Telangana నుంచి లోక్‌సభకు PM Narendra Modi పోటీ?
దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై బీజేపీ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలను, ప్రాజెక్టులను, నిధులను మంజూరు చేస్తున్నది.
ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి తెలంగాణ నుంచి పోటీ చేయనున్నారా? అందుకు మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం సూటబుల్‌గా ఉంటుందని భావిస్తున్నారా ? ఇక్కడి నుంచి పోటీ చేస్తే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం అయ్యేందుకు ఆస్కారం ఉంటుందని ఆలోచిస్తున్నారా ?.. ఇలాంటి ప్రశ్నలకు ఢిల్లీ కేంద్ర కార్యాలయ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో రాష్ట్రంలో ఇటీవలే జరిగిన సీక్రెట్ సర్వేలో సానుకూల అభిప్రాయాలే వచ్చాయని, త్వరలో సెకండ్ ఫేజ్ స్టడీ కూడా ఉండనున్నదని, ఆ తర్వాతే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలిసింది.
దిశ, తెలంగాణ బ్యూరో: దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై బీజేపీ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలను, ప్రాజెక్టులను, నిధులను మంజూరు చేస్తున్నది. స్వయంగా ప్రధాని మోడీ చేతుల మీదుగా పలు డెవలప్‌మెంట్ యాక్టివిటీస్‌లు జరుగుతున్నాయి. గతంతో పోలిస్తే తమిళనాడులోనూ పార్టీ స్ట్రాంగ్ అవుతున్నదనే ధీమా వ్యక్తమవుతున్నది. దక్షిణాదిలో కర్నాటక మినహా మరెక్కడా అధికారంలో లేని బీజేపీ తెలంగాణలో గెలిచి సౌత్ ఇండియాకు 'గేట్ వే'గా మలుచుకోవాలనుకుంటున్నది. ఇందుకోసం తెలంగాణలోని మహబూబ్ నగర్ నుంచి స్వయంగా ప్రధాని మోడీ పోటీ చేయడం ద్వారా అన్ని దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు గట్టి మెసేజ్ పంపడంతో పాటు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు దోహదపడుతుందన్నది పార్టీ భావన.
మహబూబ్‌నగర్ స్థానంపై స్పెషల్ ఫోకస్
తెలంగాణలో దీర్ఘకాలం నుంచి బీజేపీకి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో గట్టి పట్టు ఉంది. పార్టీ శ్రేణులు, యాక్టివిటీక్ కూడా ఎక్కువే. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి వాజ్‌పేయి హయాంలో(1999-2004) జితేందర్ రెడ్డి బీజేపీ టికెట్ మీద గెలిచారు. మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి కూడా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నం శ్రీనివాసరెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. జనతాపార్టీలో ఉన్న టైమ్‌లో రెండు సార్లు జైపాల్‌రెడ్డి కూడా ఈ లోక్‌సభ నియోజకవర్గం నుంచే గెలుపొందారు. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సైతం ఈ జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్ల మీదుగా ప్రజా సంగ్రామ యాత్ర చేసిన సందర్భంగా ప్రజల నుంచి మంచి ఆదరణ లభించిందనే భావన ఉన్నది.
సీక్రెట్ సర్వే
మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితితో పాటు మోడీ పోటీ చేస్తే ఆ ప్రభావం మొత్తం జిల్లా, రాష్ట్రం మీద ఏ స్థాయిలో ఉంటుందనే దానిపై ఫస్ట్ రౌండ్ సర్వే సీక్రెట్‌గానే జరిగింది. తెలంగాణ నుంచి మోడీ పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లయితే అది మహబూబ్‌నగర్ నుంచే పోటీ చేసే అవకాశముంది. ఈ జిల్లాకు చెందిన జితేందర్ రెడ్డి 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున గెలిచినా ఇప్పుడు బీజేపీలో ఉండడంతో ఆయన వ్యక్తిగత ఇమేజ్ కూడా ఈసారి పార్టీకి కలిసొస్తుంది. ఈ జిల్లాకు చెందిన డీకే అరుణ ఇప్పటికే పార్టీకి జాతీయ స్థాయి నాయకురాలిగా ఉన్నారు. మోడీ పోటీ చేయడం ఖరారైతే యావత్తు పార్టీ యంత్రాంగం భారీ మెజార్టీతో గెలిపించేందుకు సమిష్టిగా పని చేస్తుందని అనుకున్నట్టు తెలిసింది.
