Mahesh Kumar: గూడెం మహిపాల్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నాం: మహేశ్ కుమార్ గౌడ్
పటాన్ చెరు కాంగ్రెస్ రగడపై పీసీసీ చీఫ్ హాట్ కామెంట్స్ చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: పటాన్ చెరు (Patan Cheru) నియోజకవర్గంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వర్సెస్ కాటా శ్రీనివాస్ వర్గాల మధ్య రచ్చపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud) హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో విషయంలో మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy) చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడిన వ్యాఖ్యలతో పాటు క్యాంపు కార్యాలయంపై దాడి ఘటనపై కూడా పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలిస్తుందన్నారు. శుక్రవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. మా కమిటీకి మూడో కన్ను కూడా ఉందని అన్ని చూస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన చోట పాత, కొత్త నేతల మధ్య ఇబ్బంది ఉన్నమాట వాస్తవం అని అంగీకరించారు. ఇబ్బందిని తొలగించేందుకు పార్టీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. పార్టీ నియమించిన కమిటీ నివేదిక ఇచ్చాక దానిపై ఏ చర్య తీసుకోవాలో అది తీసుకుంటామన్నారు.