CMRF బెనిఫిషియర్స్ టార్గెట్.. ఎలక్షన్ కౌంట్ డౌన్ వేళ BRS బిగ్ స్కెచ్!
అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే పలు స్కీమ్‌లను లాంఛనంగా ప్రారంభించి ఆన్-గోయింగ్‌గా చెప్పుకోడానికి సర్కారు పావులు కదిపింది.
దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే పలు స్కీమ్‌లను లాంఛనంగా ప్రారంభించి ఆన్-గోయింగ్‌గా చెప్పుకోడానికి సర్కారు పావులు కదిపింది. రైతుబంధు లాంటివి నవంబరులో తెరమీదకు రావడానికి సిద్ధమవుతున్నాయి. వీటికి తోడు సీఎంఆర్ఎఫ్ (చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్) చెక్కుల పంపిణీకి సైతం ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక మొదలైంది. ప్రభుత్వం దగ్గర ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న సుమారు రెండు లక్షల దరఖాస్తులను క్లియర్ చేయడంపై ఆలోచనలు జరుగుతున్నాయి.
పోలింగ్ సమయం నాటికి వీటన్నింటినీ క్లియర్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల ప్రధానాధికారి పర్మిషన్ తీసుకున్న తర్వాత ఫండ్స్ రిలీజ్‌పై దృష్టి సారించనున్నది. సీఈఓ నుంచి పర్మిషన్ రాగానే ఆలస్యం కాకుండా ఫండ్స్ రిలీజ్ చేయడం కోసం రెవెన్యూ శాఖకు ఇప్పటికే ఓరల్ ఆర్డర్స్ జారీ అయినట్టు సచివాలయ వర్గాల సమాచారం.
కోడ్ అమల్లోకి రావడం కన్నా ముందే అప్లికేషన్లు అందినందునా వాటికి సీఎంఆర్ఎఫ్ నుంచి సాయాన్ని అందించడానికి ఎలాంటి ఆంక్షలు ఉండవనేది ప్రభుత్వ వర్గాల వాదన. కానీ విపక్షాలు లేదా ఇతరుల నుంచి ఫిర్యాదులు వస్తే ఈ ప్రాసెస్ ఆగిపోతుందనే ఉద్దేశంతో ముందుగానే సీఈఓ ద్వారా ఎన్నికల సంఘం నుంచి పర్మిషన్ తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అందిన దరఖాస్తుల విషయంలోనూ ఎలక్షన్ కమిషన్ నుంచి సానుకూల స్పందన వస్తే వాటికి కూడా సాయాన్ని అందించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది.
నాలుగు నెలలుగా పెండింగ్‌లో..
రోజుకు కనీసంగా వెయ్యికి పైగా దరఖాస్తులు సీఎంఆర్ఎఫ్ కోసం ఎమ్మెల్యేల నుంచి ప్రభుత్వానికి అందుతూ ఉంటాయి. నాలుగు నెలలుగా వీటి స్క్రూటినీ జరిగినా ఆర్థిక సాయం అందించడంలో సీఎం క్లియరెన్స్ కోసం పెండింగ్‌లో ఉన్నాయి. దాదాపు రెండు లక్షల అప్లికేషన్లు ఫండ్స్ కోసం వెయిటింగ్‌లో ఉన్నట్టు సచివాలయ అధికారుల సమాచారం. ఒక్కో అప్లికేషన్‌కు ఎంత మంజూరు చేయాలనేది ప్రభుత్వం నుంచి వచ్చిన ఆమోదం మేరకు రెవెన్యూ శాఖ నిధులను విడుదల చేస్తుంది.
ఆర్థిక సమస్యల కారణంగా నాలుగు నెలలుగా ఆగిపోవడంతో ఇప్పుడు ఎన్నికల సమయంలో పొలిటికల్ మైలేజ్ కోసం దరఖాస్తుదారులకు చెక్కుల ద్వారా నిధులను రిలీజ్ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఎమ్మెల్యేల ద్వారా ప్రభుత్వానికి సీఎంఆర్ఎఫ్ సాయం కోసం వచ్చే దరఖాస్తులకు సీఎం కార్యాలయంలో ఆమోదం పొందిన తర్వాత మంజూరైన మొత్తాన్ని చెక్కుల రూపంలో పేదలకు ఆ ఎమ్మెల్యేలే పంపిణీ చేయడం ఆనవాయితీగా కొనసాగుతున్నది.
కానీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడంతో ఎమ్మెల్యేలకు బదులుగా జిల్లా కలెక్టర్లు లేదా ఆఫీసర్ల ద్వారా చెక్కులను అందజేయనున్నట్టు సీఈఓకు ప్రభుత్వం వివరించాలనుకుంటున్నది. ఏ రూపంలో పేదలకు ఈ సాయం వెళ్లినా అది పొలిటికల్ మైలేజ్‌గా ఉపయోగపడుతుందనేది అధికార పార్టీ ఆలోచన. ఇప్పటికే పలు స్కీములను ఆన్-గోయింగ్ అని చెప్పుకోవడం కోసం ప్రభుత్వం మొక్కుబడిగా ప్రారంభించిందనే విమర్శలు ఉన్నాయి. మరి ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందన్నది కీలకంగా మారింది.
ఎల్ఓసీకి వెంటవెంటనే ఆమోదం
ప్రస్తుతం ఆస్పత్రుల్లో వైద్య చికిత్స పొందుతున్నవారు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థికంగా సాయం పొందడానికి ఎల్ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) రూపంలో దరఖాస్తు చేసుకుంటారు. ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్న డాక్టర్ ద్వారా ఈ దరఖాస్తులు పూర్తి కేస్ హిస్టరీతో పాటు ప్రభుత్వానికి సమర్పిస్తారు. ట్రీట్‌మెంట్ కోసం అప్పటికప్పుడు ప్రభుత్వ సాయం అవసరం కావడంతో దీన్ని మెడికల్ ఎమర్జెన్సీగా భావించి ఫండ్స్ రిలీజ్ చేయాలని ప్రభుత్వం ఎత్తులు వేస్తున్నది. ఎలక్షన్ కోడ్ ఉన్నా దీనిని మెడికల్ ఎమర్జెన్సీ పేరుతో నెట్టుకురావాలని భావిస్తున్నది. మరి కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ వీటి విషయంలో సత్వరం స్పందించాలన్నది ప్రభుత్వ ఆలోచన.