Prajavaani: విజయవంతంగా ప్రజావాణి.. వచ్చిన ఫిర్యాదులు 5.23 లక్షలు

ప్రజలు తమ సమస్యలను తెలపడానికి ప్రభుత్వం ప్రజావాణి ప్రోగ్రాంను ప్రారంభించింది.

Update: 2024-08-07 02:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజలు తమ సమస్యలను తెలపడానికి ప్రభుత్వం ప్రజావాణి ప్రోగ్రాంను ప్రారంభించింది. ఇది సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నదని భావిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎనిమిది నెలల కాలంలో జరిగిన ప్రగతి, ప్రజావాణి ఫలితాలపై ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షించారు. అనంతరం ప్రజావాణికి వచ్చిన అప్లికేషన్లు, వాటి స్వభావం, పరిష్కారమైనవి, ఇంకా పరిశీలనలో ఉన్నవి వివిధ అంశాలపై రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి విశ్లేషించారు. అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. దాదాపు 82 % దరఖాస్తులను పరిష్కారమైనట్టు క్లారిటీ వచ్చింది.

ప్రజావాణి ప్రోగ్రాం ద్వారా జిల్లాల కలెక్టరేట్లు, హైదరాబాద్‌లోని ప్రజాభవన్ ద్వారా ఇప్పటివరకు మొత్తం 5,23,940 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 4,31,348 పరిష్కారమైనట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మరో 92,582 అప్లికేషన్లను సంబంధిత విభాగాల అధికారులు పరిశీలిస్తూ ఉన్నారని, త్వరలోనే అవి కూడా పరిష్కారం అవుతాయని ఆ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వానికి వచ్చిన దరఖాస్తుల్లో దాదాపు 60 వేలు ప్రజలు నేరుగా ప్రజాభవన్‌కు వచ్చి అందజేసినవేనని తేలింది. దరఖాస్తులు, ఫిర్యాదుల్లో ఎక్కువగా కొత్త రేషను కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యోగావకాశాలకు సంబంధించినవే. ఈ మూడు రకాలకు చెందినవి మొత్తం దరఖాస్తుల్లో సగానికిపైగా ఉన్నట్టు తేలింది. ఇందులో ఆరు గ్యారంటీల అప్లికేషన్లే అధికం.

ఎస్ఎంఎస్ ద్వారా ఇన్ఫర్మేషన్

ప్రజావాణికి అందజేసిన దరఖాస్తు, పరిష్కారమైన వివరాలు నేరుగా దరఖాస్తుదారులకే మొబైల్ ఎస్ఎంఎస్ ద్వారా అందజేస్తున్నట్టు నాలుగు రోజుల క్రితం జరిగిన రివ్యూ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు స్టేట్ నోడల్ ఆఫీసర్ దివ్యా దేవరాజన్ వివరించారు. కానీ కొన్ని దరఖాస్తుల్లోని అంశాలు ప్రభుత్వ పాలసీలు, కోర్టు వివాదాలతో ముడిపడి ఉన్నందున, వెంటనే నిర్ణయం తీసుకోవడానికి వీలు పడలేదు. ఈ కారణంగానే అవి పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. ప్రజలు వారి సమస్యలను విన్నవించుకోడానికి ప్రజాభవన్‌ను ఒక ప్లాట్‌ఫామ్‌గా ఏర్పాటు చేయడంతో పాటు దరఖాస్తులు రాయలేకపోయినవారికి తగిన ఏర్పాట్లను కూడా అక్కడ చేసినట్టు వివరించాయి.

హెల్ప్ డెస్కులు సైతం..

