నేరాల నియంత్రణకు 'పీడీ' అస్త్రం.. ఎనిమిదిన్నరేండ్లలో ఎన్ని కేసులో తెలుసా?

వరుసగా నేరాలు చేస్తున్న వారికి చెక్ పెట్టడానికి రాష్ట్ర పోలీసులు పీడీ యాక్ట్‌ను ప్రయోగిస్తున్నారు.

Update: 2023-02-15 02:34 GMT

వరుసగా నేరాలు చేస్తున్న వారికి చెక్ పెట్టడానికి రాష్ట్ర పోలీసులు పీడీ యాక్ట్‌ను ప్రయోగిస్తున్నారు. రౌడీలు, గూండాలను నియంత్రించడానికి దీన్ని ఒక అస్త్రంగా వాడుకుంటున్నారు. అయితే అప్పుడప్పుడు ఈ చట్టం దుర్వినియోగమవుతున్నదనే విమర్శలుండగా, శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఈ చట్టాన్ని ప్రయోగిస్తున్నామని పోలీసులు అంటున్నారు.

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో:

పీడీయాక్ట్ నమోదైతే సులభంగా తప్పించుకునే వీలుండదు. మూడు నెలల నుంచి సంవత్సరం వరకు జైల్లో గడపక తప్పని పరిస్థితి ఉంటుంది. నేరం జరగక ముందే నేరానికి పాల్పడవచ్చని, నేరానికి పాల్పడి మళ్లీ చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేయొచ్చని భావించే పాత నేరస్తులను ముందస్తుగా అరెస్ట్ చేయటానికి పీడీ యాక్ట్‌ను ప్రయోగిస్తున్నారు.

ఎఫ్ఐఆర్ ఉండదు..

పీడీ యాక్ట్ ప్రకారం ఎవరినైనా అరెస్టు చేస్తే దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు కాదు. పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలంటే జిల్లాల్లో ఎస్పీ, కమిషనరేట్ పరిధిలో కమిషనర్ అనుమతి తప్పనిసరి. సదరు వ్యక్తి అరెస్టును సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సైతం అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్రూవల్ రావటానికి 12 నుంచి 14 రోజులు పడుతుంది. అన్ని రోజులు అరెస్టయిన వ్యక్తి జైల్లో ఉండాల్సిందే.

ప్రభుత్వం అప్రూవ్ చేయకపోతే అరెస్టయిన వ్యక్తి వెంటనే విడుదల అవుతాడు. అప్రూవ్ చేస్తే అరెస్టయిన వ్యక్తి అడ్వయిజరీ కమిటీ ముందు హాజరై తను పీడీ యాక్ట్ కిందకు ఎందుకు రానో అన్నదానిపై వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. కమిటీ సంతృప్తి చెందితే విడుదలకు ఆదేశాలిస్తుంది. అయితే, ఈ ఆదేశాలను ప్రభుత్వం కచ్చితంగా పాటించాలని లేదు.

ఇక, కమిటీ సంతృప్తి చెందక పోతే అరెస్టయిన వ్యక్తి జైలుకు పోవాల్సిందే. ఇలా జైలుకు వెళ్లిన మూడు నెలల తరువాత విషయం పీడీ యాక్ట్ బోర్డు ముందుకు వస్తుంది. సదరు వ్యక్తిపై తీసుకున్న చర్యను బోర్డు ఆమోదిస్తే సంవత్సరంపాటు జైల్లో మగ్గిపోవాల్సిందే. ఇక్కడ అరెస్టయిన వ్యక్తికి హైకోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. హైకోర్టు స్టే మంజూరు చేస్తే తప్ప అరెస్టయిన వ్యక్తి బయటకు రావటానికి మార్గం సుగమం కాదు. అయితే, పీడీ యాక్ట్ ప్రకారం అరెస్టయిన వారికి హైకోర్టు నుంచి స్టే రావటం చాలా అరుదని సీనియర్ పోలీస్ అధికారులు చెబుతున్నారు.

తొమ్మిదేండ్లలో 2500కు పైగానే కేసులు

ప్రత్యేక తెలంగాణ ఏర్పడి నుంచి ఇప్పటి వరకు రెండున్నర వేలకు పైగా పీడీ యాక్ట్ కేసులు నమోదయ్యాయి. అయితే పీడీ యాక్ట్ నమోదైన వారిలో గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఫస్ట్ ఎమ్మెల్యే కావడం గమనార్హం. ఇటీవల బీడీపీఎస్ విద్యార్థినిని కిడ్నాప్ చేసిన కేసులో వినయ్ రెడ్డి అనే వ్యక్తిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. గంజాయి, మత్తు పదార్థాలు అమ్ముతున్న వారు, హంతకులు, రౌడీషీటర్లు, పదేపదే నేరాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు పీడీ యాక్ట్ కింద కేసులు పెడుతున్నారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత నమోదైన పీడీ కేసులు

సంవత్సరం        నమోదైన కేసుల సంఖ్య

2014                   29

2015                  275

2016                  348

2017                 162

2018                 385

2019                360

2020                350

2021                664

2022                ౧౦౧

ఇవి కూడా చదవండి ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌లో బిగ్ ట్విస్ట్.. MLC కవిత భర్తపై ఈడీ ఫోకస్!

Tags:    

Similar News