ఖమ్మంలో పోటీకి సై.. హైకమాండ్ ఆదేశిస్తే రంగంలోకి దిగుతా: రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి
తాను ఖమ్మంలో పోటీ చేసేందుకు రెడీగా ఉన్నానని రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: తాను ఖమ్మంలో పోటీ చేసేందుకు రెడీగా ఉన్నానని రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. సోమవారం ఆమె గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. హైకమాండ్ ఆదేశిస్తే తప్పకుండా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. ఖమ్మం రాజకీయాలు తనకు స్పష్టంగా తెలుసునని వెల్లడించారు. ఖమ్మంను పాలిస్తే దేశాన్ని పాలించినట్టేనని వివరించారు. రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పటికీ లోక్ సభకు పోటీ చేయమంటే చేస్తానని క్లారిటీ ఇచ్చారు. మోడీ గ్యారంటీలకు వారంటీ అయిపోయిందని ఎద్దేవా చేశారు. పదేళ్లు పవర్‌లోఉండి ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడిచారని ఆరోపించారు. ఇక కేసీఆర్‌కి డోస్ ఎక్కువైందని, అందుకే ఏదేదో మాట్లాడుతున్నాడని అన్నారు.
మోదీ హిందువులను ద్వేషిస్తున్నారని, ఆయన వ్యాఖ్యలపై ఎలాంటి శిక్ష వేస్తారో ఎన్నికల కమిషన్ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. దేశ మహిళలను మోదీ అవమాన పరిచాడని ఆరోపించారు. మోదీకి రాజ్యాంగం దేశ చరిత్ర గురించి ఏ మాత్రం తెలియదని అన్నారు. విచ్చలవిడిగా అబద్ధాలు చెప్తూ, బతికేస్తున్నాడంటూ సెటైర్లు వేశారు. హిందూ మహిళల మాంగళ్యాలను ముస్లీంలు తీసుకువెళ్తున్నారంటూ మోడీ రెచ్చగొడుతున్నాడని ఫైర్ అయ్యారు. మోదీ కట్టిన తాళి తన భార్యకి ఉరితాడుగా మారిందని విమర్శించారు. దేశంలోని ముస్లింలను అవమాన పరచడానికి మోదీకి ఎంత దమ్ము అంటూ విమర్శించారు. మంగళసూత్రాలు ఇచ్చినా, తీసుకునే ముస్లీంలు ఎవరూ లేరని, రాష్ట్రంలో మెజార్టీ లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని రేణుకా ధీమా వ్యక్తం చేశారు.