కొన్ని సందర్భాల్లో ప్రజలు కోరుతున్న అంశానికి ఒకటికంటే ఎక్కువ ప్రభుత్వ విభాగాలతో లింకు ఉండటంతో వాటిని సమన్వయం చేసుకుని నిర్ణయం తీసుకోవడానికి ఆలస్యమవుతున్నదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ కారణంగానే జీహెచ్ఎంసీ, పురపాలక శాఖ, పంచాయతీరాజ్, రెవెన్యూ, వైద్యారోగ్యం, విద్య, సోషల్ వెల్ఫేర్ తదితర విభాగాలకు చెందిన ఉన్నతాధికారులతో పాటు కిందిస్థాయి సిబ్బందిని ప్రజాభవన్‌లో ప్రతి మంగళ, శుక్రవారం జరిగే ప్రజావాణి ప్రోగ్రాంకు పిలిపిస్తున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. ఏ శాఖకు ఇవ్వాలో ప్రజలకు స్పష్టత లేకపోవడంతో అక్కడి నోడల్ సెల్ సిబ్బంది గైడ్ చేస్తున్నారని వివరించాయి. ఇలాంటి సందేహాల నివృత్తి కోసమే ప్రజాభవన్‌లో ప్రత్యేకంగా హెల్ప్ డెస్కును నెలకొల్పినట్టు తెలిపాయి.

ప్రతి అప్లికేషన్‌కు ప్రత్యేక నంబర్

ప్రజల ఫిర్యాదుల స్వభావాన్ని విశ్లేషించిన తర్వాత ప్రజావాణిలో తహశీల్దారు, డీటీ, సీసీఎల్ఏ అధికారులతో పాటు పోలీస్ విభాగం నుంచి సీఐ, డీఐజీ, డీసీపీ ర్యాంకు అధికారులు, వైద్యారోగ్య శాఖ, సంక్షేమ విభాగం నుంచి అదనపు డైరెక్టర్, ఆరోగ్యశ్రీ జనరల్ మేనేజర్ తదితర స్థాయి అధికారులను ప్రజాభవన్‌లో సిద్ధంగా ఉంచినట్టు ప్రభుత్వ వర్గాలు వివరించాయి. దివ్యాంగుల సంఖ్య కూడా గణనీయంగా ఉండటంతో వారి కోసం స్పెషల్ డెస్కును పెట్టామన్నాయి. కొన్ని సందర్భాల్లో దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నందున మధ్యాహ్న భోజన వసతిని కూడా ఏర్పాటు చేసినట్టు గుర్తుచేశాయి. వీలైనంత తొందరగా పరిష్కరించడంపై ఫోకస్ పెట్టినందున ప్రతి అప్లికేషన్‌కూ ఒక నంబర్ ఇచ్చి వాటిని ఆన్‌లైన్‌లో పెట్టడం ద్వారా డిపార్ట్‌మెంట్లు కూడా తొందరగా స్పందించడానికి వెసులుబాటు కలిగినట్టు తెలిపాయి. మొబైల్ నంబర్ ఆధారంగా ఏ ఫైల్ ఏ దశలో ఉన్నదో ఆఫీసర్లు తెలుసుకునే సౌకర్యం ఏర్పడింది.

ట్రాకింగ్ సిస్టం..

ప్రజలు సైతం వారి అప్లికేషన్ ఏ ఆఫీస్ దగ్గర ఏ స్టేజీలో ఉన్నదో తెలుసుకునే ట్రాకింగ్ సిస్టం యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు దాదాపుగా కొలిక్కి వచ్చాయి. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థతో ఆ స్పెషల్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అప్లికేషన్ రిఫరెన్స్ ఐడీ నంబర్‌తో ప్రజలు సైతం వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు కలుగుతుంది. గతంలో ఫిర్యాదు చేసిన ప్రజలే వాటి స్టేటస్‌ను తెలుసుకోడానికి వస్తున్నందున ఈ మెకానిజాన్ని రూపొందించినట్టు డిప్యూటీ సీఎం రివ్యూ సందర్భంగా దివ్య దేవరాజన్ వివరించారు. వచ్చిన అప్లికేషన్లన్నింటినీ స్కానింగ్ చేయడంతో ఎప్పుడైనా డిజిటల్ రికార్డులను పరిశీలించే వెసులుబాటు ఏర్పడింది. దాదాపు యాభై వారాలుగా ప్రజాభవన్‌లో ప్రజావాణి ప్రోగ్రామ్ నిరాటంకంగా జరిగందని ఇటీవల ఒక సందర్భంలో చిన్నారెడ్డి తెలిపారు.

Tags:    

Similar News