వైఎస్సార్ పాలన తరహాలోనే ఆ సిస్టమ్! ప్రగతిభవన్ గడీలు తొలగింపు..?

సీఎం అధికారిక కార్యాలయం ప్రగతిభవన్ ముందున్న గడీలను తొలగించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది.

Update: 2023-12-06 04:06 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం అధికారిక కార్యాలయం ప్రగతిభవన్ ముందున్న గడీలను తొలగించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. ప్రగతిభవన్ మెయిన్ ఎంట్రన్స్ ముందు గుడారం రూపంలో ఉన్న ఐరన్ కంచెను ఎత్తివేయాలని పార్టీ ప్లాన్ చేసింది. రోడ్డును ఆక్రమించి ఉన్న ఈ కంచెను తొలగించడం వలన ప్రజలు సులువుగా రాకపోకలు సాగించవచ్చని కాంగ్రెస్ పార్టీ నేతలందరి నుంచి అభిప్రాయాలు వచ్చాయి. అంతేగాక ప్రహరీ గోడను కూడా ఛేంజ్ చేయాలని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే ప్రగతిభవన్‌ను ప్రజాభవన్‌గా మార్చుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. చీఫ్​మినిస్టర్ కార్యాలయంలో ప్రజాదర్భార్‌ను నిర్వహిస్తామని ఏకంగా మేనిఫెస్టోలోనే పెట్టారు.

దీంతో ప్రజలకు సులువుగా ఎంట్రీ ఇచ్చేందుకు అనువైన మార్పులు చేయనున్నది. ఇక సీఎం‌కు తమ గ్రీవెన్స్‌ను ఇచ్చేందుకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు లేకుండా అన్ని సౌకర్యాలతో ప్రత్యేక హాల్‌ను కూడా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. గతంలో వైఎస్సార్ తరహాలోనే డైలీ ప్రజలను కలిసేందుకు తగినన్నీ ఏర్పాట్లు చేయనున్నారు. సీఎం ప్రమాణ స్వీకారం, క్యాబినేట్ కూర్పు అనంతరం ఇంజినీర్లు, ఆర్ అండ్ బీ అధికారులతో ఈ మార్పులపై చర్చించనున్నారు. సెక్యూరిటీ వ్యవస్థకు సమస్యలు లేకుండానే ప్రజలకు సులువైన యాక్సెస్ ఉండేలా కాంగ్రెస్ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేయబోతున్నట్లు కాబోయే మినిస్టర్ ఒకరు తెలిపారు.

ఇప్పటి వరకు అదో కోట..?

వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో ప్రతీ రోజు తన అధికారిక కార్యాలయంలో ప్రజలను కలిసేశారు. సుమారు 3 నుంచి 5 వేల మందికి తగ్గకుండా సీఎంకు నేరుగా తమ సమస్యలను వినతి పత్రాల రూపంలో ఇచ్చారు. కానీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం పవర్‌లోకి వచ్చాక ఆ సిస్టం ఎత్తేసి, ఖరీదైన బిల్డింగ్‌ను నిర్మించి ప్రజలెవ్వరికి ఎంట్రీ లేకుండా చేశారు. అంతేగాక ప్రగతిభవన్ ముందు దాదాపు పన్నెండు, పదమూడు అడుగులతో ఐరన్ కంచెను ఫిట్ చేసి, సోలార్ పవర్‌ను ఎటాచ్ చేశారు.

కొద్ది రోజులు ఆరోగ్య శ్రీ గ్రీవెన్స్ పేషెంట్ల కోసం సెక్యూరిటీ గేట్ వద్ద ఉన్న షెడ్డును వినియోగించారు. ఆ తర్వాత అది కూడా బంద్ పెట్టారు. పైగా ప్రగతిభవన్ ముందున్న రోడ్డు డివైడర్ మీద కూడా మూడు నాలుగు అడుగులతోనూ ఒక ఐరన్ కంచెను ఏర్పాటు చేశారు. ప్రగతిభవన్ ముందు నుంచి వెళ్లే ప్రజలకు అదో కోటాలనే ప్రదర్శనమిచ్చింది. 200 మీటర్ల సమీపం నుంచే పోలీసులతో పుల్ బందోబస్తు ఉంటుంది. ఇవన్నీ ప్రజలకు యాక్సెస్ లేకుండా చేశాయి. రాజుల పారిపాలనను చూసినట్టే ఉన్నదని చాలా మంది పలుమార్లు అసంతృప్తిని వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కు ఈ బందీ విధానంతోనూ మైనస్ అయ్యిందని మేధావులు చెబుతున్నారు.

ఎమ్మెల్యేలకూ కష్టమే...

బీఆర్‌ఎస్ పాలనతో సీఎం‌ను కలిసేందుకు ఎమ్మెల్యేలకు ఇబ్బందిగానే మారింది. మంత్రులకు కూడా అవకాశం లేదని గతంలో బీఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా పలుమార్లు వ్యాఖ్యనించారు. అపాయింట్‌మెంట్లు లభించవని, ఎమ్మెల్యేలను కూడా సీఎం కలవకపోతే ఎట్లా అంటూ ప్రశ్నించారు. స్వయంగా బీఆర్ఎస్‌లు కూడా పలుమార్లు అంతర్గతంగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రజా కవి గద్దర్ అయితే ఏకంగా నాలుగు గంటలు వరకు ప్రగతిభవన్ ముందు అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూశారు. కానీ లభించలేదు. దీన్ని తెలంగాణ ప్రజానీకమంతా ఖండించింది. ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకూడదని కాంగ్రెస్ జాగ్రత్తలు తీసుకోనున్నది.


Similar News