ప్లస్సా.. మైనస్సా.. లీక్ కుట్ర కేసుపై బీఆర్ఎస్‌లో చర్చలు
టెన్త్ పేపర్ లీకేజీ కేసులో ప్లస్సా ?మైనస్సా? అని చర్చ అధికార పార్టీలో జరుగుతున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో : టెన్త్ పేపర్ లీకేజీ కేసులో ప్లస్సా ?మైనస్సా? అని చర్చ అధికార పార్టీలో జరుగుతున్నది. ఈ కేసు ద్వారా ఏ మేరకు రాజకీయ ప్రయోజనం వస్తుందని లెక్కలు వేస్తున్నారు. అదే సమయంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఎపిసోడ్‌ను డైవర్ట్ చేయగలిగామా? అని ఆరా తీస్తున్నారు. టెన్త్ పేపర్ లీకేజీలో బీజేపీ కుట్ర ఉందని మంత్రులు, ఎమ్మెల్యేలు వరసగా ప్రెస్‌మీట్స్ పెట్టి విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే అంశంపై బీఆర్ఎస్ శ్రేణులు అందోళనలు చేశాయి. అయితే ఇంత చేసినా బీజేపీని ఇరికించ గలిగమా? అనే అనుమానం బీఆర్ఎస్ లీడర్లలో ఉంది.
- టీఎస్సీఎస్సీ లీకేజీ డైవర్ట్ అయినట్టేనా?
సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీలో ప్రభుత్వం ఇరుకున పడింది. పేపర్లు బయటికి వెళ్తుంటే కమిషన్ ఏం చేస్తుందని విమర్శలు వచ్చాయి. అందుకు నైతిక బాధ్యతగా కమిషన్ రాజీనామా చేయాలని డిమాండ్లు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని వర్సీటీల్లో ఇదే అంశంపై అభ్యర్థులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. నిరుద్యోగుల్లో ప్రభుత్వం పట్ల అపనమ్మకం పెరిగిందనే ప్రచారం జరిగింది. ఇదే అంశాన్ని రాజకీయ ఎజెండాగా మార్చుకుని విపక్షాలు అందోళనలు తీవ్రం చేశాయి. ఇలాంటి సమయంలో టెన్త్ పేపర్ లీకేజీ కేసుతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసిందని చర్చ బీఆర్ఎస్ లీడర్లలో ఉంది.
కేసు తుస్ మంటుందనే అనుమానం
పేపర్ లీకేజీ వ్యవహారంలో బండి సంజయ్ ప్రమేయం ఉందని ఆరోపిస్తోన్న పోలీసులు అందుకు సంబంధించిన అధారాలను చూపించలేకపోయారని బీఆర్ఎస్ లీడర్లు ఫీలవుతున్నారు. రాజకీయ ఒత్తిళ్ల మేరకే పోలీసులు సంజయ్‌పై కేసు పెట్టారని సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయోమనని ఆందోళన చెందుతున్నారు. గతంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర పన్నారని పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆ సమయంలో పోలీసులు పెద్దఎత్తున హంగామా చేశారు. అలాగే ఫామ్ హౌజ్‌లో గులాబీ ఎమ్మెల్యేలను కొనేందుకు కేంద్ర బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నారని కేసు నమోదు చేశారు. ఈ రెండు కుట్ర కేసుల్లో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందే తప్పా ప్రయోజనం కలగలేదని అభిప్రాయాలు ఉన్నాయి. అలాగే టెన్త్ పేపర్ లీకేజీ కేసులో కూడా నెగిటివ్ వస్తుందా? అని గుబులు బీఆర్ఎస్ లీడర్లుకు పట్టుకుంది.