తెలంగాణ ప్రజలకు రెయిన్ అలర్ట్..నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం బిగ్ అలర్ట్ జారీ చేసింది. నేడు(బుధవారం) రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని IMD సూచించింది.
దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం బిగ్ అలర్ట్ జారీ చేసింది. నేడు(బుధవారం) రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని IMD సూచించింది. గురువారం నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ అధికారులు తెలిపారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో నిన్న (మంగళవారం) పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం కుంచవెల్లిలో 13.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
ఈ క్రమంలో నేడు తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ జిల్లాల్లో 11.5 నుంచి 20 సెం.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు గురువారం రోజున కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్, నల్గొండ, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.