సోనియా గాంధీ పేరుతో ప్రజాపాలన దరఖాస్తు.. సోషల్ మీడియాలో వైరల్
ప్రభుత్వం ప్రజల వద్ద నుంచి స్వీకరించిన ప్రజాపాల దరఖాస్తులకు సంబంధించి రోజుకో అంశం హాట్ టాపిక్ అవుతున్నది.
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వం ప్రజల వద్ద నుంచి స్వీకరించిన ప్రజాపాల దరఖాస్తులకు సంబంధించి రోజుకో అంశం హాట్ టాపిక్ అవుతున్నది. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నట్లు సోనియా గాంధీ ఫోటోతో కూడిన ఓ అప్లికేషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో సోనియా గాంధీ కుమారుడిగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కూతురిగా కొండా సురేఖ, అల్లుడిగా శ్రీధర్ బాబు పేర్లు నమోదు చేశారు.
ఈ అప్లికేషన్లపై ఎటువంటి దరఖాస్తు నెంబర్ లేకపోవడంతో ఇది అకతాయిల పనిగా భావిస్తున్నారు. కాగా ఇటీవల హన్మకొండ జిల్లాలో శివుడు (దేవుడు) పేరుతో దరఖాస్తు చేసుకున్న ఘటన వెలుగు చూడగా ఆ తర్వాత ప్రజాపాలన దరఖాస్తుల్లో వింత సమాధానాలతో ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఇదంతా ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసేందుకు అకతాయిలు చేస్తున్న పనిగా అనుమానిస్తున్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.