దిశ, తెలంగాణ బ్యూరో: రాజకీయ నాయకులకు స్పోర్ట్స్ స్పిరిట్ లేకుండా పోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గెలిచినా, ఓడినా చేతులు కలుపుకోవడమే స్పోర్ట్స్ స్పిరిట్ అని తెలిపారు. అందుకే రాజకీయ నాయకులకు సైతం ఫ్రెండ్లీ పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. జర్నలిస్టులకు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లకు సైతం ఫ్రెండ్లీ పోటీలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో నిర్వహిస్తున్న 'ఖేలో తెలంగాణ.. జీతో తెలంగాణ'లో భాగంగా నిజాం కాలేజీ గ్రౌండ్ లో సోమవారం ఆయన క్రీడా పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా అనేక మల్టీ నేషనల్ కంపెనీల అధిపతులు భారతీయులేనని, వారు సత్తా చాటినట్లే క్రీడల్లోనూ దేశం ఆ స్థాయికి చేరుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. అన్ని రంగాల్లో దూసుకువెళ్తున్న ఇండియా, క్రీడా రంగంలోనూ సత్తా చాటాలనే ఉద్దేశంతో ప్రధాని మోడీ క్రీడలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ లాంటి పోటీల్లో భారత క్రీడాకారులు పతకాలతో మెరిశారని, అదే స్ఫూర్తితో దేశంలోని ప్రతిభ గల క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయి పోటీలకు పంపేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఖేలో ఇండియాలో భాగంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో క్రీడాపోటీలు నిర్వహించాలని ప్రధాని మోడీ ఆదేశించారన్నారు.
ఈ మేరకు తెలంగాణలో మొదటిసారి సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్రీడాపోటీలు నిర్వహిస్తున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. ఖేలో తెలంగాణ.. జీతో తెలంగాణలో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో దాదాపు 40కి పైగా మైదానాల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, రన్నింగ్ తదితర పోటీలు జరుగనున్నట్లు స్పష్టంచేశారు. 7000 మంది క్రీడాకారులు పాల్గొననున్నట్లు వెల్లడించారు. వారిలో 3000 మంది మహిళా క్రీడాకారులున్నట్లు పేర్కొన్నారు. క్రీడలకు సంబంధించి ప్రజల్లో మంచి సానుకూల భావన రావాలని కోరారు.
అన్ని రకాలుగా ముందు వరుసలో ఉన్న దేశం, స్పోర్ట్స్‌లో వెనకబడి ఉందని, తద్వారా ప్రపంచవ్యాప్తంగా దక్కాల్సినంత గౌరవం దక్కట్లేదన్నారు. దేశంలో మారుమూల గిరిజన ప్రాంతాలు, గ్రామాలు, పట్టణాల్లో సహజ క్రీడా సామర్థ్యం ఉన్న వారికి ఈ పోటీలు మరిన్ని నైపుణ్యాలు పెంచుకునేందుకు ఉపయోగపడుతాయని స్పష్టంచేశారు. ఖేలో తెలంగాణ.. జీతో తెలంగాణ పోటీలు నెల రోజుల పాటు రాష్ట్రంలో కొనసాగుతాయని మంత్రి పేర్కొన్నారు. ఈ పోటీల్లో గెలిచిన వారికి బహుమతులతో పాటు రూ.25 లక్షల వరకు ఆర్థికసాయం సైతం అందిస్తున్నట్లు స్పష్టంచేశారు.
మద్యం దుకాణాలు మూసి స్పోర్ట్స్ సెంటర్ తెరవాలి : లక్ష్మణ్
తెలంగాణ అభివృద్ధి జరగాలంటే మద్యం దుకాణాలు మూసి స్పోర్ట్స్ సెంటర్ తెరవాలని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. యువతను ప్రోత్సహించి వారి టాలెంట్ బయటికి తెచ్చేందుకు 'ఖేలో తెలంగాణ.. జీతో తెలంగాణ' మంచి ప్లాట్ ఫాం అని వెల్లడించారు. కనుమరుగవుతున్న గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేందుకు మోడీ ఈ కార్యక్రమానికి పూనుకున్నారన్నారు. త్వరలో తాను హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈ పోటీలను నిర్వహిస్తానని తెలిపారు. క్రీడా రంగంలో రాజకీయ ప్రమేయం ఉందొద్దని మోడీ కృషి చేస్తున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు.
పార్కులు, క్రీడా స్థలాలు కాపాడుకోవాల్సిన బాధ్యత యువతదేనని వెల్లడించారు. ఎన్టీఆర్ స్టేడియంలో రవీంద్రభారతి నిర్మాణాన్ని అడ్డుకొని ఆ గ్రౌండ్ ను కాపాడిన ఘనత యువతదేనని గుర్తుచేశారు. అనంతరం ప్రముఖ కోచ్ పుల్లెల గోపీ చంద్ మాట్లాడుతూ.. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కొన్ని ఏండ్ల క్రితం కేంద్రం క్రీడా శాఖ మంత్రి వద్దకు తెలంగాణకు చెందిన స్పోర్ట్స్ మినిస్టర్ వెళ్తే తనకు ఈ మినిస్ట్రీ ఎందుకు ఇచ్చారో అని ఎడిచాడని, కానీ ఇప్పుడు క్రీడలకు ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నారంటే దానికి కారణం ప్రధాని మోడీ అని కొనియాడారు.