దండకారణ్యంలో యుద్ధ వాతావరణం.. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలపై పోలీసులు ఫోకస్

దండకారణ్యంలో యుద్ద వాతావరణం నెలకొంది. వరుసగా జరుగుతున్న ఎన్​కౌంటర్లు, మావోయిస్టుల దాడులతో దద్దరిల్లుతోంది.

Update: 2023-05-22 15:25 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: దండకారణ్యంలో యుద్ద వాతావరణం నెలకొంది. వరుసగా జరుగుతున్న ఎన్​కౌంటర్లు, మావోయిస్టుల దాడులతో దద్దరిల్లుతోంది. ఓ వైపు పోలీసుల బూట్ల చప్పుళ్లు మరోవైపు కాల్పుల మోతలతో గోదావరి, ఇంద్రావతి నదీ పరివాహక ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. దీంతో ఎప్పుడేం జరుగుతుందో అన్న భయంతో గిరిజనులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతుకుతున్నారు. మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ పరిణామాలు రాష్ర్ట పోలీసు యంత్రాంగంలో కూడా కలవరాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే మావోయిస్టుల కదలికలపై కన్నేసి పెట్టాలని డీజీపీ అంజనీకుమార్​నక్సల్​ప్రభావిత ప్రాంతాల పోలీసు అధికారులను అప్రమత్తం చేయటం గమనార్హం. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం విధుల్లో ఉన్న సిబ్బందిలో 80శాతం మందికి సరైన అనుభవం లేని నేపథ్యంలో వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని కూడా డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు మావోయిస్టులు కూడా యాక్షన్​టీములను సిద్ధం చేసినట్టుగా సమాచారం అందటంతో పోలీసు వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

దంతేవాడ పేలుడుతో...

ఛత్తీస్​ఘడ్​జిల్లా దంతేవాడ జిల్లా అర్నాపూర్‌లో మావోయిస్టులు పకడ్బంధీ వ్యూహం ప్రకారం ఐఈడీని పేల్చిన విషయం తెలిసిందే. దీంట్లో పదిమంది పోలీసు సిబ్బందితోపాటు డ్రైవర్‌గా పని చేస్తున్న ఓ పౌరుడు కూడా చనిపోయాడు. ఈ సంఘటన అటు ఛత్తీస్​ఘడ్.. ఇటు తెలంగాణ పోలీసులను ఉలిక్కిపడేలా చేసింది. దాంతో అప్రమత్తమైన రెండు రాష్ర్టాలతోపాటు ఒడిషా పోలీసులు కూడా మావోయిస్టుల కోసం కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఒడిషాలోని కాళహండి జిల్లా రాంపూర్​పోలీస్​స్టేషన్​పరిధిలోని అటవీ ప్రాంతంలో ముగ్గురు మావోయిస్టులను భద్రతా బలగాలు కాల్చి చంపాయి. తాజాగా ఆదివారం సాయంత్రం ఛత్తీస్​ఘడ్​రాష్ర్టం బీజాపూర్​జిల్లాలో జరిగిన మరో ఎన్​కౌంటర్‌లో ఇద్దరు కోబ్రా కానిస్టేబుళ్లు నకుల్, మహ్మద్​షాహిద్‌లకు బుల్లెట్​గాయాలయ్యాయి. ఈ ఎన్​కౌంటర్‌లో ముగ్గురి నుంచి నలుగురు మావోయిస్టులు కూడా గాయపడినట్టుగా సమాచారం. దీనికి కొన్నిరోజుల ముందే సుక్మా జిల్లాలోని దంతేష్​పురం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్‌లో గోలాపల్లి ఎల్వోఎస్​కమాండర్​మడ్కమ్​ఎర్ర, మహిళా నక్సల్​పొడియం భీమే చనిపోయారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో...

ఇటువంటి పరిస్థితుల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల కదలికలు వెలుగు చూడటం మన రాష్ర్ట పోలీసు ఉన్నతాధికారులను తీవ్ర కలవరానికి గురి చేసింది. తెలంగాణ–ఛత్తీస్​ఘడ్​సరిహద్దుల్లోని చర్ల మండలం పుట్టపాడు అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్​పోలీసులు కూంబింగ్​జరుపుతుండగా మావోయిస్టులు ఎదురు పడ్డారు. ఈ క్రమంలో జరిగిన ఎన్​కౌంటుర్‌లో ఓ మావోయిస్టు చనిపోగా మిగిలినవారు కాల్పులు జరుపుతూ అడవిలోకి పారిపోయారు.

అన్ని గ్రామాలకు వెళ్లండి...

ఈ నేపథ్యంలోనే డీజీపీ అంజనీకుమార్​కొన్ని రోజుల క్రితం తెలంగాణ–ఛత్తీస్​ఘడ్​సరిహద్దు జిల్లాల పోలీస్​ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మావోయిస్టుల కదలికలపై పటిష్టమైన నిఘా వేసి పెట్టాలని సూచించారు. ప్రతీ గ్రామానికి వెళ్లి స్థానికులతో సత్సంబంధాలు ఏర్పురుచుకోవాలని చెప్పారు. అయితే, ప్రస్తుతం మావోయిస్టు ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిలో ఎనభైశాతం మంది కొత్తవాళ్లే ఉండటం అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది. వీళ్లకు మావోయిస్టుల వ్యూహాలపై సరైన అవగాహన లేకపోవటం కలవరాన్ని సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ధీర్ఘకాలంగా పని చేసిన అధికారులతో వీళ్లకు శిక్షణను ఇప్పించాలని డీజీపీ మావోయిస్టు ప్రభావిత జిల్లాల అధికారులకు సూచించారు.

Also Read..

తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట: మంత్రి శ్రీనివాస్ గౌడ్ 

Tags:    

Similar News