శంకర్ పల్లి లో ఇజ్తేమా గాహ కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి : జిల్లా కలెక్టర్

శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని జంబోరి ప్రాంగణంలో ఈ నెల 4,5 తేదీలలో నిర్వహించే ఇజ్తేమా గాహ్ కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయినట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు.

Update: 2025-01-03 11:04 GMT

దిశ, శంకర్ పల్లి : శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని జంబోరి ప్రాంగణంలో ఈ నెల 4,5 తేదీలలో నిర్వహించే ఇజ్తేమా గాహ్ కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయినట్లు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం శంకరపల్లి లోని ఇజ్తేమా గాహ్ కార్యక్రమం నిర్వహించే జంబోరి ప్రాంగణం నుంచి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి తో కలిసి ఆయా శాఖల అధికారులతో, మత పెద్దలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ఆయా శాఖల అధికారులు మత పెద్దలతో సమన్వయంతో కార్యక్రమం విజయవంతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. ఆయా శాఖల అధికారులు తమకు అప్పగించిన పనులను పూర్తిచేయాలని ఇంకా ఏదైనా మిగిలిపోయిన పనులు ఉంటే కూడా సకాలంలో పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కార్యక్రమానికి కావాల్సిన విద్యుత్తు, మంచినీరు, రోడ్ల సౌకర్యం, టాయిలెట్లు, పారిశుద్ధ్య నిర్వహణ, తదితర వాటి కోసం ప్రభుత్వం రూ.2 కోట్లు నిధులు మంజూరు చేసిందని ఇప్పటికే దాదాపు పనులన్నీ పూర్తయినట్లు తెలిపారు. పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల దారి మళ్లింపు, తదితర ఏర్పాట్లు కూడా పూర్తయినట్లు తెలిపారు. చేవెళ్ల ఆర్డీవో చంద్రకళ పర్యవేక్షణలో సంబంధిత అధికారులు కార్యక్రమం విజయవంతం అయ్యే వరకు మత పెద్దలతో సమన్వయం చేసుకొని కార్యక్రమం విజయవంతం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ అధికారులు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

అన్ని ఏర్పాట్లు పూర్తి

శంకర్ పల్లి కి సమీపంలోని జంబోరి గ్రౌండ్లో 166 ఎకరాలలో కార్యక్రమ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి వైద్య ఆరోగ్యశాఖ తరపున రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఐదు క్లినిక్లు,120 స్నానాల గదులు, 480 మూత్రశాలలు, 3 వేలు మరుగుదొడ్లు,4000 నీటి కుళాయిలు, వివిధ ప్రాంతాల వారికి వంట వండే 25 వంటశాలలు పూర్తయ్యాయి. విద్యుత్ సౌకర్యం నిమిత్తం 13 ట్రాన్స్ఫార్మర్లు బిగించినట్లు తెలిపారు. నీటి నిల్వ కోసం రెండు సంపులు నిర్మించినట్లు తెలిపారు. సుమారు మూడు నుంచి నాలుగు లక్షల వరకు హాజరయ్యే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ముస్లిం ప్రతినిధుల కోసం సుమారు 800 బస్సులు 3వేల ప్రైవేట్ వాహనాలు, 20 వేల ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా నలుగురు ఏసీపీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్లు పోలీసు సిబ్బంది సుమారు 500 మంది వరకు పాల్గొంటారని వీరికి సమీపంలోని బద్దం సురేందర్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో వసతి సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.

ఫోన్లో నిమగ్నమైన కొందరు అధికారులు

జిల్లా కలెక్టర్ ఎంతో సీరియస్ గా కార్యక్రమం నిర్వహణ కోసం శుక్రవారం శంకర్ పల్లి కి వచ్చి అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. శాఖల వారీగా ప్రతిపాదించిన పనులు పూర్తయిన పనులు, మిగిలిపోయిన పనులు ఎప్పటి వరకు పూర్తి అవుతాయని అనే వివరాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా ఇలాంటి లోటుపాట్లు జరగకుండా సమన్వయంతో అధికారులు పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. సమీక్షా సమావేశం ఓవైపు జరుగుతుండగానే కొంతమంది అధికారులు ఫోన్లో నిమగ్నం కావడం గమనార్హం.

ప్రారంభమైన ట్రయల్ రన్

ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు సమావేశ స్థలానికి చేరుకోవడంతో వివిధ ప్రాంతాలలో డ్యూటీలో ఉన్న పోలీసులతో పాటు వాలంటీర్లు, యాత్రికులకు మార్గదర్శనం చేస్తున్నారు. శంకర్ పల్లి మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే భారీ వాహనాలను ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే ట్రాఫిక్ మళ్లింపుకు సంబంధించిన సూచనలు చేశారు.


Similar News