిన అంగన్వాడీ కేంద్రం టీచర్ పదవీ విరమణ అయినట్లు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు సమాచారం ఇచ్చారని తెలిపారు. ఆమె స్థానంలో మరొకరికి బాధ్యతలు ఇవ్వకపోవడంతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ శంకర్పల్లి సూపర్వైజర్ యశస్విని ను వివరణ కోరగా రామంతపూర్ సెంటర్లో టీచర్ 65 సంవత్సరాలు నిండినందున ప్రభుత్వం పదవీ విరమణ చేసిందని అక్కడ ఆయా కూడా ముందు నుంచే లేరని తెలిపారు. పక్కనే ఉన్న చెందిప్ప కేంద్రంలో కూడా టీచరు పదవీ విరమణ చేశారని అక్కడ ఆయా ఉండడంతో సెంటర్ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. తాత్కాలికంగా మిర్జా గూడ అనుబంధ గ్రామమైన మియా ఖాన్ గడ్డ మినీ అంగన్వాడి కేంద్రం టీచర్ కు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు.


Similar News