కేసీఆర్‌తో పొన్నాల లక్ష్మయ్య కీలక భేటీ
తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మాజీ మంత్రి పొన్నాల
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య భేటీ అయ్యారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో పొన్నాల సతీమణి కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన పొన్నాలను శనివారం మంత్రి కేటీఆర్ కలిశారు. పార్టీలో చేరాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. అనంతనం ఇవాళ కేసీఆర్‌తో పొన్నాల భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
సోమవారం జనగామలో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించనున్నారు. ఈ సభలో పొన్నాల బీఆర్ఎస్‌లో చేరుతారని తెలుస్తోంది. జనగామ బీఆర్ఎస్ టికెట్‌ను పొన్నాలకు కేసీఆర్ ప్రకటిస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇవాళ మధ్యాహ్నం జనగామ బీఆర్ఎస్ అభ్యర్ధిగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని ప్రకటించడంతో పాటు ఆయనకు కేసీఆర్ బీఫారం కూడా అందించారు. దీంతో పొన్నాలకు ఏదైనా కీలక పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది.
కాగా కాంగ్రెస్‌లో తనను అవమానాలకు గురి చేశారని, రెండు నెలలుగా అగ్ర నేతల అపాయింట్‌మెంట్ అడిగినా ఇవ్వలేదని పొన్నాల ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని, టికెట్లు ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తూ రేవంత్ రెడ్డిపై పొన్నాల విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి సీనియర్లను పట్టించుకోవడం లేదని, తమకు నచ్చినవారికి టికెట్లు ఇప్పించుకుంటున్నారని ఆరోపించారు.