Ganta: శీలహననం ఎవరు చేసినా తప్పే.. కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రొ.ఘంటా చక్రపాణి

బాధ్యాతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలా మాట్లాడితే ఎలా అని, సాటి మహిళల్ని గౌరవించకుండా ఆ గౌరవాన్ని ఆశించడం అత్యాశే అవుతుందని టీజీపీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొ. ఘంటా చక్రపాణి వ్యాఖ్యానించారు.

Update: 2024-10-02 11:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బాధ్యాతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలా మాట్లాడితే ఎలా అని, సాటి మహిళల్ని గౌరవించకుండా ఆ గౌరవాన్ని ఆశించడం అత్యాశే అవుతుందని టీజీపీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొ. ఘంటా చక్రపాణి వ్యాఖ్యానించారు. నాగచైతన్య, సమంత విడాకుల అంశంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఘంటా.. ఆ సంగతి మీకెవరు చెప్పారు సురేఖ గారూ.? వాళ్ల విడాకుల పత్రంలో ఆ వివరాలు ఉన్నాయా? అని ఎద్దేవా చేశారు.

రాష్ట్రమంత్రిగా ఒక బాధ్యాతాయుతమైన స్థానంలో ఉన్న మీరే ఒక ప్రముఖ నటి వ్యక్తిగత జీవితాన్ని ఇలా బజారుకు ఈడ్చి మాట్లాడితే ఎలా? అని ప్రశ్నించారు. ఎవరో ముక్కూమొహం తెలియని వాళ్లు ఏదో రాశారని బాధ పడ్డారు. ఆ బాధ సహజమే, కానీ సాటి మహిళల్ని మీరే గౌరవించనప్పుడు అదే గౌరవాన్ని ఆశించడం అత్యాశే కదా! అని అన్నారు. అలాగే మీరు మాట్లాడిన మాటలను ప్రతిపక్షాలు లేదా మీరంటే గిట్టని వాళ్ళో కాదు స్వయంగా మీ పార్టీ ఇలా ప్రచారం చేయడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. మహిళల శీలహననం ఎవరు చేసినా తప్పేనని మండిపడ్డారు. అధికార బాధ్యతల్లో ఉండి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్లు ఏది మాట్లాడినా ఎదురు మాట్లాడవద్దు అంటే కుదరదని, యధారాజా!.. తధా ప్రజ!! అని ఎక్స్ లో రాసుకొచ్చారు.


Similar News