ఆందోళనలో పాలిటెక్నిక్ ఫైనలియర్ స్టూడెంట్స్.. శాపంగా మారిన టెక్నికల్ ఫెయిల్యూర్..?
సాంకేతిక విద్యాశాఖ నిర్లక్ష్యం కారణంగా తాము అకడమిక్ ఇయర్ నష్టపోవాల్సి వస్తోందని పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఆందోళనకు దిగారు.
దిశ, డైనమిక్ బ్యూరో: సాంకేతిక విద్యాశాఖ నిర్లక్ష్యం కారణంగా తాము అకడమిక్ ఇయర్ నష్టపోవాల్సి వస్తోందని పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఓ వైపు పరీక్షలు జరుగుతుంటే అన్ని అర్హతలు ఉండి, అన్ని రకాల ఫీజులు చెల్లించిన తమను పరీక్షకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తూ మాసబ్ ట్యాంక్‌లోని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కార్యాలయం ఎదుట ఫైనల్ ఇయర్ విద్యార్థులు గత రెండు రోజులుగా ఆందోళనకు దిగారు.
మంగళవారం నుంచే పాలిటెక్నికల్ పరీక్షలు ప్రారంభం కావడంతో కొంత మంది విద్యార్థులకు హాల్ టికెట్లు డౌన్ లోడ్ అవ్వగా మరి కొంత మందికి డౌన్ లోడ్ అవ్వలేదు. ఇదే విషయంపై పలు మార్లు హాల్ టికెట్ల కోసం కాలేజీల్లో అడిగామని, చివరి నిమిషం వరకు హాల్ టికెట్లు వస్తాయని చెప్పిన కాలేజీ సిబ్బంది పరీక్షలు ప్రారంభమైన రోజున మీరంతా డిటెండ్ అయ్యారని సమాచారం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
చివరి నిమిషంలో ఇలా చెప్పడం ఏంటని ప్రశ్నించిన విద్యార్థులకు ఇదంతా తమ చేతుల్లో లేదని సాంకేతిక విద్యాశాఖ చేతుల్లో ఉందని చెప్పడంతో తామంతా పరీక్షలు రాయకుండానే ఎస్ బీటీఈటీ కార్యాలయం వద్దకు వచ్చామని చెబుతున్నారు. తమ డిటెండ్‌పై అడిగేందుకు వచ్చిన తమతో ఇక్కడి అధికారులు నిర్లక్ష్యంగా సమాధానాలు చెబుతున్నారని.. జరిగిందేదో జరిగిపోయింది, బ్యాక్ లాగ్స్ ఏవైనా ఉంటే ఈసారికి క్లియర్ చేసుకుని వచ్చే ఏడాదిలో చివరి సంవత్సరం పరీక్షలు రాసుకోవాలని చెబుతున్నారని ఆవేదన చెందుతున్నారు.
60 శాతం అటెండెన్స్ ఉన్న తమను పరీక్షకు అనుమతించకుండా 30 శాతం అటెండెన్స్ ఉన్న కొంత మంది విద్యార్థులకు మాత్రం హాల్ టికెట్లు జారీ చేసి పరీక్షలకు అనుమతి ఇస్తున్నారని, సాంకేతిక లోపం వల్లే హాల్ టికెట్ల జారీ విషయంలో తప్పిదం జరిగిందనే అనుమానాలు తమకు ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు. దీనికి బాధ్యులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. మరి ఈ విషయంలో ఉన్నతాధికారులు ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి.
SBTET దగ్గర విద్యార్థుల ధర్నా, అటెండెన్స్ ఉన్న halltickets ఇవ్వకుండ detaine చేసిన SBTET, రొడ్డుకెక్కిన విద్యార్థులు @bandisanjay_bjp @Arvindharmapuri @revanth_anumula @RaghunandanraoM @AbvpHyderabad pic.twitter.com/gZ9gUAJWWx
— Sukumar Vickey (@sukumarpampad) April 26, 2023