పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కార ప్రదానోత్సవం

శుక్రవారం రవీంద్రభారతిలో పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కార ప్రదానోత్సవం ఘనంగా జరిగింది.

Update: 2024-09-13 15:08 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పొన్నం సత్తయ్య గౌడ్ 14 వ వర్ధంతి సందర్భంగా పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం ప్రధానం -2024 కార్యక్రమం శుక్రవారం సాయంత్రం రవీంద్రభారతి ఆడిటోరియం లో జరిగింది. బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి అధ్యక్షతన ముఖ్య అతిథులుగా తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, పర్యాటక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు, ఐటీ శాఖ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబులు విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి పొన్నం సత్తయ్య గౌడ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావులు.. ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్, కళాకారులు కొమురమ్మ, మొగులయ్యలకు పొన్నం సత్తయ్య గౌడ్ జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఐటీ, సాంకేతిక పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ... కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కుటుంబం అంటే పొన్నం కుటుంబమే అన్నారు. పొన్నం ప్రభాకర్ మంత్రి అయినప్పటికీ.. అన్నదమ్ములు, అక్క, చెల్లెళ్ల సలహాలు సూచనలతో మసులుకుంటారని అన్నారు.


ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. ఉమ్మడి కుటుంబాలు ఉంటే దైర్యం ఉంటుందని అబ్దుల్ కలాం చెప్పారని.. పొన్నం సత్తయ్య గౌడ్ ఉమ్మడి కుటుంబంను అభినందిస్తున్నా అని.. బలగం సినిమా ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలకు మార్పులు తీసుకొచ్చే విధంగా ఉందని, బలగం సినిమా లో కొమురమ్మ పాట వింటే అందరి కళ్లు చెమర్చాయి. వారికి ప్రభుత్వం తరుపున అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు.


భూమిని నమ్ముకొని ఆదర్శ రైతు పొన్నం సత్తయ్య గౌడ్ అని, తనకు చదువు రాకున్నా కుమారులకు ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రోత్సహించారని, కుటుంబ విలువలను కాపాడుతూ.. ఏనాడూ ప్రచారాన్ని కోరుకొని భూమి పుత్రుడు సత్తయ్య.. అలాంటి వ్యక్తి పేరు మీద కవులకు, కళాకారులను సన్మానించుకొని సత్కరించుకోవడం అభినందనీయం అని తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బలగం సినిమాలో కొమురమ్మ దంపతులు పాడిన పాటలు అభినందనీయం అని.. వారి మాటలు కుటుంబ నేపథ్యం బాధ కలిగించే విషయం అని, వారికి నా జీతం నుండి లక్ష రూపాయలు తక్షణమే అందిస్తున్నామని.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పెన్షన్ ఇచ్చేలా చేస్తానని తెలిపారు.


ఈ సందర్భంగా సినీ గేయ రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ.. పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందని, అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అవార్డు అందుకున్నప్పుడు ఎంత ఆనందం కలిగిందో ఇప్పుడు స్థానిక కళాకారులతో కలిసి అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని చంద్రబోసు అన్నారు. 3500 కి పైగా పాటలు పాడానని, నా పాటకు స్ఫూర్తి ఒగ్గు కళాకారులు కళారూపం అన్నారు. ఈ అవార్డుతో గుండె బరువెక్కిందని నాకు అవార్డుతో సత్కరించిన పొన్నం సుపుత్రులకు ధన్యవాదాలని మొగులయ్య తెలిపారు.


ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సంజయ్, శ్రీగణేష్ , వీర్లపల్లి శంకర్ , నాగరాజు , మేఘారెడ్డి ఏపీ మాజీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ,బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ ,రవాణా రోడ్స్ అండ్ బిల్డింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ , వెలిచాల రాజేందర్ రావు, మాడభూషి శ్రీధర్, సీనియర్ జర్నలిస్టు దిలీప్ రెడ్డి ,రచయిత్రి లక్ష్మి, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరి కృష్ణ , మాజీ ఎమ్మెల్యే అరేపల్లి మోహన్ తదితరులు పాల్గొన్నారు.


Similar News