టీఆర్ఎస్‌ను టెన్షన్ పెట్టిస్తోన్న పొంగులేటి సైలెన్స్.. పార్టీ వీడాలని ఫిక్స అయ్యారా?

దిశ ప్రతినిధి, ఖమ్మం: పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మార్పుపై వెయిట్ అండ్ సీ అంటూ ఆచితూచి అడుగులు వేస్తున్నారా..? తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దనే అనుకుంటున్నారా..?

Update: 2022-09-09 04:50 GMT

దిశ ప్రతినిధి, ఖమ్మం: పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మార్పుపై వెయిట్ అండ్ సీ అంటూ ఆచితూచి అడుగులు వేస్తున్నారా..? తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దనే అనుకుంటున్నారా..? ఇంకాస్త వేచిచూసే ధోరణిలోనే ఉన్నారా..? లేకుంటే టీఆర్ఎన్‌ను వీడకుండా ఏవైనా శక్తులు అడ్డుపడుతున్నాయా..? ఇప్పుడు ఇవే ప్రశ్నలు శీనన్న అనుచరులతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ఇన్నాళ్లూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతారని ఆశించిన ఆయన ముఖ్య అనుచరులతో పాటు తమ గూటికే వస్తారని అనుకున్న బీజేపీ, కాంగ్రెస్ సైతం ఇప్పుడు డైలమాలో ఉన్నాయి.. ఎటువెళ్తారో లేక.. అదే పార్టీలో కొనసాగుతారో తెలియక పొంగులేటి అనుచరులు కూడా సతమతవుతున్నారు. అయితే శీనన్న మాత్రం ఇంకాస్త వేచి చూసే ధోరణిలోనే ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం ఇటీవల ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన అనుచరులకు తనను పార్టీ మారాలని ఒత్తిడి చేయొద్దంటూ సూచించారు. దీంతో ఆయన అనుచరులు మొత్తం ఆలోచనలోకి వెళ్లిపోయారు. ఎందుకు తమ నేత ఒక్కసారిగా ఇలా కూల్ అయిపోయాడంటూ గుసగుసలు పెట్టుకుంటున్నారు.

కారణాలేంటో..?

వాస్తవానికి పొంగులేటి ఎప్పటినుంచో పార్టీ మారాలంటూ ఆయన అనుచరులు, ముఖ్యనేతలు ఒత్తిడి చేస్తున్నారు. పార్టీ మారి ఉమ్మడి జిల్లాలో తమ సత్తా ఏంటో చూపాలంటూ సూచించారు. ఇన్నాళ్లూ శ్రీనివాసరెడ్డి సైతం తనకు జరిగిన అవమానాలను తట్టుకోలేక పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు ఎన్నో ప్రచారాలు జరిగాయి. దీనికి తగ్గట్టుగానే ఇటీవల తాను ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపాయి. ఇక తమ నేత పార్టీ మారడం ఖాయమని అంతా అనుకున్నారు. తన కుమార్తె వివాహం అనంతరం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని అందరూ ఊహించారు. అయితే దీనికి భిన్నంగా పొంగులేటి తన కార్యకర్తలతో.. 'తొందరపడి బోర్లా పడడం ఎందుకని.. కాలం, సందర్భం అన్నీ భగవంతుడే ఇస్తాడని, తప్పకుండా మార్గం చూపిస్తాడంటూ' చెప్పడంతో కారణాలేమై ఉంటాయనే చర్చ జరుగుతోంది..

ఏవైనా శక్తులు అడ్డుకుంటున్నాయా..?

