సరికొత్త డిజైన్‌లో రాజీవ్‌గాంధీ విగ్రహం.. సీఎం చేతుల మీదుగా నేడే ఆవిష్కరణ

దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ సరికొత్త విగ్రహాన్ని విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు.

Update: 2024-09-16 01:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణకు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సచివాలయం ముందున్న రెండెకరాల విస్తీర్ణంలో ఇటీవల నెలకొల్పిన విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ నేతలు, అనుబంధ సంఘాల నాయకులు హాజరుకానున్నారు. రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా ఏఐసీసీ పెద్దల చేతుల మీదుగా గత నెలలోనే ఆవిష్కరణ జరిగేలా సీఎం రేవంత్ ప్లాన్ చేశారు. కానీ కొన్ని కారణాలతో ఆ షెడ్యూలు వాయిదా పడటంతో ఇప్పుడు దానికి ముహూర్తం ఖరారైంది. సీఎం చేతుల మీదుగా సోమవారం సాయంత్రం 3.45 గంటలకు విగ్రహావిష్కరణ జరగనున్నది. పీసీసీ చీఫ్‌గా మహేశ్‌కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి నేతలు, శ్రేణులు ఇప్పటికే నగరానికి చేరుకున్నందున విగ్రహావిష్కరణ ప్రోగ్రామ్‌కు వారు కూడా హాజరవుతున్నారు.

ఈ విగ్రహం నమూనా విభిన్నంగా ఉండేలా స్వయంగా సీఎం రేవంత్ చొరవ తీసుకున్నారు. ఇప్పటివరకు వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఏయే డిజైన్‌లలో రాజీవ్‌గాంధీ విగ్రహాలు ఉన్నాయో ఆరా తీసిన సీఎం... భిన్నంగా ఉండాలంటూ శిల్ప కళాకారులకు సూచనలు చేశారు. నగరంలోని జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ సహా అమరజ్యోతిని డిజైన్ చేసిన ఆర్టిస్ట్ రమణారెడ్డి‌తో పాటు పలువురిని సంప్రదించారు. రాజీవ్‌గాంధీకి ఉన్న ప్రత్యేకమైన శైలి డిజైన్‌లో ఉట్టిపడేలా ఉండాలని సూచించారు. దానికి అనుగుణంగా రమణారెడ్డి రూపొందించిన డిజైన్‌ను, దాని మినీయేచర్‌ను పరిశీలించిన సీఎం కొన్ని స్వల్ప మార్పులతో ఫైనల్ చేశారు. దానికి అనుగుణంగానే కాంస్య విగ్రహం తయారైంది. దాదాపు 15 అడుగుల ఎత్తయిన ఈ విగ్రహానికి సుమారు 1,800 కిలోల కంచును వినియోగించారు. వాతావరణ పరిస్థితులకూ తట్టుకుని ఉండేలా దీన్ని రూపొందించారు.

కుడి చేతి నుంచి జనంలోకి దండను విసిరేసే డిజైన్‌

బహిరంగసభలకు హాజరయ్యే రాజీవ్‌గాంధీకి అభిమానులు వేసే దండలను ఎప్పుడూ తన మెడలో ఉంచుకోరని, వాటిని వేదిక ముందు ఉన్న కార్యకర్తలు, ప్రజలు, అభిమానుల్లోకి విసిరేయడం ఆయనకు ఆనవాయితీ అని, అందువల్లనే దానికి తగిన డిజైన్‌ను తయారు చేసినట్టు ఆర్టిస్ట్ రమణారెడ్డి పేర్కొన్నారు. కుడి చేతి నుంచి జనంలోకి దండను విసిరేసే డిజైన్‌ను రూపొందించామని, దేశంలో ఇప్పటివరకు ఎక్కడా ఈ తరహాలో రాజీవ్‌గాంధీ విగ్రహాలు లేవన్నారు. చాలా సందర్భాల్లో లోహంతో తయారుచేసిన విగ్రహాలకు మెటాలిక్ పెయింట్ వేస్తూ ఉంటారని, కానీ కంచుతో తయారుచేసినందున దాని సహజ రూపం మారకుండా ఉండేందుకు ఎలాంటి పెయింట్ స్ప్రేయింగ్ విధానాన్ని వాడలేదని రమణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన మినీయేచర్ విగ్రహాన్నే సీఎం రేవంత్ తన నివాసంలోని మీటింగ్ హాల్‌లో ఉంచుకున్నారు. కలవడానికి వచ్చే అతిథులతో చర్చించే సమయంలో ఆ విగ్రహం ఆయన పక్కనే ఉన్న టేబుల్ మీద కనిపిస్తూ ఉంటుంది.


Similar News