ఆ మున్సిపాలిటీ కార్యాలయంలో అంతా మాయ.. బయటకి తాళాలు లోపల చక్కదిద్దుకున్న వ్యవహారాలు..

రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ కార్యాలయంలో అంతా మాయ జరుగుతోంది.

Update: 2024-12-14 09:47 GMT

దిశ, అబ్దుల్లాపూర్మెట్ : రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ కార్యాలయంలో అంతా మాయ జరుగుతోంది. రెండవ శనివారం అధికారికంగా సెలవు ఉన్నప్పటికీ బయట నుంచి తాళాలు వేసి లోపల కార్యాలయాలకు సంబంధం లేని వ్యక్తులతో పాటు సిబ్బంది పాల్గొని వ్యవహారాలను చక్కదిద్దుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. వివరాల్లోకి వెళితే రెండో శనివారం కావడంతో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉంది. కాగా పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ కార్యాలయానికి బయటి నుంచి తాళాలు వేసినప్పటికీ లోపల మాత్రం కొంతమంది సిబ్బంది తమ వ్యవహారాలు చక్కదిద్దుకునే పనుల్లో పడిపోయారు. వీరితో పాటు కార్యాలయానికి సంబంధం లేని వ్యక్తులు కూడా పాల్గొని కంప్యూటర్లను వాడుతున్నారని తెలుస్తోంది. మున్సిపాలిటీ పరిధిలోని ఇంజనీరింగ్ కార్యాలయంలో కొంతమంది కాంట్రాక్టర్లు, కిందిస్థాయి సిబ్బందితో తమకు నచ్చిన విధంగా పనులు చేసుకునే పనుల్లో పడిపోయినట్లు తెలుస్తోంది.

బయట వ్యక్తులతో కార్యాలయానికి సంబంధించిన వారు కుమ్మక్కయి వారికి సహకరిస్తూ ఏం జరుగుతోందో అన్న ఆసక్తి రేపుతోంది. కొంతమంది ప్రజాప్రతినిధులు, వారి బంధువులు సైతం శనివారం కార్యాలయానికి చేరుకొని త్వరలో జరగబోయే మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశానికి సంబంధించిన పలు వ్యవహారాలు చక్కదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదంతా కిందిస్థాయి సిబ్బంది చేయడం చూస్తుంటే పై అధికారులకు విషయం తెలుసా లేదా కార్యాలయంలో ఏం జరుగుతోంది అన్న ఆసక్తి నెలకొంది. ఈ విషయమై సంబంధిత ఇంచార్జి కమిషనర్ను వివరణ కోరేందుకు దిశ ప్రతినిధి ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ఏదేమైనా సెలవు రోజుల్లో బయటికి తాళాలు వేసుకొని చక్కగా విధులు నిర్వహిస్తున్నారు అంటే ఎటువంటి కార్యకలాపాలు సాగుతున్నాయో ప్రజలకు ఇట్టే అర్థమవుతుంది. కొంతమంది స్థానిక ప్రజాప్రతినిధుల ఆదేశాల మేరకు తప్పుడు వ్యవహారాలు కూడా చేస్తున్నట్లు స్థానికులు వాపోతున్నారు. ఈ ఒక్క రోజే కాకుండా ప్రతిరోజు కూడా రాత్రి 12 గంటల వరకు సంబంధం లేని వ్యక్తులతో కొంతమంది సిబ్బంది అధికారులు తమ కావాల్సిన విధంగా వ్యవహారాలు చక్క దిద్దుకుంటున్నట్లు స్థానికులు వాపోతున్నారు.


Similar News