కొత్త పాస్​బుక్కుల కోసం చిక్కులు.. ధరణి తెచ్చిన తంటా..!

ధరణి వచ్చాక సమస్యలు తీరుతాయనుకుంటే బాధలు మరింత పెరిగాయనడానికి నిదర్శనమే ఖిలావరంగల్ రైతుల కన్నీటి గాథ.

Update: 2023-05-13 03:02 GMT

దిశ, ఖిలా వరంగల్ : ధరణి వచ్చాక సమస్యలు తీరుతాయనుకుంటే బాధలు మరింత పెరిగాయనడానికి నిదర్శనమే ఖిలావరంగల్ రైతుల కన్నీటి గాథ. ఖిలావరంగల్ గ్రామంలో ఎక్కువ శాతం వ్యవసాయమే జీవనాధారంగా ప్రజలు పనిచేస్తున్నారు. తాతముత్తాతల నుంచి ఇక్కడి ప్రజలు వ్యవసాయమే వృత్తిగా ఎంచుకుని జీవనం సాగిస్తున్నారు. ఎక్కువ శాతం చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. చాలా మంది రైతులకు 10, 15 గుంటలలోపే వ్యవసాయ భూమి కలిగినవారు ఉన్నారు. ఆ భూముల్లో ఆకు కూరలు, కాయగూరలు పండిస్తూ వరంగల్ సిటీకి తరలిస్తుంటారు.

సిటీ వచ్చే ఆకుకూరల్లో 80శాతం ఇక్కడే పండిస్తారు. ఇంత వరకు బాగానే ఉన్న అసలు సమస్య రెవెన్యూ శాఖతోనే వచ్చిందని రైతులు వాపోతున్నారు. తాత, ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న భూమి సాగు చేసుకుంటున్నాము కానీ, ఆ భూమికి పట్టా పొందలేకపోతున్నామని ఆందోళన చెందుతున్నారు. ఇలా ఒకరిద్దరు రైతులు మాత్రమే కాదు దాదాపు 30 శాతం మంది రైతులకు పట్టా పాస్​పుసక్తాలు లేక తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి ఆశలు వదిలేసుకున్నామని వాపోతున్నారు. ధరణి పాస్​బుక్కులు లేకుంటే అగ్రికల్చర్ అధికారులు రైతుబంధు సాయం కూడా ఇస్తలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమి ఉండి వ్యవసాయం చేస్తూ పెట్టుబడికి రైతుబంధు సాయం అందుకోలేక, రైతు మరణించినా రైతు బీమా రావడం లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో ఆత్మస్థైర్యం కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ధరణిలో తాత పేరు.. మోకా మీద వారసుడు..

ఖిలా వరంగల్ గ్రామ రెవెన్యూ రికార్డుల ప్రకారం భూమి సర్వే నెంబర్ 1639/డీలో రైతు సుతారి లక్ష్మయ్యకు 30గుంటల భూమి ఉంది. లక్ష్మయ్యకు ముగ్గురు కుమారులు. లక్ష్మయ్య పేరు మీద ధరణి రాక ముందుకు రెవెన్యూ పాస్ బుక్ ఉంది. ప్రభుత్వం పాత పాస్ బుక్కులు రద్దుచేసి ధరణి పాస్​బుక్కులు ఇచ్చే సమయంలో రైతు చనిపోతే ఆ రైతులకు కొత్త పాస్​బుక్కులు రాలేదు. కానీ, ఈ మధ్యనే ధరణిలో పాత పాస్ బుక్ ఉన్న రైతు చనిపోతే వారి వారసులకు ధరణి పాస్ బుక్ ఇచ్చే ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.

ఆప్షన్ వచ్చింది కదా అని వారసులు ధరణి పాస్ బుక్ కోసం మీ సేవలో అప్లికేషన్ పెట్టుకుంటే వారసత్వ సర్టిఫికెట్ సమర్పించాలని తహసీల్దార్​ సదరు దరఖాస్తులను రద్దు చేస్తున్నారు. రైతులకు తహసీల్దార్ వారసత్వ సర్టిఫికెట్ మంజూరు చేయరని, కోర్టు నుంచి వారసత్వ సర్టిఫికెట్ తీసుకొస్తేనే ధరణి పాస్ బుక్ వస్తుందని తహసీల్దార్ సూచిస్తున్నారని రైతులు వాపోతున్నారు. రైతులు కోర్టుల చుట్టూ నెలల కొద్ది తిరగలేక, అటు వారసత్వ సర్టిఫికెట్ లేక భూమి హక్కు పట్టా పొందలేకపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకు పాస్​బుక్కు ఇచ్చే ప్రక్రియలో చేర్పులు మార్పులు చేసి సామాన్య రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Tags:    

Similar News