‘ఈ-పాస్’తో ఇబ్బందులు.. ఇంటర్నెట్ సేవల్లో అంతరాయం
ఈ నెల నుంచి రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుండటంతో ఎప్పుడూ లేని విధంగా లబ్ధిదారులు క్యూ లైన్ లో నిలబడి తీసుకుంటున్నారు. అయితే ఇంటర్ నెట్ సేవల్లో అంతరాయం, ఈ-పాస్ యంత్రాలు మొరాయిస్తుండడంతో డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల నుంచి రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుండటంతో ఎప్పుడూ లేని విధంగా లబ్ధిదారులు క్యూ లైన్ లో నిలబడి తీసుకుంటున్నారు. అయితే ఇంటర్ నెట్ సేవల్లో అంతరాయం, ఈ-పాస్ యంత్రాలు మొరాయిస్తుండడంతో డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా సన్న బియ్యం పంపిణీలో సమస్యలు వస్తున్నాయి. అయితే ఇప్పటివరకు 75 శాతం మంది లబ్ధిదారులు సన్న బియ్యం తీసుకున్నట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది. ఇంకా ఐదారు రోజుల్లో అర్హులందరికీ బియ్యం పంపిణీ చేస్తామని స్పష్టం చేసింది. సన్న బియ్యం కోటా పూర్తయినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, 8 నెలలకు సరిపడా 16 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం గోదాముల్లో నిల్వ ఉన్నట్లు తెలిపింది. ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించింది. కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరికి సన్న బియ్యం ఇస్తామని, రేషన్ కార్డుల్లో చేర్పులు, మార్పులతో వచ్చే వారికి వచ్చే నెల నుంచి పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
సాఫ్ట్ వేర్ అప్ డేట్‌తో..
ఈ-పాస్ యంత్రాల్లో సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేయడంతోపాటు కొన్ని దుకాణాలకు కొత్త యంత్రాలు ఇవ్వడం, వాటిపై డీలర్లకు అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి. గోదాముల నుంచి సన్న బియ్యం దుకాణాలకు చేరిన వెంటనే ఈ-పాస్ యంత్రాలు స్టాక్ వివరాలు నమోదు చేయకపోవడంతో పాటు అదనంగా ఇంటర్ నెట్ సమస్య సైతం ఏర్పడుతున్నది. దీంతో బియ్యం పంపిణీ ఆలస్యంగా జరుగుతుంది. కొన్ని చోట్ల లబ్ధిదారుల వేలిముద్రలు మ్యాచ్ కాకపోవడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని డీలర్లు వాపోతున్నారు.
రికార్డు స్థాయిలో..
రాష్ట్రంలో ప్రతి నెల బియ్యం పంపిణీ కోసం నెల రోజులు రేషన్ దుకాణాలు అందుబాటులో ఉంచినా.. లబ్ధిదారులు అంతగా ఆసక్తి కనబర్చేవారు కాదు. ప్రస్తుతం సన్న బియ్యం పంపిణీ చేస్తుండటంతో రేషన్ దుకాణాల వద్ద క్యూలైన్ కనిపిస్తున్నది. త్వరగా బియ్యం పంపిణీ చేసేందుకు డీలర్లు సహాయకులు పెట్టుకున్నారు. పౌరసరఫరాల గణాంకాల ప్రకారం ఈ నెల పదో తేదీ వరకు 75 శాతం బియ్యం పంపిణీ అయింది. 90 లక్షల కార్డుల ద్వారా 3.10 కోట్ల మందికి ఈనెల 15వ తేదీలోగా పంపిణీ చేయాలి. కానీ ఇప్పటివరకు 65 లక్షల కార్డుల ద్వారా 2.60 కోట్ల మందికి సన్న బియ్యం అందజేశారు. రెండు విడతల్లో డీలర్లు బియ్యం తీసుకొస్తే ఇప్పటికే ఖాళీ అయ్యాయి. కొన్నిచోట్ల డీలర్లు మరో దఫా తీసుకొచ్చేందుకు డీడీలు కట్టినట్లు అధికారులు వెల్లడించారు.