ప్రధాని మోడీ, కేసీఆర్‌ది ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ: ప్రియాంక్ ఖర్గే ఫైర్
కర్ణాటక గురించి బీఆర్ఎస్ నేతలకు ఏం తెలుసు..? అని ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే విమర్శించారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్
దిశ, తెలంగాణ బ్యూరో: కర్ణాటక గురించి బీఆర్ఎస్ నేతలకు ఏం తెలుసు..? అని ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే విమర్శించారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు పదే పదే కర్ణాటకలో ఐదు గ్యారంటీలు అమలు చేయడం లేదని విమర్శిస్తున్నారని, పంపిణీ చేస్తున్నామా? లేదా? అనేది బీఆర్‌ఎస్‌కు ఎలా తెలుసని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు ఎవరైన అప్లై చేశారా? అని ప్రశ్నించారు. అర్హులందరికీ స్కీమ్‌లు అందజేస్తున్నామన్నారు. గ్యారంటీలు అమలు కావడం లేదని ఎందుకు బద్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అంటేనే భరోసా అని, చెప్పింది చేసి చూపిస్తామని సవాల్ విసిరారు.
గత నాలుగైదు రోజుల నుంచి హైదరాబాద్‌లో తిరుగుతున్నామని, పదేళ్ల బీఆర్ఎస్ పరిపాలనలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. కానీ ఇక్కడి అంశాలు మరచిపోయి కర్ణాటక ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పనిపెట్టుకొని మరీ విమర్శించడం సిగ్గు చేటన్నారు. సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేక, పక్క రాష్ట్రం మీద పడి ఏడవడం బంద్ పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. పేదలందరికీ కర్ణాటకలో మేలు జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ తమ మేనిఫెస్టోని చూసి భయపడుతుందన్నారు. అందుకే తెలంగాణను వదిలేసి కర్ణాటకపై విమర్శలుమొదలు పెట్టిందన్నారు. 2013లో తమ మ్యానిఫెస్టోలో 165 అంశాలు పెడితే ఏకంగా 158 హామీలు నెరవేర్చిన చరిత్ర కాంగ్రెస్ దన్నారు.
అదే విధంగా ఐదు గ్యారంటీల్లో నాలుగింటిని 6 నెలల్లోపే అమలు చేశామన్నారు. ఇప్పటి వరకు కోటి 60 లక్షల మందికి గృహలక్ష్మీ పథకాన్ని అందజేశామన్నారు. అన్న భాగ్య స్కీమ్‌ను 3.92 కోట్ల మందికి ఇచ్చామన్నారు. ప్రతి రోజు ఆర్టీసీ బస్సుల్లో 60 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారన్నారు. కర్ణాటక ప్రభుత్వ స్కీమ్‌ల అమలుతో ఒక్కో కుటుంబం 80 వేల నుంచి లక్ష వరకు ఆదా చేసుకోగల్గుతుందన్నారు. మహిళలంతా తమ ప్రభుత్వం బాగుండాలని అన్ని టెంపుల్స్‌లో పూజలు చేస్తున్నారన్నారు. అనుమానం ఉంటే గాంధీభవన్‌లో ప్రత్యేక బస్సును ఏర్పాటు చేస్తానని బీఆర్ఎస్ నేతలంతా కర్ణాటకకు విజిట్ చేయాలని ప్రియాంక్ ఖర్గే పేర్కొన్నారు.
పది లక్షల కోట్లు అవినీతి..
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పది ప్రధాన స్కీమ్‌లపై పది లక్షల కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించారు. ఇవన్నీ కేసీఆర్ కుటుంబానికి లాభం చేకూర్చాయన్నారు. బీఆర్‌ఎస్ అంటే బ్రష్టు రాష్ట్రీయ సమితి అని విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్‌లు పరస్పర సహకారంతో దోపిడికి పాల్పడుతున్నాయన్నారు. కేసీఆర్.. మోడీతో ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ తరహాలో వ్యవహరిస్తున్నాడన్నారు. రెండు పార్టీలకు కాంగ్రెస్ పవర్‌లోకి రాకూడదనే లక్ష్యం ఉన్నదన్నారు.
అవి కలలుగానే మిగులుతాయన్నారు. తెలంగాణతో పాటు భవిష్యత్‌లో కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ధీమాను వ్యక్తం చేశారు. తెలంగాణలో 3600 మంది యువత సూసైడ్ చేసుకున్నా.. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం తగ్గలేదన్నారు. తెలంగాణలో సరైన జాబ్స్ దొరకక చాలా మంది కర్ణాటకకు వచ్చి ఉద్యోగం పొందుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వి హనుమంతరావు, మాజీ మంత్రి పుష్ఫ లీల తదితరులు పాల్గొన్నారు.