పొంగులేటికి టీఆర్ఎస్ అధిష్టానం ఎన్నోసార్లు హామీలు ఇచ్చి నెరవేర్చలేదు.. ఈ క్రమంలో శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన అభిమానులు, అనుచరులు తీవ్ర నిరాశలో ఉన్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లా నేతలు సైతం పొంగులేటిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. దీంతో పార్టీ మారుతారని ఎప్పటినుంచో ప్రచారం ఊపందుకుంది. అయితే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పొంగులేటి పోటీ చేయడం ఖాయం కాబట్టి ఏదో ఒకపార్టీలోకి వెళ్తారనే చర్చ తీవ్రంగా జరిగింది. ఈలోపే ఆయన కుమార్తె వివాహ వేడుక రావడంతో ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ శీనన్న మాత్రం చాలా కూల్‌గా ఉంటూ తన అనుచరులకు ఇప్పుడు ఎలాంటి నిర్ణయం లేదంటూ చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికలకు ఇంకో ఏడాదిన్నర వరకు టైం ఉంది కాబట్టి.. తొందరపడొద్దనే నిర్ణయానికి వచ్చారని కొందరంటుంటే..? మరికొందరేమో.. మునుగోడు ఎన్నికల ఫలితాల అనంతరం పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. మరికొందరేమో.. టీఆర్ఎస్ అధిష్టానమే ఏదైనా హామీ ఇచ్చి ఉండొచ్చని.. లేకుంటే.. ఏవైనా శక్తులు పార్టీ మారకుండా అడ్డుపడుతున్నాయా..? అనే చర్చ జరుగుతోంది. ఎంపీ టికెట్ ఇవ్వకపోవడంతో గతంలోనే శ్రీనివాసరెడ్డి పార్టీ మారాలనుకున్నా.. టీఆర్ఎస్ పెద్దలు అడ్డుకున్నారని.. ఇప్పుడు కూడా అలాంటిది ఏదైనా జరిగి ఉండొచ్చని కూడా ప్రచారం జరుగుతోంది.

బీజేపీ, కాంగ్రెస్ వల..

టీఆర్ఎస్‌ను వీడి పొంగులేటి వేరే పార్టీలోకి కచ్చితంగా వెళ్తారని గతంలో ఎన్నో ప్రచారాలు జరిగాయి. అప్పట్లో తమ పార్టీలోకి పొంగులేటి రావడం ఖరారైందని కాంగ్రెస్ నేతలు బాహాటంగానే చెప్పారు. మళ్లీ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం వస్తుందని అందరూ సంబురపడ్డారు. బీజేపీ సైతం అప్పట్లో శీనన్న కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఒకానొక సందర్భంగా ఢిల్లీ పెద్దలు సైతం ఆయనకు, ఆయన ముఖ్య అనుచరులకు ఎన్నో హామీలు ఇచ్చారని, ఇక కాషాయ కండువా కప్పుకోవడమే మిగిలుందనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి.. అయినా అవి మాత్రం ఆగలేదు.. పొంగులేటి భవిష్యత్ నిర్ణయం ఎలా ఉన్నా.. కాంగ్రెస్, బీజేపీలు మాత్రం పొంగులేటిని తమ పార్టీల్లోకి లాగేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయనేది వాస్తవం.. పరిస్థితి ఎలా ఉన్నా ఫ్యూచర్లో ఆయన టీఆర్ఎస్‌లోనే కొనసాగతారా..? లేక బీజేపీ, కాంగ్రెస్ ఏదో ఒకపార్టీకి వెళ్లిపోతారా..? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది..

పదవిలేకున్నా జనాల్లోనే..

శ్రీనివాసరెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన అనతికాలంలోనే ఉమ్మడి జిల్లాలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన ఇమేజ్.. పది నియోజకవర్గాల్లో పనిచేస్తుందంటే అతిశయోక్తి కాదు.. ఈ నేపథ్యంలో పదవి నుంచి దూరమైనప్పటికీ పొంగులేటి అనేక సేవా కార్యక్రమాల ద్వారా జనల్లోనే ఉంటున్నారు. అనేక కార్యక్రమాలకు హాజరవుతూ కార్యకర్తలను, అభిమానులు పలకరిస్తున్నారు. ఇటీవల ఆయన కుమార్తె వివాహం వైభవంగా చేసి తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం వినాయక నవరాత్రుల సందర్భంతా రాత్రి పగలూ తేడా లేకుండా మండపాలకు తిరుగుతూ యూత్‌ను ఆకట్టుకుంటున్నారు. వెళ్లిన ప్రతిచోటా చదివింపులు చేస్తూ అందరినోళ్లలో నానుతున్నారు. ఈ క్రమంలో పొంగులేటి బ్రాండ్ ఉమ్మడి జిల్లాలో ఉందని రాజకీయ విశ్లేషకులే అంటున్నారు.

Also Read : TRS కు భారీ షాక్ ఇవ్వబోతున్న బడా నేత.. కారు దిగేందుకు ముహూర్తం ఫిక్స్? 

ఇవి కూడా చ‌ద‌వండి : 

ముఖ్యమంత్రికి మూడో కాన్వాయ్.. ఇకపై మరింత కాస్ట్లీగా KCR పర్యటన

Tags:    

Similar News