ప్రత్యామ్నాయంగా రామనాధపురం!
ఈ సారి ఎన్నికల్లో మోడీ దక్షిణాది నుంచి పోటీ చేయాలనే చర్చ పార్టీలో జరిగినప్పుడు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ప్రస్తావనకు వచ్చినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ తెలంగాణను కాదనుకుని తమిళనాడు నుంచి పోటీ చేయాలనుకుంటే రామనాధపురం ఉండొచ్చని సమాచారం. ఇక్కడ ఇప్పటి వరకూ బీజేపీ అభ్యర్థులు అసెంబ్లీ నియోజకవర్గాలుగానీ, లోక్‌సభకుగానీ గెలవలేదు. ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కువ. తొలినాళ్లలో కాంగ్రెస్ అభ్యర్థులు ఎంపీలుగా గెలిచినా డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు పట్టు పెంచుకున్నాయి. ఎంజీఆర్ హయాంలో ఒకసారి గెలిచినా ఆ తర్వాత కరుణానిధి (డీఎంకే) పట్టు పెంచుకుంది. ప్రస్తుతం ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌కు చెందిన ఎంపీ కొనసాగుతున్నారు.
త్వరలో సెకండ్ ఫేజ్ సర్వే !
ఫస్ట్ రౌండ్ సర్వేలో ఏ నియోజకవర్గం మోడీకి సూటబుల్‌గా ఉంటుంది?.. పార్టీ బలం, బలహీనతలేంటి?.. గెలుపుపై అనుమానం లేనప్పటికీ మోడీ ప్రభావం అసెంబ్లీ సెగ్మెంట్లపైనా, రాష్ట్రంపై ఏ మేరకు ప్రభావం చూపి పార్టీకి అనుకూలంగా మారుతుంది?.. ఇలాంటి అంశాలనే ప్రామాణికంగా తీసుకున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. అమిత్ షా పర్యవేక్షణలో జరిగిన ఈ సర్వే వివరాలను ప్రధానితో కూడా పంచుకున్నట్లు తెలిసింది. తొలుత ఒడిశా నుంచి పోటీ చేయాలని అనుకున్నా దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని విస్తరింపజేయడంతో పాటు అసెంబ్లీ, పార్లమెంటులో ప్రాతినిధ్యం పెంచడాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ, తమిళనాడు గురించే చర్చించినట్లు సమాచారం.
ఇక, సెకండ్ ఫేజ్‌లో మాత్రం మోడీ పోటీ చేయడం ద్వారా పడే ప్రభావంతో ఏ రాష్ట్రంలో ఎక్కువ లోక్‌సభ స్థానాలను గెలుచుకోడానికి దోహదపడుతుంది?.. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న నాలుగు స్థానాలు డబుల్ డిజిట్ దాటడానికి పరిస్థితి ఏ మేరకు అనుకూలంగా మారుతుంది?.. వంటి విషయాలపై అధ్యయనం జరగనుంది. గతంలో ప్రధానులుగా పని చేసిన ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేశారు. పీవీ నర్సింహారావు హన్మకొండ, నంద్యాల నుంచి పోటీ చేశారు. బీజేపీ దివంగత నేత సుష్మా స్వరాజ్ బళ్లారి నుంచి పోటీ చేశారు. కర్నాటక నుంచి మోడీ పోటీ చేయడంపై చర్చ జరిగినా అక్కడ ఎలాగూ బీజేపీ అధికారంలో ఉన్నందున ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయన్నది పార్టీ భావన. పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నందున ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై సుదీర్ఘ కసరత్తు తర్వాత స్పష్టత రానున్నది.
Also Read...